లోకాయుక్త, హక్కుల సంఘం సంగతేంది?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పలు విభాగాలు, సంస్థల విభజనపై సందిగ్ధం నెలకొంది. రాష్ట్రంలో లోకాయుక్త, ప్రజాహక్కుల పరిరక్షణకు పెద్ద దిక్కుగా మారిన మానవహక్కుల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల హక్కులను పరిరక్షిస్తున్న పరిపాలనా ట్రిబ్యునల్(ఏపీఏటీ), ప్రభుత్వ భూముల దురాక్రమణను నియంత్రించేందుకు దేశంలోనే మొదటిసారిగా ఏర్పాటైన భూ ఆక్రమణల నియంత్రణ ప్రత్యేక కోర్టు, వినియోగదారుల హక్కులను పరిరక్షించే రాష్ట్ర వినియోగదారుల ఫోరం సహా అనేక సంస్థల విషయంలో స్పష్టత కరువైంది. అపాయింటెడ్ డే అయిన జూన్ 2 నుంచి ఇవి రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా పనిచేస్తాయా లేక ప్రత్యేకంగా ఏర్పాటవుతాయా? అన్నది అయోమయంగా మారింది. రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టత లేని కారణంగా ఈ సంస్థల నిర్వహణ గందరగోళంగా మారనుంది. ఏ రాష్ర్ట ప్రభుత్వ పరిధిలో అవి విధులు నిర్వహించాలి? ఈ సంస్థల ఉద్యోగులకు జీతాలు ఎవరు చెల్లించాలి? తదితర అంశాలపై ఇప్పటికీ ఏమీ తేల్చలేదని న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిపాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా విధులు నిర్వహించేలా చట్టంలోని పదో షెడ్యూల్లో దాదాపు 107 రాష్ట్ర ప్రభుత్వ సంస్థలను చేర్చారు. ఇందులో లోకాయుక్త, హక్కుల కమిషన్ సహా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే 38 సంస్థలను మాత్రం చేర్చలేదు. అయితే రెండు రాష్ట్రాలకు వీటిని విభజించడం ఇప్పట్లో సాధ్యపడేలా లేదు. దీంతో సదరు సంస్థలను పదో షెడ్యూల్లో చేర్చాలని గవర్నర్ నరసింహన్ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. అయితే దీనిపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరో రెండు రోజుల్లో ఆర్డినెన్స్ రూపంలో కేంద్రం ఈ సంస్థలను 10వ షెడ్యూల్లో చేర్చకపోతే జూన్ 2 తర్వాత వాటి నిర్వహణ ఇబ్బందిగా మారనుంది. కాగా, 10వ షెడ్యూల్లో చేర్చిన సంస్థల సంఖ్య ఇప్పటికే దాదాపు 150కి చేరడంతో ఈ సంస్థల నిర్వహణ అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా లోకాయుక్త, హక్కుల కమిషన్ వంటి న్యాయ సంస్థల విషయంలో కేంద్ర ం వెంటనే స్పష్టతనివ్వాల్సి ఉందని హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ పి.లక్ష్మణ్రెడ్డి అభిప్రాయపడ్డారు.