సముద్రం కూడా కొన్ని కథలు వింది...
ఇటీవల రామాయపట్నంలో జరిగిన రెండు రోజుల కథా సమావేశాల్లో రాయడం, నడిచి వచ్చిన దారిని బేరీజు వేసుకోవడం, నడవాల్సిన దారిని అంచనా కట్టడం ప్రధానంగా జరిగిన పని.
రైటర్స్ వాక్....
రచయితలు తమలో తాము చర్చించుకోవడం కాకుండా పాఠకులలో కూడా కదలిక తీసుకు రావడానికి ‘పుస్తకాలు చదవండీ’ అంటూ ఈసారి ‘రైటర్స్ వాక్’ నిర్వహించారు. కావలిలో దీనికి వచ్చిన స్పందన అనూహ్యం.
ఈసారి చాలామంది కొత్తవాళ్లు. అపర్ణ తోట, రమా సుందరి, కుమార్ కూనపరాజు, అరిపిరాల సత్యప్రసాద్, మహి బెజవాడ, అమర్ అహ్మద్... కొత్తగా రాస్తున్న వీళ్లంతా రెండు రోజుల పాటు సీనియర్ కథకులతో కలసి సమయం గడపడానికి, గత పద్నాలుగేళ్లుగా ప్రతి ఏటా జరుగుతున్న సమావేశాల వరుసలో భాగంగా, కావలి సమీపాన ఉన్న రామాయపట్నం బీచ్ బంగ్లాకు చేరుకున్నారు. ఫిబ్రవరి 15, 16- శని, ఆదివారాలు రాష్ట్రం నలుమూలల నుంచి ఇంకా ఇతర రచయితలు... ముక్తవరం పార్థసారథి, అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమ రెడ్డి, డా.వి.చంద్రశేఖరరావు, కాట్రగడ్డ దయానంద్, వి.ప్రతిమ, దాసరి అమరేంద్ర, దగ్గుమాటి పద్మాకర్, లెనిన్ ధనిశెట్టి, గోపరాజు నారాయణరావు, అక్కిరాజు భట్టిప్రోలు, టైటానిక్ సురేష్, పూడూరి రాజిరెడ్డి, జి.ఉమామహేశ్వర్, వేంపల్లి షరీఫ్ , విమల, ఆర్టిస్టులు అక్బర్, అన్వర్... విమర్శకుడు అనంత్... కథా ప్రయాణంలో తమ సాధకబాధకాలు పంచుకోవడానికి వచ్చారు. రాయడం, నడిచి వచ్చిన దారిని బేరీజు వేసుకోవడం, నడవాల్సిన దారిని అంచనా కట్టడం ఈసారి ప్రధానంగా జరిగిన పని. కంటికి కనబడుతున్న సంక్షోభాలు చేతికి లేదా ఊహకు అంది కథగా మారడంలో వస్తున్న వైఫల్యాల గురించి, విరామాల గురించి ఎక్కువ చర్చ జరిగింది.
ఒకవైపు మారిన సమాజపు ఫలాలు పొందుతూ మరోవైపు పాత సమాజపు విలువలను ఆశించడం వల్లే చాలా సమస్యలు వస్తున్నాయని ఈ రెంటికీ మధ్య సమన్వయాన్ని పాఠకులకు ఇచ్చే కథలు రావలసిన అవసరం ఉందని అల్లం రాజయ్య అన్నారు. యథావిధిగా అందరూ కలిసి తెలుగు కథలు ఇంగ్లిష్‌లో, ఇతర భాషల్లో అనువాదం కాకపోవడం గురించి ఆ దారిలో ఉన్న అతి పెద్ద ఎడం గురించి ఈసురోమన్నారు. కథలకు బొమ్మలు వేసే- అక్బర్, అన్వర్లతో రచయితల ముఖాముఖి ఈ ఇరువర్గాల మధ్య ఉన్న భారీ దూరాన్ని స్పష్టం చేసి ఆర్టిస్టులూ రచయితలూ తరచూ మాట్లాడుకోవాల్సిన అవసరాన్ని తెలియపర్చింది. పత్రికల్లో కథల ఎంపిక ఎలా జరుగుతుందో సీనియర్ జర్నలిస్టులు కూడా అయిన వేంపల్లి షరీఫ్, పూడూరి రాజిరెడ్డిలు రచయితలకు తెలియచేస్తే రచయితల కంప్లయింట్లు ఓ మోస్తారు లేచాయి.
పత్రికల్లో ఉన్న స్పేస్ తగ్గిపోతున్నందువల్ల ఇక మీదట బ్లాగ్‌లలో వెబ్సైట్లలో వస్తున్న కథలను కూడా ప్రమాణికమైనవిగా ఆ సంవత్సరం అచ్చయిన కథలుగా సంకలనకర్తలు, విమర్శకులు గుర్తించాలని సూచన. మూసకట్టు చూపు, పడికట్టు రచన కాకుండా వర్తమానంలో రచయితలు మిస్సవుతున్న కోణాల్ని అనంత్ వివరించే ప్రయత్నం చేశారు. కేవలం మాటలతోనే కాకుండా చేతలతో కూడా ఎందుకు కాసిన్ని పనికొచ్చే పనులు చేయకూడదు? ఈ రచయితల సమూహం తరఫున ఇంగ్లిష్‌లో హిందీలో ఒక పాతిక కథలను అనువాదం చేసి తెద్దాం అని రాజయ్య సూచించారు. ఇంతవరకూ ఇలాంటి రూపం తీసుకొని ఈ సమావేశాల వల్ల ఇకముందు ఇటువంటి పని జరిగే అవకాశం ఉంది.
అందుకు వేదిక సిద్ధమవుతూ ఉండటం ఒక మంచి పరిణామం. ఇంకా కొత్తవాళ్ల సందేహాలు, పాతవాళ్ల సలహాలు, చర్చలు, ఖండనలు మండనలు చాలా ఉన్నాయి. కాని ఈ వేడి కంటే కూడా దీన్ని చల్లబరచే సాయంత్రపు సముద్ర గాలి, నిర్జన ఏకాంత పరిసరాలు, తీరంలో ఎంట్ర కాయల అడ్డదిడ్డ నడక, ఇసుకలో తడి పాదముద్రలు, దగ్గరకు పిలిచి ముఖాన్ని గట్టిగా చరిచే కెరటపు నురగ, అర్ధరాత్రి వెన్నెల్లో జలధి నిశ్శబ్దం, వేకువలో కడలి అంచున ప్రశాంతత వీటి రుచి ఏం చెప్పమంటారు? కథ, కడలి కలిసి రచయితల రోజువారి రొటీన్ రోతని క్షాళనం చేసిన రెండు రోజులు అవి. అద్భుతం. టైటానిక్ సురేష్, అమరేంద్ర, అక్కిరాజుల నిర్వాహణా మహిమ. సరే. అంతా అయ్యిందా? లేచి వస్తుంటే రాబోయే సమావేశాలకు కొల్లేరు నుంచి పిలుపు. అక్టోబర్లోనట. కథతో పాటు పూటకు ముప్పయ్యారు రకాలు రెడీ చేస్తారట. ఇది బాగుంది. ఎంతైనా ఇప్పటి నుంచే ఏం బ్యాగు సర్దుకుంటాం?