కాబోయే భార్యకి... చెప్పాలా? వద్దా?
జీవన గమనం
నా వయసు 26. మూడేళ్ల క్రితం నాకు ప్రభుత్వోద్యోగం వచ్చింది. పబ్లిక్ రిలేటెడ్ జాబ్. అయితే నేను మొదట్నుంచీ సెలైంట్ కావడం వల్ల ఎవరితోనూ ఎక్కువ మాట్లాడలేకపోతు న్నాను. దాంతో కొందరు నన్ను ఆ జాబ్‌కి అన్‌ఫిట్ అంటున్నారు. అది బాధ కలిగిస్తోంది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరిగిపోతోంది. ఈ బలహీనతను ఎలా అధిగమించాలో చెప్పండి.
- బి.ప్రియదర్శిని, మెయిల్
ఇంట్రావర్ట్‌గా ఉండటం వేరు, రిజర్వ్డ్గా ఉండటం వేరు. అవసరమైన ప్పుడు మాట్లాడటాన్ని రిజర్వ్‌డ్‌నెస్ అంటారు. అవసరమున్నా మాట్లాడకపోవడాన్ని ఇంట్రా వర్షన్ అంటారు. ఉద్యోగ రీత్యా పదిమందితో మాట్లా డాల్సి వచ్చినప్పుడు తప్పని సరిగా మాట్లాడాలి. ఈ కళను పెంపొందించుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. ఈ మూడే ళ్లలో మీరు ఇందులో ఎంతవరకూ సఫలీకృత మయ్యారో చెప్పలేదు. కమ్యునికేషన్ అనేది చదవడం, రాయడం, మాట్లాడటం, వినడం, హావభావాలు, సంజ్ఞల మీద ఆధారపడి ఉంటుంది.
సంభాషణల్ని రెండు రకాలుగా విడగొట్టవచ్చు. ప్రైవేట్ స్పీకింగ్, పబ్లిక్ స్పీకింగ్. ప్రైవేట్ కమ్యుని కేషన్లో నాలుగు అంశాలు దృష్టిలో పెట్టు కోవాలి. 1.మన మూడ్ మాట్లాడటానికి తగిన విధంగా ఉందా? 2. అవతలివారి మూడ్ వినడానికి సరైన స్థితిలో ఉందా? 3.అవతలివారి మూడ్‌ని మన మాటలతో మార్చగలిగే పరిస్థితి ఉందా? 4.అవతలి వారి పరిస్థితిని బట్టి మన మూడ్ మార్చు కునే అవకాశం ఉందా? అదే విధంగా ఎవరితో మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడు తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం అనే మరో నాలుగు విషయాలూ గుర్తుంచు కోవాలి.
సరిగ్గా మాట్లాడలేక పోవడం వల్ల వచ్చే నష్టాలు మీకీపాటికే అవగతమై ఉంటాయి. ముందు దగ్గరి వారితో మాట్లా డటం ప్రారంభించండి. స్నేహితులతో గ్రూప్‌గా ఏర్పడి, ఆసక్తికరమైన చర్చల్లో పాల్గొంటే మెదడు చురుగ్గా పని చేస్తుంది. తెలివితో పాటు వాగ్ధాటి పెరుగుతుంది. ఆ తరువాత ఆ విద్యని మీ వృత్తిలో అమలు జరపండి. ఫలితాలు మీకే విస్మయం కలిగించేటంతగా ఉంటాయి.
నాకు పదమూడేళ్లుగా నిద్రలో నడిచే అలవాటు ఉంది. బాగా కలవరిస్తాను కూడా. ఇంతవరకూ దానివల్ల ఏ ఇబ్బందీ కలగలేదు. కానీ నాకు ఇటీవలే పెళ్లి కుదిరింది. ఆ అమ్మాయితో నా సమస్య నేను చెప్పలేదు. చెప్పకుండా మోసగించడమూ ఇష్టం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి?
- కె.శ్రీనివాస్ గౌడ్, మెయిల్
స్లీప్ వాకింగ్ శారీరక సమస్యా మానసిక సమస్యా అన్నది తేల్చి చెప్పడం కష్టం. దీన్ని సోమ్నాబ్లిజం అంటారు. ఇది వంశపారంపర్యంగా వస్తుంది. కానీ మొదటి పన్నెండేళ్లూ మీకు ఈ సమస్య రాలేదంటున్నారు. విపరీతమైన మానసిక సమస్యలుంటే.. ఆ ఒత్తిడి వల్ల కూడా కొన్నిసార్లు ఈ సమస్య రావొచ్చు. ఏ విషయమూ మీకు డాక్టరే చెబుతారు. అయితే మీరు దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు ఆయనకు తెలపాలి. మీరు నిద్రలో ఎంతసేపు నడుస్తూంటారో తెలపలేదు. నిద్రలో నడవడం అనేది కేవలం నిమిషంపాటే జరుగుతుంది.
కొన్ని కేసుల్లో అరగంట వరకూ కూడా ఉండొచ్చు కానీ అది చాలా అరుదు. నవలల్లోనూ సినిమాల్లోనే ఈ ప్రక్రియని అరగంట వరకూ ఉపయోగించడం జరుగుతుంది. అయితే నిజానికీ సమస్య వయసుతో పాటు తగ్గిపోతుంది. కానీ పాతికేళ్లు వచ్చినా మీకింకా తగ్గలేదంటే మీరు సైకాలజిస్ట్/ సైకియాట్రిస్ట్‌ను కలుసుకోవడం మంచిది. దాని కంటే ముందు మీ అంతట మీరు కొన్ని ప్రయత్నాలు చేయండి. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం అలవాటు చేసు కోండి. పడుకోబోయే ముందు మనసును కలచివేసే భయంకరమైన న్యూస్ చూడ వద్దు. శుభ్రమైన బెడ్రూమ్, ఆహ్లాదకర మైన మ్యూజిక్, గాలిలో రవంత పరిమళం మెదడు మీద మంచి ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా గది నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోండి.
గాఢంగా గాలి పీలుస్తూ, నెమ్మదిగా వదులుతూ, కండ రాల్ని కూడా అదే విధంగా బిగించి లూజ్ చేస్తే, సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకోడానికి ప్రయత్నించండి. ఇవన్నీ ఫలించని పక్షంలో సైకాలజిస్ట్/సైకియాట్రిస్ట్‌ను కలవడం మంచిది. అలాగే కలవరించే అలవాటుందని రాశారు. కొందరికి ఇది అస్సలు నచ్చదు. కాబట్టి మీ భార్యకి ముందే చెప్పండి. ఆమెకు దీనిపట్ల ఏహ్య భావం ఉంటే తర్వాత ఇబ్బంది కదా! చివరిగా ఒక విషయం. స్లీప్ వాకింగ్ అనేది సినిమాల్లోనో కథల్లోనో చెప్పేటంత భయంకర మైనది కాదు. ట్రీట్మెంట్ ద్వారా తగ్గిపోయే అవకాశం ఉంది. దీనికి డాక్టర్లు కొన్ని మందులు (డీజపీన్స్) ఇస్తున్నారు. సమస్య మరీ ఎక్కువగా ఉంటే వారిని సంప్రదించండి.
- యండమూరి వీరేంద్రనాథ్