RFID tags
-
రైలు బోగీల్లో ఆర్ఎఫ్ఐడీ పరికరాలు
సాక్షి, అమరావతి: రైల్వే వ్యాగన్లు, కోచ్‌ల ప్రయాణం మొత్తం ట్రాక్ చేసేందుకు వీటిలో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ (ఆర్ఎఫ్ఐడీ) పరికరాలను అమర్చనున్నారు. ప్రయాణికుల కోచ్‌లతో పాటు సరుకు రవాణా వ్యాగన్లకు ఈ ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్‌లను బిగిస్తారు. ఈ మేరకు రైల్వే శాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రైళ్ల గమనం మాన్యువల్‌గా నిర్వహిస్తున్నారు. దీనివల్ల అవకతవకలు జరుగుతున్నాయని రైల్వే శాఖ అభిప్రాయపడుతోంది. మొత్తం 23 వేల వ్యాగన్లలో ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్‌లను 2022 డిసెంబర్ కల్లా అమర్చేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. రైళ్ల కోచ్‌లలోని రోలింగ్ స్టాక్‌లలో ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్లు అమరుస్తారు. ఇది ప్రత్యేక నెట్వర్క్ ద్వారా వ్యాగన్/కోచ్‌ను గుర్తించి సెంట్రల్ సర్వర్‌కు సమాచారాన్ని చేరవేస్తుంది. ► ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్లు సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ రూపొందిస్తుంది. ఈ ట్యాగ్‌లతో కోచ్‌లు, వ్యాగన్లు, లోకోమోటివ్‌లు ఎక్కడున్నాయో.. ఎక్కడ ప్రయాణిస్తున్నాయో తెలిసిపోతుంది. ► లాక్డౌన్ సమయంలో దక్షిణ మధ్య రైల్వే 290 ప్రత్యేక పార్శిల్ రైళ్ల ద్వారా 40 వేల టన్నుల వరకు సరుకు రవాణా చేశాయి. ► సరుకు రవాణా రైళ్లకు ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్లు అమరిస్తే మరింత పారదర్శకతకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. -
చంటి బిడ్డలకు ‘ఆర్ఎఫ్ఐడీ’ రక్ష
తెనాలిఅర్బన్: ఆస్పత్రుల్లో చంటిబిడ్డల అపహరణలకు చెక్ పెట్టేందుకు తెనాలి జిల్లా వైద్యశాల సిద్ధమవుతోంది. అందుకు అవసరమైన ఆర్ఎఫ్ఐడీ విధానాన్ని వైద్యశాలలో ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో తల్లి–బిడ్డకు ట్యాగ్‌లను వేయనున్నారు. అలాగే ప్రసూతి విభాగంలో సిస్టమ్స్‌కు సంబంధించి సెన్సార్‌ను కూడా ఏర్పాటు చేశారు. పెరిగిన రద్దీ.. తెనాలి జిల్లా వైద్యశాలలో 150 పడకల తల్లి–పిల్లల వైద్యశాలో నెలకు సుమారు 300 ప్రసవాలు జరుగుతున్నాయి. దీనివల్ల జిల్లా వైద్యశాల ఆవరణ నిత్యం రద్దీగా ఉంటుంది. గతంలో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో పసిబిడ్డల అపహరణలు జరగటం.. తెనాలి జిల్లా వైద్యశాలలో అప్పుడే పుట్టిన చిన్నారులను వదిలి వెళ్లటం వంటి ఘటనలు జరిగాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని చిన్నారుల అపహరణలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో జిల్లా వైద్యశాల ఒక అడుగు ముందుకు వేసింది. ఇందులో భాగంగా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైజ్(ఆర్ఎఫ్ఐడీ) విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వార్డుల్లో