సాక్షి, హైదరాబాద్: సుందరీకరణలో భాగంగా మూసీ నది తీరప్రాంతాల్లో అక్రమ నిర్మాణాల తొలగింపునకు రెవెన్యూ యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పరీవాహక ప్రాంతంలో టౌన్ ప్లానింగ్ సర్వే ద్వారా బ్లాక్‌ల వారీగా ఆక్రమిత నిర్మాణాలను గుర్తించింది. మండలాల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసి అక్రమ నిర్మాణాల జాబితాను ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శిస్తోంది. వాటిపై అభ్యంతరాలను స్వీకరించి సమగ్రంగా పరిశీలించనుంది. అనంతరం ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా అక్రమ నిర్మాణాలను తొలగింపునకు మార్గం సుగుమమం చేసుకుంటోంది.
రెండున్నరేళ్ల క్రితమే..
► నగరంలోని మూసీ పరీవాహక ప్రాంతంలో ఆరు వేలకుపైగా ఆక్రమణ నిర్మాణాలు ఉన్నట్లు అధికార యంత్రాంగం గుర్తించింది. రెండున్నరేళ్ల క్రితం హైదరాబాద్ జిల్లా రెవెన్యూ యంత్రాంగం, మూసీ రివర్ అథారిటీ సంయుక్తంగా సర్వే నిర్వహించి సుమారు ఆక్రమణల సంఖ్య 8,529 పైనే ఉన్నట్లు తేల్చారు. ఇందుకు అప్పట్లో తొమ్మిది బృందాలు రంగంలో దిగి మూసీ నది పారుతున్న ఎనిమిది మండలాల పరిధిలో వాస్తవ పరిస్థితిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేశాయి.
► మండలాల వారీగా మూసీ నది మొత్తం, పొడవు, ఆక్రమణల ఫొటోలు, వీడియోగ్రాఫ్‌లతో పాటు కేటగిరీల వారీగా పూర్తి స్థాయి వివరాలు సేకరించారు. పరీవాహక ప్రాంతాంలో మండల వారీగా ఆక్రమణల సంఖ్య పరిశీలిస్తే.. ఆసిఫ్‌నగర్ మండలంలో ఆక్రమణల సంఖ్య 667, అంబర్‌పేట పరిధిలో 989, బహదూర్‌పురా 4,225, చార్మినార్ 73, గోల్కొండ 517, హిమాయత్‌నగర్ 499, నాంపల్లి 658, సైదాబాద్ పరిధిలో 902 ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
సర్వే మరోసారి..
మూసీ సుందరీకరణ వైపు వేగంగా అడుగులు పడుతుండటంతో ఆక్రమణలను గుర్తించేందుకు రెవెన్యూ, ఇరిగేషన్, మూసీ రివర్‌ఫ్రంట్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో మరోసారి సర్వే కొనసాగుతోంది. ఇప్పటికే గోల్కొండ, ఆసిఫ్‌నగర్, బహదూర్‌పురా, చార్మినార్, నాంపల్లి, హిమాయత్‌నగర్, సైదాబాద్, అంబర్‌పేట్ మండలాల్లో పూర్తయింది. మొత్తం మీద నదిలో 978, బఫర్‌జోన్‌లో నదికి ఇరువైపులా 5,501 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు తేల్చారు. (క్లిక్: తెలంగాణలో పెరుగుతున్న భూముల ధరలు.. ఖజానాకు ‘భూమ్’)
ఇరువైపులా 50 మీటర్ల పరిధి..
మూసీ ఒడ్డు నుంచి ఇరువైపులా 50 మీటర్ల చొప్పున బఫర్ జోన్‌లో గుర్తించిన నిర్మాణాలను కూల్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రత్యేక నోటీఫికేషన్ల ద్వారా ఆక్రమణల వివరాల జాబితాలను ప్రకటించి వాటిని ఆర్డీఓ, తహసీల్దార్ ఆఫీసులు, పీఎస్‌లు, మున్సిపల్, సంబంధిత ప్రభుత్వ ఆఫీసుల నోటీసు బోర్డుల్లో ప్రదర్శించారు. అభ్యంతరాలుంటే సరైన డాక్యుమెంట్లతో పక్షం రోజులుగా సంబంధిత తహసీల్దార్, ఆర్డీఓ ఆఫీసులో తెలియజేసేలా రెవెన్యూ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఆ తర్వాత ఏకకాలంలో పోలీసుల బందోబస్తుతో కూల్చివేతలు చేపట్టనుంది. (చదవండి: భ్రాంతిగా మారిన తెలంగాణ సంపర్క్ క్రాంతి)
Comments
Please login to add a commentAdd a comment