అయ్యయ్యో... ఎందుకలా ఓటేశాం!
చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనేమో. యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేయాలంటూ ఓటు వేసి, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలను చూసిన బ్రిటిషర్లు ఇప్పుడు తాపీగా బాధపడుతున్నారట. అలా ఎందుకు ఓటు వేశామా అని తల పట్టుకుంటున్నారట. బ్రెగ్జిట్ నిర్ణయంతో ప్రపంచ మార్కెట్లు మొత్తం అతలాకుతలమయ్యాయి. యూరప్ నుంచి విడిపోవాలంటూ ఉద్యమించిన నాయకుల వరకు సంబరంగానే ఉన్నా, ఓట్లు వేసిన బ్రిటిషర్లలో అసలు చాలామందికి తాము ఎందుకలా ఓటు వేశామో ఇప్పటికీ తెలియడం లేదట.
గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత దిగువ స్థాయికి బ్రిటిష్ పౌండు పడిపోవడం, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కావడం, ఆస్తుల విలువలు కూడా దారుణంగా దిగిపోవడంతో ఒక్కసారిగా బ్రిటిషర్లకు దిమ్మతిరిగినట్లయింది. ఈ పరిస్థితి నుంచి కోలుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదని, ఇది మరింత దిగజారుతుందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. తాను సైతం విడిపోవడానికే మద్దతిస్తూ ఓటేశానని, కానీ ఈరోజు పొద్దున్న లేచి చూసుకున్నాక.. వాస్తవం చూసి మతి పోయిందని ఓ బ్రిటిష్ మహిళ తెలిపారు. మరోసారి ఓటు వేసే అవకాశం ఉంటే మాత్రం.. కలిసుందామనే అంటానన్నారు.