దివంగత సినీనటులకు జమున పిండప్రదానం
రాజమండ్రి: పుష్కరాల్లో తమ పూర్వీకులకు పిండప్రదానం చేయడం సంప్రదాయంగా భావిస్తుంటారు. కానీ సీనియర్ నటీమణి జమున మాత్రం సినీరంగంలో తన ఉనికికి, ఉన్నతికి కారణమైన కొందరు దివంగత నటులకు పిండప్రదానం చేసి వారితో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
శుక్రవారం రాజమండ్రిలోని వీఐపీ పుష్కర ఘాట్ లో స్నానమాచరించిన అనంతరం దివంగత సినీనటులు కన్నాంబ, భానుమతి, సావిత్రి, సూర్యకాంతం, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, రేలంగి, రాజబాబు, పద్మనాభం తదితరులకు జమున శాస్త్రోక్తంగా పిండప్రదానం చేశారు. క్రతువు అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ చనిపోయిన తన సమకాలీన నటులకు గోదావరి పుష్కరాల్లో పిండప్రదానం చేసి తనవంతు కర్తవ్యం నిర్వర్తించడం ఎంతో తృప్తిగా ఉందన్నారు.
మూగమనసులు సినిమా షూటింగ్ గోదావరి పరిసరాల్లోనే జరిగిందని, దాదాపు 50 ఏళ్ల కిందట కోటిపల్లి, సఖినేటిపల్లి తదితర ప్రాంతాల్లో గోదావరి గట్లపై నటించినప్పుడు గోదావరి అందాలు చూసి ఎంతో మురిసిపోయేదానినని గుర్తు చేసుకున్నారు. తాను రాజమండ్రి ఎంపీగా ఉన్న సమయంలో 1991 పుష్కరాల పనులకు ఎంపీ నిధుల నుంచి రూ.11 కోట్లు కేటాయించానని చెప్పారు. తెలంగాణలో గోదావరి ఉన్నప్పటికీ తాను నటించిన రాజమండ్రివద్ద గోదావరిని మరోసారి చూడాలనే తలంపుతో ఇక్కడకు వచ్చానన్నారు.