rio olympic medal winner
-
సింధుకు ఘనస్వాగతం
-
మంత్రులే క్యూ కట్టిన వేళ...
-
ఎయిర్‌పోర్టులో సింధుకు ఘనస్వాగతం
-
మంత్రులే క్యూ కట్టిన వేళ...
సాధారణంగా మంత్రులను ఎవరైనా కలవాలంటే వాళ్ల పేషీల దగ్గర, ఇళ్ల దగ్గర క్యూలో నిలబడాల్సి ఉంటుంది. కానీ, సోమవారం శంషాబాద్ విమానాశ్రయంలో అరుదైన దృశ్యం కనిపించింది. రియో ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మిటన్ సింగిల్స్ విభాగంలో రజత పతకం సాధించిన పీవీ సింధు, ఆమెను తీర్చిదిద్దిన కోచ్ పుల్లెల గోపీచంద్ ఇద్దరూ బ్రెజిల్ నుంచి వస్తున్నారు. వాళ్లకు స్వాగతం పలికేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు క్యూలో నిలబడ్డారు. విమానాశ్రయంలో సాధారణంగా విదేశాల నుంచి వచ్చేవాళ్ల కోసం 'ఇంటర్నేషనల్ అరైవల్స్' ద్వారం ఉంటుంది. సింధు, గోపీ తదితరులను మాత్రం ప్రత్యేకంగా అత్యవసర ద్వారం మీదుగా తీసుకొచ్చారు. సింధు తండ్రి పీవీ రమణ స్వయంగా లోపలకు వెళ్లి.. వాళ్లను తొడ్కొచ్చారు. విమానం దిగిన విషయం, సింధు వస్తున్న విషయం తెలియగానే అప్పటివరకు లాంజ్‌లో కూర్చున్న మంత్రులంతా ఒక్కసారిగా అప్రమత్తమై.. ఆ ద్వారం వెలుపల ఒకరి తర్వాత ఒకరు వరుసగా నిల్చుని చేతుల్లో పూలబొకేలు పట్టుకున్నారు. అత్యంత పటిష్ఠమైన భద్రత నడుమ బయటకు వచ్చిన సింధు అతి కొద్దిమంది ప్రముఖుల నుంచి మాత్రమే బొకేలు తీసుకుంది. సీఆర్పీఎఫ్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు కూడా ఆమెకు భద్రతావలయం ఏర్పాటుచేసి, ఆమెను త్వరత్వరగా ఓపెన్ టాప్ బస్సు వద్దకు తీసుకెళ్లిపోయారు. -
ఎయిర్‌పోర్టులో సింధుకు ఘనస్వాగతం
ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్‌లో రజత పతకం సాధించి మువ్వన్నెల పతాకాన్ని వినువీధిలో సగర్వంగా ఎగరేసిన పీవీ సింధు, ఆమె కోచ్ గోపీచంద్‌లకు శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఉదయం 9 గంటల సమయంలో విమానాశ్రయంలో దిగిన పీవీ సింధుకు స్వాగతం పలికేందుకు ముందుగానే ఆమె తల్లిదండ్రులు పీవీ రమణ, విజయలతో పాటు తెలంగాణ క్రీడా శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, నాయిని నరసింహారెడ్డి, వి.హనుమంతరావు, మేయర్ బొంతు రామ్మోహన్, ఏపీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మరో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని నాని, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, ఇంకా పలువురు క్రీడా, అధికార, అనధికార ప్రముఖులు శంషాబాద్ చేరుకున్నారు. ముంబై నుంచి ప్రత్యేకంగా తెప్పించిన డబుల్ డెక్కర్ ఓపెన్ టాప్ బస్సును పూలదండలతో అలంకరించారు. బస్సు మొత్తాన్ని చివరి నిమిషంలో కూడా పోలీసు శునకాలతోను, మెటల్ డిటెక్టర్లతోను క్షుణ్ణంగా తనిఖీ చేయించారు. గోపీచంద్ అకాడమీ నుంచి వచ్చిన పలువురు విద్యార్థులు కూడా తమ తోటి క్రీడాకారిణి సింధును సాదరంగా స్వాగతించారు. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆమె ప్రముఖుల నుంచి బొకేలు అందుకుని.. తన కోసం సిద్ధంగా ఉన్న ఓపెన్ టాప్ బస్సు ఎక్కింది. చాలామంది ఆమెకు స్వయంగా పూల బొకేలు, దండలు చేతికి ఇవ్వలేకపోవడంతో.. ఓపెన్ టాప్ బస్సు ఎక్కిన తర్వాత కూడా కింది నుంచి పైకి వాటిని విసిరారు. వాటిని ఆమె అందిపుచ్చుకుని, అక్కడి నుంచే వారికి అభివాదాలు తెలిపారు.