ఇప్పటికే సెన్సార్లను ఏర్పాటు చేశారు. అలాగే సిస్టం అమలుకు అవసరమైన గదిని కూడా కేటాయించారు. రెండు రోజుల్లో దీనిని అధికారికంగా జిల్లా వైద్యశాలలో ప్రవేశపెట్టనున్నారు. ఆర్ఎఫ్ఐడీ పనిచేసే విధానం.. జిల్లా వైద్యశాలలో కాన్పు జరిగిన వెంటనే తల్లి–పుట్టిన చంటి బిడ్డకు ఒకే నంబర్ కలిగిన ట్యాగ్‌లను చేతులకు వేస్తారు. ట్యాగ్లు వేసిన వారిని బయటకు తీసుకెళ్లేందుకు అనుమతించరు. ఎవరైన చంటి బిడ్డను అపహరించాలని చూసి బయటకు తీసుకువెళ్లితే వార్డులో ఏర్పాటు చేసిన అలారాలు మోగుతాయి. అంతే కాకుండా చంటిబిడ్డ ఫొటో, వివరాలను ఆర్ఎఫ్ఐడీ మానిటర్స్ డిస్ప్లే చేస్తాయి. వాటిని నిత్యం పర్యవేక్షించే సిబ్బంది సెక్యూరిటీని అప్రమత్తం చేసి, దొంగను పట్టుకునే విధంగా చూస్తారు. మొత్తం మీద గుంటూరులో మినహా జిల్లాలో ఇలాంటి ఆర్ఎఫ్ఐడీ విధానాన్ని అమలు చేస్తున్న ఆస్పత్రిగా జిల్లా వైద్యశాల నిలవనుంది. ఇది విజయవంతం అయితే పిల్లల దొంగతనాలకు చెక్‌పెట్టినట్లే. చిన్నారుల అపహరణకు చెక్.. ఆర్ఎఫ్ఐడీ విధానాన్ని జిల్లా వైద్యశాలలోని తల్లి–పిల్లల వైద్యశాలలో ప్రవేశపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. తల్లి–బిడ్డలకు ఒకే నంబర్ ట్యాగ్లు వేస్తాం. వాటికి ఉన్న రేడియో ఫ్రీక్వెన్సీ సెన్సార్‌కు సంకేతాలు పంపి సిబ్బందిని అలర్ట్ చేస్తుంది. అలాగే ట్యాగ్‌లను పాడుచేసేందుకు అవకాశం ఉండదు. దీని వల్ల చంటిబిడ్డల దొంగతనాలను నియంత్రించవచ్చు. –డాక్టర్ ఎం సనత్‌కుమారి,సూపరింటెండెంట్, జిల్లా వైద్యశాల, తెనాలి -
ఫోర్వీలర్లకు ఫాస్టాగ్ తప్పనిసరి
న్యూఢిల్లీ: వచ్చే నెల 1 నుంచి రోడ్డు మీదకి రాబోయే కొత్త ఫోర్ వీలర్ వాహనాలన్నింటికి ’ఫాస్టాగ్’ పరికరం తప్పనిసరి కానుంది. ఆటోమొబైల్ తయారీ సంస్థలు లేదా అధీకృత డీలర్లు వీటిని ఆయా వాహనాల ముందు విండ్‌స్క్రీన్‌లపై వీటిని అమర్చాకే విక్రయించాల్సి ఉంటుంది. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ గురువారం ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఫాస్టాగ్ డివైజ్‌తో టోల్ గేట్ల దగ్గర చెల్లింపుల ప్రక్రియ సులువు కానుంది. వాహనం విండ్‌స్క్రీన్‌పై అమర్చే ఈ పరికరాన్ని ఆయా వాహనదారుల సేవింగ్స్ ఖాతా లేదా ప్రీపెయిడ్ ఖాతాకు అనుసంధానమై ఉంటుంది. టోల్ గేట్ల నుంచి ప్రయాణించేటప్పుడు ఆయా ప్లాజాల్లోని పరికరం.. ఈ ఫాస్టాగ్‌లలో నిక్షిప్తమైన సమాచారాన్ని గ్రహించడం ద్వారా చెల్లింపు ప్రక్రియ పూర్తవుతుంది. దీంతో ప్రత్యేకంగా నగదు చెల్లించేందుకు ప్లాజా వద్ద ఆగాల్సిన శ్రమ తప్పుతుంది. ప్రస్తు తం జాతీయ రహదారులపై 370 టోల్ ప్లాజాల్లో ఫాస్టాగ్ విధానం అమల్లో ఉంది. -
తల్లీబిడ్డకు రక్షణ కవచం
