ప్రజా సమస్యలను పరిష్కరించండి
ప్రజావాణిలో జేసీ జె.మురళి
మచిలీపట్నం : ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ జె.మురళి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులంతా తప్పనిసరిగా ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావాలని, అత్యవసర పనులు ఉన్నప్పుడు కలెక్టర్ నుంచి ముందస్తు అనుమతి పొందాలని చెప్పారు.
తాను వినికిడి సమస్యతో బాధపడుతున్నానని, వినికిడి యంత్రాన్ని అందజేయాలని కోడూరుకు చెందిన నాగం లక్ష్మీనాంచారమ్మ జేసీకి వినతిపత్రం అందజేశారు. వెంటనే స్పందించిన ఆయన వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులను పిలిపించి ఆమెకు వినికిడి యంత్రాన్ని అందజేశారు. డీఆర్వో ఎ.ప్రభావతి, జెడ్పీ సీఈవో డి.సుదర్శనం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. డీఈవో డి.దేవానందరెడ్డి, డీఎస్వో సంధ్యారాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు..
దోసపాడు ఆర్అండ్బీ రోడ్డు నుంచి ఎస్టీ కాలనీ మీదుగా సిమెంటు రోడ్డు వేయించాలని, ఆర్అండ్బీ రోడ్డు నుంచి బీసీ కాలనీ రైల్వే కట్ట వరకు బీటీ రోడ్డు నిర్మించాలని, ఆర్అండ్బీ రోడ్డు నుంచి బీసీ కాలనీ వరకు సిమెంటు రోడ్డు నిర్మించాలని కోరుతూ పెదపారుపూడి జెడ్పీటీసీ సభ్యురాలు మూల్పూరి హరీష వినతిపత్రం అందజేశారు.
బాపులపాడు మండలం వేలేరు గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ కోడూరు రామకృష్ణారావు అనే వ్యక్తి అధికారులకు అర్జీ సమర్పించారు.
జగ్గయ్యపేట మండలం ధర్మవరప్పాడు గ్రామంలో పేదల ఆక్రమణలో ఉన్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ దరావత్తు రవీంద్రనాయక్ వినతిపత్రం అందజేశారు.
తన భూమిని కొందరు ఆక్రమించుకున్నారని, ఖాళీ చేయాలని కోరితే చంపుతామని బెదిరిస్తున్నారని, తనకు రక్షణ కల్పించాలని చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామానికి చెందిన కుంభం వెంకటేశ్వరమ్మ విన్నవించారు.
గుడ్లవల్లేరు మండలం విన్నకోట దళితవాడలో చెరువును అక్రమంగా లీజుకు తీసుకున్న సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామానికి చెందిన ఎం.వీరయ్య, మరికొందరు అర్జీ అందజేశారు.
బందరు మండలం ఎస్ఎన్గొల్లపాలెంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని ఖాళీ చేయించి, పేదలకు నివేశనాస్థలాలుగా ఇవ్వాలని కోరుతూ చోరగుడి రంజిత్‌కుమార్ వినతిపత్రం అందజేశారు.
బందరు మండలం పెదయాదర గ్రామంలోని శ్మశానవాటికను అభివృద్ధి చేసి చుట్టూ ప్రహరీ నిర్మించాలని, అక్కడ షెడ్డు నిర్మించాలని కోరుతూ కంచర్లపల్లి శివరామప్రసాద్ అనే వ్యక్తి వినతిపత్రం సమర్పించారు.
తమకు వృద్ధాప్య పింఛను మంజూరు చేయాలని కోరుతూ గుడివాడకు చెందిన ఎం.సుశీల, బావదేవరపల్లికి చెందిన నలుకుర్తి మరియమ్మ, పెడన మండలం బల్లిపర్రు గ్రామానికి చెందిన కలిదిండి సత్యనారాయణ వినతిపత్రాలు అందజేశారు.
పమిడిముక్కల మండలం గురజాడ గ్రామ పంచాయతీలో అవకతవకలకు పాల్పడిన కార్యదర్శి ఎన్.సాంబశివరావుపై తప్పుడు నివేదిక ఇచ్చిన గుడివాడ డీఎల్పీవో ఎం.వరప్రసాదరావుపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త శ్రీనివాసగౌడ్ వినతిపత్రం అందజేశారు.
మచిలీపట్నం చేపల మార్కెట్ రైస్ బజారులో రోడ్డు ఆక్రమణలను తొలగించాలని కోరుతూ పలువురు వ్యాపారులు అర్జీ అందించారు.