సకల’ వేతనాలు అందరికీ చెల్లించాలి
సెంటినరీకాలనీ : సింగరేణిలోని అన్ని విభాగాల కార్మికులకు సకలజనుల సమ్మెకాలపు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆర్జీ–3 డివిజన్లోని డిస్ట్రిబ్యూషన్ కార్యాలయం వద్ద ఎస్అండ్ పీసీ సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ ఎస్అండ్పీసీ రామగుండం రీజియన్ ఇన్చార్జి అంబటి నరేష్ మాట్లాడుతూప్రాణాలనుపణంగా పెట్టి సంస్థ ఆస్తులను కాపాడిన సిబ్బందికి సకలజనుల సమ్మె కాలపు వేతనం చెల్లించకపోవడం బాధాకరమన్నారు. టీబీజీకేఎస్ లోపభూయిష్టం ఒప్పందంతోనే కార్మికులకు అన్యాయం జరిగిందన్నారు. కార్మికులందరికీ వేతనాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నా.. టీబీజీకేఎస్ అడ్డుకుందని ఆరోపించారు. హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్అహ్మద్ సీఅండ్ఎండీ శ్రీధర్తో చర్చలు జరుపనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్అండ్పీసీ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.