rishita reddy
-
అక్రమ నిర్మాణాలపై యువతి ట్వీట్
బంజారాహిల్స్: ‘అక్రమ నిర్మాణాలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? మీరంతా అవినీతిపరులా? లేదా రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా? మీ కారణంగా తెలంగాణ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది’ అని రిషితారెడ్డి అనే యువతి చేసిన ట్వీట్ జీహెచ్ఎంసీలో అధికారులను కలవరానికి గురిచేసింది. సదరు యువతి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు, జీహెచ్ఎంసీ కమిషనర్‌తో పాటు ఇతర అధికారులకు ఈ అక్రమ నిర్మాణాలపై చేసిన ఫిర్యాదు సంచలనం సృష్టించింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. సోమాజిగూడలోని కపాడియా లైన్లో అక్రమంగా పది అంతస్తుల హోటల్ నిర్మిస్తున్నారని, కొన్నాళ్ల క్రితం జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశామని ఆమె తెలిపింది. అక్రమ నిర్మాణానికి సంబంధించి ఈ నెల 16న అనుమతి కోసం తీసుకున్న ప్లాన్, ప్రొసీడింగ్స్, ట్రేడ్ లైసెన్స్, ఫైర్ ఎన్వోసీ ఇవ్వాలని సదరు యజమానికి నోటీసులు ఇచ్చామంటూ ఆ కాపీని విశ్వజిత్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇందుకు ఏమాత్రం సంతృప్తి చెందని ఓ వ్యక్తి ట్విట్టర్ వేదికగా.. నోటీసులు ఇచ్చారు గానీ.. ఇప్పటి వరకు చర్యలు ఏమీ తీసుకోలేదని ప్రతిగా మరో పోస్టు చేశారు. పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది పరిశీలించారని, త్వరలో పూర్తి వివరాలు వస్తాయని మరోసారి విశ్వజిత్ ట్వీట్ చేశారు. మరో వైపు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ కూడా ట్విట్టర్ ద్వారా సమాధానమిస్తూ.. ఈ అక్రమ నిర్మాణాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫిర్యాదు అందిన వెంటనే నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చా మని విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ పేర్కొన్నారు. సదరు యువతి చేసిన ట్వీట్‌కు కేటీఆర్ స్పందించారు. ఇప్పుడు జీహెచ్ఎంసీలో ఈ ట్విట్టర్ సమరం హాట్‌టాపిక్‌గా మారింది. ఓ సామాన్యురాలు సంధించిన ప్రశ్నకు ఉన్నతాధికారులతో పాటు కేటీఆర్ కూడా స్పందించడం విశేషం. -
రిషితకు అశ్రునివాళి
జగద్గిరిగుట్ట: ‘కాలేజీ నుంచి రావడంలో ఐదు నిమిషాలు ఆలస్యమైతేనే ఆందోళన చెందే మేము ఇప్పుడు నువ్వు మా నుంచి శాశ్వతంగా దూరం అయ్యావన్న చేదు నిజాన్ని ఎలా తట్టుకోవాలి’.. అంటూ రిషితారెడ్డి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. హిమచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లం తై మృతి చెందిన విజ్ఞానజ్యోతి కాలేజీ విద్యార్థిని రిషితారెడ్డి మృతదేహం 42 రోజుల తర్వాత లభించింది. మృతదేహం లభించినట్టు అధికారులు తల్లిదండ్రులకు ఆదివారం సమాచారం ఇచ్చారు. ఈ దుర్వార్త విన్నప్పటి నుంచి తల్లిదండ్రులు దేవుడా! ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న మా ఒక్కగానొక్క కూతుర్ని తీసుకుపోయావా..? అంటూ గుండెలవిసేలా రోదిస్తూనే ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం 1.35కి రిషితారెడ్డి మృతదేహాన్ని తహసీల్దార్ కృష్ణ శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బాచుపల్లిలోని ఆమె నివాసానికి తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూడగానే తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. అప్పటికే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న బంధువులు, విజ్ఞానజ్యోతి కాలేజీ విద్యార్థులు, సిబ్బంది రిషిత మృతదేహానికి కన్నీటి నివాళులర్పించారు. అనంతరం అశ్రునయనాల మధ్య బాచుపల్లిలోని శ్మాశనవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. బియాస్ ఘటనలో మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, బియాస్ నది ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థులు 24 మంది, అంతకు ముందు పులిచింతల వద్ద చనిపోయిన ఇద్దరు విద్యార్థుల ఫొటోలతో బ్యానర్ ఏర్పాటు చేసి విద్యార్థులు నివాళులర్పించారు. -
‘రిషిత’ ఇంట విషాదఛాయలు
జగద్గిరిగుట్ట(బాచుపల్లి), నల్లకుంట: హిమాచల్‌ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతైన వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి రిషితారెడ్డి ఇంట ఆదివారం విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతదేహం ఆదివారం లభించినట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారిలో నగరానికి చెందిన 16 మందిలో ఇప్పటి వరకు 15 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇక నల్లకుంటకు చెందిన శ్రీహర్ష ఆచూకీ లభించాల్సి ఉంది. గల్లంతైన 42 రోజుల తరువాత రిషితారెడ్డి మృతదేహం లభ్యమైందన్న సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఆమె మరణ వార్త తెలియడంతో కుప్పకూలిపోయారు. అమ్మానాన్నల కుటుంబాల తరఫున.. రిషితారెడ్డి అమ్మ తరఫున, ఇటు నాన్న బంధువుల్లో ఒకే ఒక ఆడపడుచు కావడంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దుఖ: సాగరంలో మునిగిపోయారు. అంత్యక్రియలకుఏర్పాట్లు రిషిత అంత్యక్రియలను బాచుపల్లి గ్రామంలోని శ్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు బంధువులు పేర్కొన్నారు. అంత్యక్రియల కోసం కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ అధికారులు, బాచుపల్లి పంచాయతీ పాలక వర్గం అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఇంకా ఎదురుచూపులే.. ఇక కల్లూరి శ్రీహర్ష (19) ఆచూకి నేటికి తెలియరాలేదు. నల్లకుంట శివం రోడ్డు బతుకమ్మ కుంట సబ్‌స్టేషన్ ఎదురు వీధిలోని శ్రీమత్ రాజాస్ రెసిడెన్సీలో ఉండే అడ్వకేట్ కేఆర్‌కేబీ.ప్రసాద్, స్వర్ణలత దంపతుల కుమారుడు కల్లూరి శ్రీహర్ష (19) గత నెల 8న బియాస్ నదిలో గల్లంతయ్యాడు. ఆదివారం మరో ఇద్దరు విద్యార్థినుల మృతదేహాలు లభ్యం కాగా గల్లంతైన వారిలో నల్లకుంటకు చెందిన శ్రీ హర్ష జాడ నేటికి తెలియరాలేరు.