జీజీహెచ్‌లో ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్లు ప్రారంభం వారం రోజుల్లో పూర్తిస్థాయిలో అమల్లోకి నాలుగు వార్డుల్లో సెన్సార్ల ఏర్పాటు గుంటూరు మెడికల్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో తరచుగా పసికందులు అదృశ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటూ ఉండటంతో ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించి పిల్లల అపహరణను నియంత్రించేందుకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్( ఆర్ఎఫ్ఐడీ) ట్యాగ్‌ను మొట్టమొదటిసారిగా గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో ప్రారంభించింది. ఆస్పత్రిలో నాలుగుచోట్ల ఏర్పాటు... ఆస్పత్రి ఇన్‌పేషెంట్ విభాగంలోని కాన్పుల విభాగం( లేబర్‌రూమ్), నవజాతశిశు సంరక్షణ కేంద్రం( ఎస్ఎన్సీయూ), పిల్లల వైద్య విభాగం, గైనకాలజీ వైద్యవిభాగం( 107, 107 వార్డుల్లో)లో సెన్సార్లు ఏర్పాటు చేశారు. పసికందులు పుట్టిన వెంటనే తల్లికి, బిడ్డకు ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్‌ను అమర్చుతారు. దీంతో తల్లీబిడ్డలకు ఒకటే నంబర్ ఉంటుంది. ట్యాగ్ అమర్చగానే తల్లి వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఒకసారి ట్యాగ్‌ను చేతికి పెడితే దానిని తీయటం కుదరదు. ట్యాగ్‌లను కత్తిరించి తొలగించటమే మినహా వేరే మార్గం లేదు. తల్లికీ బిడ్డకు మధ్య దూరం 10 మీటర్లు దాటితే వెంటనే పెద్దగా శబ్దం వస్తుంది. వేరే‡వారు పిల్లలను పట్టుకుంటే వెంటనే దొరికిపోతారు. పిల్లలు, తల్లులను ఉంచే వార్డుల్లో సెన్సార్లు ఏర్పాటు చేయడంతో ఇవి ట్యాగ్‌లను మానిటరింగ్ చేస్తూ ఉంటాయి. గుజరాత్‌కు చెందిన ఓడోహబ్ డాట్‌కామ్ సంస్థ ఈ నూతన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. వార్డుల ప్రారంభంలో, చివర్లో ఇంటిగ్రేటెడ్ రీడర్ల అమర్చుతారు. కంప్యూటర్లో డెస్క్‌టాప్ రీడర్ ఉంటుంది. తల్లికి, బిడ్డకు అమర్చే ట్యాగ్‌కు సిల్వర్ పూత మాదిరిగా రేడియోవేవ్స్ ఉంటాయి. ట్యాగ్ల నుంచి వచ్చే రేడియోవేవ్స్‌ను అనుసంధానం చేస్తూ కంప్యూటర్లో సాఫ్ట్వేర్ అమర్చారు. రూ.12 లక్షలతో ఏర్పాటు... ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్‌లను ఆస్పత్రిలో ఏర్పాటు చేసేందుకు సుమారు రూ.12 లక్షల వరకు ఖర్చయిందని, జీజీహెచ్‌లో సెక్యూరిటీ కాంట్రాక్ట్ నిర్వహిస్తున్న జేబీ సెక్యూరిటీ ఖర్చును భరించినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడు వెల్లడించారు. కాంట్రాక్ట్ ఒప్పందంలో భాగంగానే ఈ నూతన విధానం ఏర్పాటు చేశామన్నారు. ట్యాగ్‌లను అమర్చిన వెంటనే తల్లి బిడ్డ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేందుకు రిసెప్షనిస్ట్ కమ్ ఆపరేటర్‌ను నియమించనున్నట్లు తెలిపారు. ట్యాగ్లు ఏర్పాటుచేసేందుకు జతకు రూ.50 ఖర్చవుతుందని, అహ్మదాబాద్ నుంచి ట్యాగ్‌లను తెప్పిస్తున్నామని చెప్పారు. వారం రోజుల్లో పూర్తిస్థాయిలో తల్లిబిడ్డ సంరక్షక కవచాలు అందుబాటులోకి వస్తాయని ఆయన వెల్లడించారు.