నూకలపై కదిలి..సీఎంఆర్‌ను వదిలి
సాక్షి, న్యూస్ నెట్వర్క్: పేదలకు ఇచ్చే బియ్యంలో పరిమితికి మించి నూకలు రావడం, మిల్లర్ల ఆగడాలపై సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం సంచలనం సృష్టించింది. దానిపై స్పందించిన ఉన్నతాధికారులు వెంటనే మిల్లులు, గోదాములు, రేషన్ షాపుల్లో తనిఖీలు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. పలు జిల్లాల్లో అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. రికార్డులను పరిశీలించి, బియ్యం శాంపిల్స్ తీసుకున్నారు. ఈ సందర్భంగా బియ్యంలో నూకలు ఎక్కువగా వస్తున్నాయని లబ్ధిదారులు, డీలర్లు అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. ఇక కస్టమ్ మిల్లింగ్ రైస్‌కు సంబంధించి 150 మిల్లుల్లో గోల్మాల్ జరిగినట్టుగా అధికారులు గుర్తించారు.
ఆగమేఘాల మీద తనిఖీలు
రేషన్‌షాపుల్లో పరిమితికి మించి నూకలు ఉన్న, నాణ్యత తక్కువగా ఉన్న బియ్యాన్ని సరఫరా చేస్తున్న అంశంపై ‘నాణ్యమైన బియ్యానికి నూకలు చెల్లు’శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. మిల్లర్లు నాణ్యతలేని ధాన్యం నుంచి తీసిన బియ్యాన్ని రేషన్ కోసం ఇవ్వటం, ప్రభుత్వ రంగ సంస్థల నుండి సీఎంఆర్ కోసం తీసుకున్న ధాన్యాన్ని మార్కెట్లో అమ్ముకోవడం తదితర అంశాలపై ఉన్నతాధికారులు స్పందించారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ సోమవారం ఉదయమే మెదక్, గద్వాల కలెక్టర్లతో మాట్లాడి పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర, జిల్లా అధికారులు, విజిలెన్స్, టెక్నికల్ బృందాలు సోమవారం ఉదయం నుంచే రేషన్ షాపులు, గోదాముల్లో తనిఖీలు చేపట్టారు. మరోవైపు రేషన్‌షాపులకు వెళ్లిన బియ్యం తిరిగి అక్రమంగా మిల్లర్లకు చేరడం, మిల్లర్లు అవే బియ్యాన్ని మళ్లీ ప్రభుత్వ రంగ సంస్థలకు సీఎంఆర్ కింద ఇవ్వడం జరుగుతోందని.. దీనిపైనా దృష్టి సారించాలని నిర్ణయించామని ఒక ముఖ్య అధికారి వెల్లడించారు.
150 మిల్లుల్లో సీఎంఆర్ గోల్మాల్!
ప్రభుత్వ సంస్థల నుంచి సీఎంఆర్ కోసం ధాన్యం తీసుకున్న మిల్లర్లు.. గడువు తీరినా బియ్యాన్ని తిరిగి అప్పజెప్పడం లేదంటూ ‘సాక్షి’వెలుగులోకి తెచ్చిన అంశంపై అధికార యంత్రాంగం తర్జనభర్జన పడుతోంది. ప్రభుత్వ ధాన్యంతో రైసుమిల్లులు సొంత వ్యాపారం చేసుకుంటుండటంపై అధికారులు ఒక నివేదిక రూపొందించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. వరంగల్, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లోని సుమారు 150 మిల్లులు.. రూ.400 కోట్ల విలువైన బియ్యాన్ని సరైన కారణాలు చూపకుండా తిరిగి అప్పగించలేదన్న నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఈ అక్రమ వ్యవహారాన్ని ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన పలువురు జాయింట్ కలెక్టర్లు ఇప్పటికే పసిగట్టి ఉన్నతాధికారులకు సమాచారమిచ్చినా.. చర్యలకు గ్రీన్‌సిగ్నల్ రాకపోవడంతో ముందుకెళ్ల లేకపోతున్నారని సమాచారం. మిల్లర్ల అక్రమ వ్యాపారం వెనక కొందరు అధికారులు, రాజకీయ నాయకులు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
మెదక్‌లో విస్తృతంగా తనిఖీలు
సాక్షి, మెదక్: మిల్లర్ల మాయాజాలం, నూకల బియ్యంపై మెదక్ జిల్లావ్యాప్తంగా అధికారులు తనిఖీలు చేపట్టారు. రేగోడ్, శివ్వంపేట, తూప్రాన్, చిలప్‌చెడ్, చిన్న శంకరంపేట మండలాల పరిధిలోని పలు రేషన్ దుకాణాల్లో నిల్వ ఉన్న బియ్యాన్ని పరిశీలించి, శాంపిళ్లు తీసుకున్నారు. ఉన్నతాధికారులకు రిపోర్టు పంపుతామని, వారే నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. రేగోడ్ మండలం పెద్ద తండాలోని 29, రేగోడ్లోని ఒకటి, 28వ రేషన్ దుకాణాల్లో మెదక్ సివిల్ సప్లైస్ టెక్నికల్ అసిస్టెంట్ సునీల్‌కుమార్ తనిఖీ చేశారు. పెద్ద తండాకు సంబంధించి బియ్యంలో నూకలు వస్తున్నాయని ఫిర్యాదు అందిందన్నారు. తూప్రాన్‌లోని 12వ రేషన్ దుకాణం, చిన్నశంకరంపేట మండలం రుద్రారంలో సివిల్ సప్లైస్ మేనేజర్, క్వాలిటీ కంట్రోల్ అధికారులు జనార్దన్, వసీఉల్లా హుస్సేనీ కలిసి దాడులు చేశారు. బియ్యం శాంపిల్స్ తీసుకున్నారు. శివ్వంపేట మండలం గూడూరు, చిలప్‌చెడ్ మండల కేంద్రంలోని రేషన్ దుకాణాల్లోనూ తనిఖీ చేసి.. శాంపిళ్లు సేకరించారు. గత నెలలో వచ్చిన పాత బియ్యంలో నూక శాతం ఎక్కువగా ఉందని డీలర్లు అధికారులకు వివరించారు.
సోషల్ మీడియాలోనూ వైరల్
మిల్లర్ల మాయాజాలంతో నిరుపేదలకు నూకల బియ్యమే దిక్కవుతోందంటూ ‘సాక్షి’లో వచ్చిన ప్రత్యేక కథనం సోషల్ మీడియాలోనూ హల్చల్ చేస్తోంది. ఈ కథనం క్లిప్పింగ్స్ బాగా షేర్ అయ్యాయి. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ సర్కారుపై విమర్శలు గుప్పించారు. రేవంత్ అనుచరులు, అభిమానుల పేరిట ఉన్న ఖాతాల్లోనూ కథనం క్లిప్పింగ్స్ పోస్ట్ అయ్యాయి.