మంద కృష్ణపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి
ఎంఆర్పీఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు తీగల రత్నం
నల్లగొండ టౌన్ : ఎస్సీ వర్గీకరణతోపాటు వికలాంగుల హక్కుల కోసం నిరంతరం ఉద్యమిస్తున్న మంద కృష్ణమాదిగపై సొంత సంఘం నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఎంఆర్పీఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు తీగల రత్నంమాదిగ హితవు పలికారు. ఆదివారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో సంఘం నుంచి సస్పెండై స్వార్థం కోసం తిరిగి చేరిన వ్యక్తులు మంద కృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు.
ఉద్యమాన్ని నీరుగార్చే చర్యలకు పాల్పడవద్దని, మంద కృష్ణను అవమానపర్చితే యావత్ మాదిగజాతిని అవమానపర్చినట్లు అవుతుందని గుర్తుంచుకోవాలన్నారు. ఇకనైన ఆరోపణలు చేయడం మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర కార్యదర్శి కనకరాజు సామ్యేలు మాట్లాడుతూ మంద కృష్ణమాదగ గురించి యావత్ రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. ఉద్యమకారుడిపై ఆరోపణలు చేస్తే జిల్లాలో తిరగనివ్వమని హెచ్చరించారు. వారివెంట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బకరం శ్రీనివాస్, ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొమిరె స్వామి, శివశంకర్ తదితరులు ఉన్నారు.