Revenue Authority
-
బ్లాక్‌ల వారీగా గుర్తింపు.. ఇక కూల్చివేతలే!
సాక్షి, హైదరాబాద్: సుందరీకరణలో భాగంగా మూసీ నది తీరప్రాంతాల్లో అక్రమ నిర్మాణాల తొలగింపునకు రెవెన్యూ యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పరీవాహక ప్రాంతంలో టౌన్ ప్లానింగ్ సర్వే ద్వారా బ్లాక్‌ల వారీగా ఆక్రమిత నిర్మాణాలను గుర్తించింది. మండలాల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసి అక్రమ నిర్మాణాల జాబితాను ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శిస్తోంది. వాటిపై అభ్యంతరాలను స్వీకరించి సమగ్రంగా పరిశీలించనుంది. అనంతరం ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా అక్రమ నిర్మాణాలను తొలగింపునకు మార్గం సుగుమమం చేసుకుంటోంది. రెండున్నరేళ్ల క్రితమే.. ► నగరంలోని మూసీ పరీవాహక ప్రాంతంలో ఆరు వేలకుపైగా ఆక్రమణ నిర్మాణాలు ఉన్నట్లు అధికార యంత్రాంగం గుర్తించింది. రెండున్నరేళ్ల క్రితం హైదరాబాద్ జిల్లా రెవెన్యూ యంత్రాంగం, మూసీ రివర్ అథారిటీ సంయుక్తంగా సర్వే నిర్వహించి సుమారు ఆక్రమణల సంఖ్య 8,529 పైనే ఉన్నట్లు తేల్చారు. ఇందుకు అప్పట్లో తొమ్మిది బృందాలు రంగంలో దిగి మూసీ నది పారుతున్న ఎనిమిది మండలాల పరిధిలో వాస్తవ పరిస్థితిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేశాయి. ► మండలాల వారీగా మూసీ నది మొత్తం, పొడవు, ఆక్రమణల ఫొటోలు, వీడియోగ్రాఫ్‌లతో పాటు కేటగిరీల వారీగా పూర్తి స్థాయి వివరాలు సేకరించారు. పరీవాహక ప్రాంతాంలో మండల వారీగా ఆక్రమణల సంఖ్య పరిశీలిస్తే.. ఆసిఫ్‌నగర్ మండలంలో ఆక్రమణల సంఖ్య 667, అంబర్‌పేట పరిధిలో 989, బహదూర్‌పురా 4,225, చార్మినార్ 73, గోల్కొండ 517, హిమాయత్‌నగర్ 499, నాంపల్లి 658, సైదాబాద్ పరిధిలో 902 ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సర్వే మరోసారి.. మూసీ సుందరీకరణ వైపు వేగంగా అడుగులు పడుతుండటంతో ఆక్రమణలను గుర్తించేందుకు రెవెన్యూ, ఇరిగేషన్, మూసీ రివర్‌ఫ్రంట్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో మరోసారి సర్వే కొనసాగుతోంది. ఇప్పటికే గోల్కొండ, ఆసిఫ్‌నగర్, బహదూర్‌పురా, చార్మినార్, నాంపల్లి, హిమాయత్‌నగర్, సైదాబాద్, అంబర్పేట్ మండలాల్లో పూర్తయింది. మొత్తం మీద నదిలో 978, బఫర్‌జోన్‌లో నదికి ఇరువైపులా 5,501 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు తేల్చారు. (క్లిక్: తెలంగాణలో పెరుగుతున్న భూముల ధరలు.. ఖజానాకు ‘భూమ్’) ఇరువైపులా 50 మీటర్ల పరిధి.. మూసీ ఒడ్డు నుంచి ఇరువైపులా 50 మీటర్ల చొప్పున బఫర్ జోన్లో గుర్తించిన నిర్మాణాలను కూల్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రత్యేక నోటీఫికేషన్ల ద్వారా ఆక్రమణల వివరాల జాబితాలను ప్రకటించి వాటిని ఆర్డీఓ, తహసీల్దార్ ఆఫీసులు, పీఎస్‌లు, మున్సిపల్, సంబంధిత ప్రభుత్వ ఆఫీసుల నోటీసు బోర్డుల్లో ప్రదర్శించారు. అభ్యంతరాలుంటే సరైన డాక్యుమెంట్లతో పక్షం రోజులుగా సంబంధిత తహసీల్దార్, ఆర్డీఓ ఆఫీసులో తెలియజేసేలా రెవెన్యూ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఆ తర్వాత ఏకకాలంలో పోలీసుల బందోబస్తుతో కూల్చివేతలు చేపట్టనుంది. (చదవండి: భ్రాంతిగా మారిన తెలంగాణ సంపర్క్ క్రాంతి) -
టార్గెట్ రూ.800 కోట్లు!
