భారీగా విదేశీ సిగరెట్ల పట్టివేత
వాణిజ్యపన్నుల శాఖ బుధవారం రాత్రి ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో విదేశీ సిగరెట్ల నిల్వలను వెలుగులోకి తెచ్చింది. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో సిగరెట్ అక్రమ రవాణా ఏజెంట్ల గోడౌన్లు, ఇతర అడ్డాలపై జరిపిన దాడుల్లో రూ. 5కోట్ల విలువైన సిగరెట్ కార్టన్లను సీజ్ చేశారు. బ్లాక్, మోండ్, ఎస్సె, డన్హిల్, కేమల్, ఎల్.ఎమ్ బ్రాండ్లతో గల విదేశీ ప్రీమియం సిగరెట్లతో పాటు పారిస్, విన్, ఇంపాక్ట్, ఎలవెన్ 10, రూలి రివర్, రిచ్‌మ్యాన్, వేణుస్ తదితర బ్రాండ్లతో గల లోకల్ సిగరెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
అయితే గత కొన్నేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా పాన్‌షాపులు, ఇతర హోల్‌సేల్ దుకాణాల్లో కోట్లాది రూపాయల విలువైన సిగరెట్లు విక్రయించడం గమనార్హం. కాగా సీజ్ చేసిన అక్రమ విదేశీ సిగరె ట్ కార్టన్లకు సంబంధించి రూ. కోటి వరకు పన్ను రూపంలో వాణిజ్యపన్నుల శాఖ వసూలు చేయనుంది. కమిషనర్ అనిల్‌కుమార్, ఎన్ఫోర్స్మెంట్ అదనపు కమిషనర్ రేవతి రోహిణిల నేతృత్వంలో జరిగిన ఈ దాడుల్లో హైదరాబాద్ బేగంబజార్‌కు చెందిన ప్రధాన డీలర్‌తో పాటు పలువురిని గుర్తించారు. వాణిజ్య పన్నుల శాఖకు రావలసిన పన్ను వసూలు నోటీసులు జారీ చేసి, చేతులు దులుపుకున్నారు.