లెవీ...కష్టాలు హవీ!
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో లెవీ సేకరణకు ఆదిలోనే కష్టాలు ప్రారంభమయ్యాయి. ఒకవైపు బియ్యం మద్దతు ధర తేలకపోవడంతో పాటు గొడౌన్ల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. జిల్లాలో గతం లో ఎన్నడూ లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో 1.80 లక్షల మెట్రిక్ టన్నుల లెవీ సేకరణ లక్ష్యంగా నిర్ణయించారు. అయితే వసతులు గురించి ప్రభుత్వం ఆలోచించలేదు. ఇప్పటికే జిల్లాలో ఉన్న ఐదు గొడౌన్లలో బియ్యం నిల్వలున్నాయి. దీంతో బియ్యం ఎగుమతి, దిగుమతులకు ఇబ్బంది కలుగుతోంది. ఈ సమస్యతో గొడౌన్‌కు వచ్చిన వాహనాలు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీని వల్ల తమకు నష్టం వాటిల్లుతోందని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గొడౌన్ల సమస్యకు సంబంధించి ఉన్నతాధికారులకు నివేదించినట్టు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో పౌరసరఫరాల సంస్థ ఆధ్వ ర్యంలో లెవీ సేకరణ జరుగుతోంది.
కెఎల్‌పురం, జియ్యమ్మవలస, చీపురుపల్లి, అంటిపేట, పార్వతీపురంమండలాల్లో గొడౌన్లున్నాయి. ఇప్పటికే అన్ని గొడౌన్లలోనూ బియ్యం నిల్వలున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ఇబ్బం దులు పడుతున్నామని మిల్లర్లు వాపోతున్నారు.జిల్లాలో వాస్తవానికి 77 వేల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వ చేయటానికి మాత్రమే అనువైన గొడౌన్లు ఉన్నాయి. ఈమేరకు లెవీ లక్ష్యం సగం కంటే తక్కువ నిల్వ చేయడానికి సామర్థ్యం గల గొడౌన్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం గొడౌన్ల సమస్య పూర్తిస్థాయిలో తలెత్తన ప్పటికీ జనవరి దాటితే ఇబ్బందులు తప్పవని మిల్లర్లతో పాటు అధికారులు కూడా భావిస్తున్నారు. తాత్కాలికంగా గొడౌన్ల సమస్యను అధిగమించేందుకు అధికారులు ఇప్పటికే గొడౌన్లలో బియ్యం వేసే నెట్‌ను 16 నుంచి 24 వరకు పెంచటానికి వెసులుబాటు కల్పించాలని ఉన్నతాధికారులకు నివేదించారు. దీనిపై ఎలాంటి స్పందన రాలేదు.
మద్దతు ధర తేలెదెప్పుడో...?
వాస్తవానికి లెవీ ప్రారంభానికి ముందే బియ్యానికి సంబంధించి మద్దతు ధర ప్రకటన ప్రభుత్వం నుంచి వెలువడాలి. ఈ ఏడాది ఇప్పటికే లెవీ ప్రారంభం కావడంతో పాటు 18 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణ జరిగింది. ఇప్పటివరకు మద్దతు ధర ప్రకటించకపోవడంతో తమకు నష్టాలు తప్పవని మిల్లర్లు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే పెరిగిన ధరలతో పోలిస్తే లక్షలాది రూపాయలు నష్ట పోవలసి వస్తుందని వారు చెబుతున్నారు. అయితే క్వింటాకు రూ. 2,285 మద్దతు ధర నిర్ణయమైనట్టు తమ సంఘానికి సమాచారం అందినట్టు మిల్లర్ల సంఘం విజయనగరం డివిజన్ అధ్యక్షుడు బద్రీ నారాయణ తెలిపారు. కానీ ఇంతవరకు అమలు కాలేదన్నారు.
ఉన్నతాధికారులకు నివేదించాం...
గొడౌన్ల సమస్య ఉందని ఉన్నతాధికారులకు నివేదిం చాం. ప్రతినెల 12 వేల మెట్రిక్ టన్నుల బియ్యం జిల్లా అవసరాల కోసం తరలిస్తున్నాం. నెట్ల సంఖ్యను పెంచడానికి అనుమతి ఇవ్వాలని పౌర సరఫరాల సంస్థ ఎండీకి నివేదించాం. ప్రత్యామ్నాయ గొడౌన్లను ఏర్పాటు చేస్తాం.
-ఎస్.వేణుగోపాలనాయుడు, జిల్లా పౌరసరఫరాల సంస్థ.