- జంట జిల్లాల్లో క్రమబద్ధీకరణపైనే ఆశలన్నీ.. - ఈ నెలాఖరులోగా దరఖాస్తుల పరిశీలన పూర్తికి ఆదేశాలు - వచ్చే నెల 15 నుంచి పట్టాల పంపిణీకి సన్నాహాలు సాక్షి. సిటీబ్యూరో: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉచిత పట్టాల పంపిణీ పూర్తి చేసిన రెవెన్యూ యంత్రాంగం.. ఇక సొమ్ము చెల్లించే కేటగిరి, జీఓ మార్పిడి దరఖాస్తులపై దృష్టిసారించింది. క్రమబద్ధీకరణ ప్రక్రియ ద్వారా రూ.800 కోట్ల ఆదాయం రాబట్టవచ్చునని రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు. జీవో 59 ప్రకారం ఈ కేటగిరికి చెందిన దరఖాస్తులు స్వీకరించినప్పడే...మార్కెట్ విలువలో 10 శాతం మూలధనం వాటా కింద ప్రాథమికంగా రూ.80 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ప్రక్రియలో భాగంగా మిగిలిన వాయిదా పద్ధతులతో వచ్చే సొమ్ముకు తోడు మార్పిడి దరఖాస్తుల క్రమబద్ధీకరణ ద్వారా అధిక ఆదాయం రావచ్చునని భావిస్తున్నారు. దరఖాస్తుల పరిశీలన ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని తహశీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియ వేగవంతం చేయటం ద్వారా వచ్చే నెల 15 నుంచి పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. కొత్తగా చెక్ మెమో జీవో నెంబరు 59కి సంబంధించి ప్రభుత్వం గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను సవరిస్తూ దరఖాస్తుల పరిశీలన నిమిత్తం కొత్త చెక్ మెమోను తాజాగా జారీచేశారు.ఈ చెక్ మెమోలో దరఖాస్తుదారుడు, కుటుంబ సభ్యుల వివరాలతో పాటు భూమి, నిర్మాణంపై ఎక్కువ అంశాలను పొందుపర్చారు. క్రమబద్ధీకరణ కోరుతున్న భూమి నలువైపులా ఫోటోలు, తప్పనిసరిగా సేకరించాల్సి ఉంటుంది. దరఖాస్తులో పేర్కొన్న భూమిలో నిర్మాణం ఉన్న విస్తీర్ణం, ఖాళీజాగా వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి. సదరు భూమి యూఎల్సీ పరిధిలోనిదా, అభ్యంతర కరమైనదా లేదా అభ్యంతరం లేనిదా.. అన్న విషయాన్ని తప్పనిసరిగా పేర్కొనాల్సింది. ఒకేసారి చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోగా దరఖాస్తుదారు ఒకేసారి సొమ్ము చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ఇవ్వాల్సి ఉంటుంది. పరిశీలన అనంతరం పూర్తి సొమ్మును చెల్లించిన వారికి రిజిస్ట్రేషన్ చేసి కన్వీనియన్స్ డీడ్లను అందజేస్తారు. వాయిదాల పద్ధతిన సక్రమంగా చెల్లిస్తున్నవారికి మాత్రం ఎండార్స్మెంట్ పత్రాలను అందజేస్తారు. మార్పిడి దరఖాస్తులపైనే... ప్రభుత్వ ప్రాధాన్యతల్లో భాగంగా రెవెన్యూ శాఖ దృష్టంతా ఉచితం నుంచి సొమ్ము చెల్లించే కేటగిరికి మార్పిడి చేసిన దరఖాస్తులపైన్నే సారిస్తున్నది. ఉచిత క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా 125 చదరపు గజాల ఆక్రమిత స్థలంలో ఇళ్ళు నిర్మించుకున్న వారు 2.11 