
ఎయిర్‌పోర్టులో సింధుకు ఘనస్వాగతం
ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్‌లో రజత పతకం సాధించి మువ్వన్నెల పతాకాన్ని వినువీధిలో సగర్వంగా ఎగరేసిన పీవీ సింధు, ఆమె కోచ్ గోపీచంద్‌లకు శంషాబాద్లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఉదయం 9 గంటల సమయంలో విమానాశ్రయంలో దిగిన పీవీ సింధుకు స్వాగతం పలికేందుకు ముందుగానే ఆమె తల్లిదండ్రులు పీవీ రమణ, విజయలతో పాటు తెలంగాణ క్రీడా శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, నాయిని నరసింహారెడ్డి, వి.హనుమంతరావు, మేయర్ బొంతు రామ్మోహన్, ఏపీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మరో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని నాని, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, ఇంకా పలువురు క్రీడా, అధికార, అనధికార ప్రముఖులు శంషాబాద్ చేరుకున్నారు.
ముంబై నుంచి ప్రత్యేకంగా తెప్పించిన డబుల్ డెక్కర్ ఓపెన్ టాప్ బస్సును పూలదండలతో అలంకరించారు. బస్సు మొత్తాన్ని చివరి నిమిషంలో కూడా పోలీసు శునకాలతోను, మెటల్ డిటెక్టర్లతోను క్షుణ్ణంగా తనిఖీ చేయించారు. గోపీచంద్ అకాడమీ నుంచి వచ్చిన పలువురు విద్యార్థులు కూడా తమ తోటి క్రీడాకారిణి సింధును సాదరంగా స్వాగతించారు. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆమె ప్రముఖుల నుంచి బొకేలు అందుకుని.. తన కోసం సిద్ధంగా ఉన్న ఓపెన్ టాప్ బస్సు ఎక్కింది. చాలామంది ఆమెకు స్వయంగా పూల బొకేలు, దండలు చేతికి ఇవ్వలేకపోవడంతో.. ఓపెన్ టాప్ బస్సు ఎక్కిన తర్వాత కూడా కింది నుంచి పైకి వాటిని విసిరారు. వాటిని ఆమె అందిపుచ్చుకుని, అక్కడి నుంచే వారికి అభివాదాలు తెలిపారు.