చరిత్ర పునరావృతమైంది
‘‘ఆసియా క్రీడల్లో 16 ఏళ్ల తర్వాత మన జట్టు స్వర్ణం నెగ్గడం చాలా సంతోషంగా అనిపిస్తోంది. చివరిసారి 1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో పసిడి పతకం నెగ్గిన జట్టులో నేనూ సభ్యుడిగా ఉన్నాను. ఈ రోజు ఫలితం చూస్తే చరిత్ర పునరావృతం అయినట్లు అనిపిస్తోంది. అప్పుడు కూడా మేం లీగ్ దశలో కొరియాతో ఓడి ఫైనల్లో వారినే ఓడించాం. ఈసారి లీగ్‌లో పాకిస్థాన్‌తో ఓడినా... తుది పోరులో వారిని చిత్తు చేశాం.
ఫైనల్ మ్యాచ్‌లో నిస్సందేహంగా గోల్ కీపర్ శ్రీజేష్ హీరో అని చెప్పవచ్చు. తీవ్ర ఒత్తిడి సమయంలో అతను షాట్లను అడ్డుకున్న తీరు అద్భుతం. ఇక మ్యాచ్ పరంగా చూస్తే మన డిఫెన్స్ బాగుంది కానీ ఫార్వర్డ్ బలం ఆ స్థాయిలో కనిపించలేదు. రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం మంచి విషయం. ఆలోగా మనం దిద్దుకోవాల్సిన విషయం ఎక్కువ మంది ఫార్వర్డ్లను తయారు చేయడం. రెండేళ్లలో కీలక ఆటగాళ్లు గాయాలపాలైతే పరిస్థితి కష్టమవుతుంది. కాబట్టి ఫార్వర్డ్ బలాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది.’’
- ‘సాక్షి’తో ముకేశ్ కుమార్ (ట్రిపుల్ ఒలింపియన్ )