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, ఇందులో 99,850 మందికి మాత్రమే సర్కారు పట్టాలు పంపిణీ చేసింది. మిగిలిన దరఖాస్తులను పరిశీలించిన రెవెన్యూ యంత్రాంగం ఉచితం(జీవో 58) నుంచి 13,543 దరఖాస్తులను సొమ్ము చెల్లించే( జీవో 59) కేటగిరికి మార్పిడి చేసింది. వీరందరికి జీవో 59 ప్రకారం వాయిదా పద్ధతిలో సొమ్ము చెల్లించాలని రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేస్తున్నది. -
డిఫెన్స్ భూములపై సర్కారు కన్ను
- వివిధ ప్రాంతాల్లో ఉన్న మిలటరీ భూములపై ఆరా - వినియోగంలో లేని భూములను సర్వే చేయాలని ఆదేశం - రంగంలోకి దిగిన రెవెన్యూ యంత్రాంగం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా డిఫెన్స్ భూములపై సర్కారు కన్నేసింది. వివిధ ప్రాంతాల్లోని మిలటరీ విభాగాల ఆధీనంలో.. ఎన్నెన్ని ఎకరాల భూమి ఉందనే అంశంపై ఆరా తీస్తోంది. ప్రత్యేకించి మిలటరీ విభాగాలకు గత ప్రభుత్వాలు కేటాయించిన భూముల్లో ఎంతమేరకు ఆయా విభాగాలు వినియోగించుకోవడం లేదన్న(ఖాళీగా ఉన్న భూములు) అంశంపై సర్కారు దృష్టిపెట్టింది. దీంతో మిలటరీ భూముల్ని సర్వే చేసేందుకు రెవెన్యూ యంత్రాంగం రంగంలోకి దిగింది. ఇప్పటికే మిలటరీ భూములు అధికంగా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను రెవెన్యూ ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. వెనువెంటనే తక్షణం వివరాలు సేకరించాలని కలెక్టర్లు మిలటరీ భూములున్న మండల తహశీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. వినియోగంలో లేని భూములను స్వాధీనం చేసుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సర్కారు సూచించినట్లు తెలిసింది. జంట జిల్లాల్లో ఏడువేల ఎకరాలు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో సుమారు ఏడువేల ఎకరాల ప్రభుత్వ భూమి వివిధ మిలటరీ విభాగాల ఆధీనంలో ఉంది. ఇందులో రంగారెడ్డి జిల్లా పరిధిలోని రాజేంద్రనగర్, బాలనగర్, మల్కాజిగిరి, ఇబ్రహీంపట్నం మండలాలకు చెందిన భూమి 3,000 ఎకరాలుండగా, హైదరాబాద్ జిల్లాలోని బండ్లగూడ, తిరుమలగిరి, గోల్కొండ, షేక్‌పేట్, మారేడ్‌పల్లి, ఆసిఫ్‌నగర్ మండలాల పరిధిలో సుమారు 3,000 ఎకరాలు మిలట రీ ఆధీనంలో ఉంది. స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ ప్రభుత్వం తెచ్చిన డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం బలవంతపు(ఎప్పుడైనా, ఎక్కడైనా) భూసేకరణ జరిగే ది. బేగంపేట్, దుండిగల్, హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ సంస్థల ఆధీనంలో ఉన్న భూములు ఈ చట్టం ప్రకారం తీసుకున్నవే. 1964లో కేం ద్రం తెచ్చిన ‘రిక్విజేషన్ అండ్ ఎక్విజేషన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ యాక్ట్’ ప్రకారం వివిధ డిఫెన్స్ ఏజెన్సీలు తమ సంస్థలను ఏర్పాటు చేసుకునేందుకు భూములను ప్రభుత్వం నుంచి తీసుకున్నాయి. ఈ చట్టం ప్రకారమే.. గత ప్రభుత్వాలు డీఆర్డీఎల్, డీఎంఆర్ఎల్, బీడీఎల్, డీఎల్ఆర్ఎం వంటి డిఫెన్స్ పరిశోధన సంస్థలు, ఆర్టిలరీ, ఎయిర్‌ఫోర్స్.. వంటి మిలటరీ సంస్థలకు పెద్దెత్తున భూములను కేటాయించాయి. రిక్విజేషన్ అండ్ ఎక్విజేషన్ పద్ధతిన ప్రభుత్వం కేటాయించిన భూములకు ప్రతిఏటా లీజు చెల్లించాలి. తమ సంస్థలను విస్తరించుకునేందుకు అవసరమైన మేరకు సొమ్ము చెల్లించి భూసేకరణ చేయించుకోవాలి. 1985 నుంచి ఇప్పటివరకు కొన్ని మిలటరీ సంస్థలు లీజు చెల్లింకపోవడం, తమ సంస్థల విస్తరణను నిలిపివేయడం తాజాగా సర్కారు దృష్టికి వచ్చింది. ఆ జాగాలను ఖాళీ చేయిస్తారా.. హైదరాబాద్‌కు అవసరమైన హంగు, ఆర్భాటలను నెలకొల్పేందుకు ఎంతో స్థలం అవసరం కానుంది. ఈ నేపథ్యంలోనే.. వినియోగంలో లేని మిలటరీ భూములను స్వాధీనం చేసుకొని, ఆయా జాగాలను రాష్ట్ర అవసరాలకు వినియోగించాలని సర్కారు భావిస్తోంది. -
పట్టా పాస్‌పుస్తకాలతో ఆధార్ సీడింగ్!
రాష్ట్రవ్యాప్తంగా అమలుకు సీసీఎల్ఏ అధికారుల కసరత్తు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భూ అక్రమాలకు కళ్లెం వేయాలని సర్కారు నిర్ణయించింది. వ్యవసాయ భూమి కలిగిన ప్రతీ పట్టాదారుకు తప్పనిసరిగా ఆధార్ సీడింగ్ చేయాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించింది. ఆ మేరకు అన్ని జిల్లాల్లోనూ భూములు కలిగిన యజమానుల వద్ద ఉన్న పట్టాదార్ పాస్‌పుస్తకాలకు ఆధార్ నంబరును అనుసంధానం చేసేందుకు సీసీఎల్ఏ అధికారులు సన్నద్ధమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం అమలు కోసం జాతీయ సమాచార కేంద్రం(ఎన్ఐసీ) అధికారులతో కలసి కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా.. పట్టాదార్ పాస్‌పుస్తకాలకు ఆధార్‌ను అనుసంధానం చేయడం ద్వారా ఏ రైతుకు ఏ ప్రాంతంలో ఎంత భూమి ఉందన్న మొత్తం సమాచారాన్ని ఇట్టే తెలుసుకునేందుకు వీలు కలుగనుంది. అలాగే.. రైతులు కూడా సర్కారు రికార్డుల్లో తమ భూముల వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకునేందుకు వెసులుబాటు కలగనుంది. వారి భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో ఇతరులెవరైనా అక్రమంగా పేర్లు మార్చడం, ఒకరి భూములను వేరొకరి పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయడం.. వంటి అవకతవకలను నివారించేందుకు ఆధార్ అనుసంధానం ఎంతగానో దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు. రైతులకు ప్రభుత్వం అందించే వివిధ పథకాలను పారదర్శకంగా అమలు చేసేందుకు కూడా ఈ విధానం ఉపకరిస్తుందని, తరచుగా ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అధికారులు, సిబ్బంది పెద్దగా హైరానా పడాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు.