Risitesvari suicide case
-
ప్రిన్సిపాల్ బాబురావు అరెస్టు
నాగార్జున యూనివర్సిటీ ప్రిన్సిపాల్ బాబురావును ఎట్టకేలకు పెదకాకాని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సంచలనం సృష్టించిన రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్నాడు. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులను ప్రోత్సహించినందుకు ఆయనను అరెస్టు చేయాలంటూ ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. పోలీసులు కేసు నమోదు చేయడంతో అమెరికాకు పారిపోయాడు. ఈ క్రమంలో తిరిగి ఇండియాకు వచ్చిన ఆయనను గుంటూరులోని ఆయన స్వగృహంలో అదుపులోకి తీసుకుని రెండు వారాల రిమాండ్ విధించారు. గుంటూరు సబ్ జైలుకు తరలించారు. -
ని‘వేదన’
రిషితేశ్వరి ఘటనపై రెండోరోజూ కొనసాగిన విచారణ విద్యార్థులు, సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ మృతురాలి తల్లిదండ్రుల వాదనలు విన్న కమిటీ నేటితో ముగియనున్న కమిటీ పర్యటన ఏఎన్‌యూ : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో ప్రభుత్వం నియమించిన నలుగురు సభ్యుల కమిటీ గురువారం వర్సిటీలో సమగ్రంగా విచారణ జరిపింది. రెండోరోజైన గురువారం విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, మృతురాలి తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించారు. తొలిరోజే ఘటనకు సంబంధించిన కీలకాధారాలు సేకరించిన కమిటీ రెండోరోజు మరింత లోతుగా అభిప్రాయాలు, ఆధారాలు సేకరించే దిశగా దర్యాప్తు జరిపింది. కమిటీని ఉదయం పీడీఎస్‌యూ, ఎంఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు కలిసి తమ వాదనలు వినిపించారు. ఐద్వా నాయకురాలు డి.రమాదేవి కమిటీని కలిసి విద్యార్థిని మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిటీకి స్పష్టం చేశారు. అనంతరం వైఎస్సార్ సీపీ, పీడీఎస్‌వో, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, టీఎన్ఎస్ఎఫ్ తదితర విద్యార్థి సంఘాల నాయకులు కమిటీని కలిశారు. ఆర్కిటెక్చర్ విద్యార్థులు కొందరు తల్లిదండ్రుల సహా కమిటీని కలిసి తమ వాదనలు వినిపించారు. అశ్లీల ప్రతిఘటన సంఘం కన్వీనర్ ఈదర గోపీచంద్ కమిటీ రిషితేశ్వరి తండ్రితో కలిసి ర్యాగింగ్ నిరోధానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కమిటీ విచారణ ముగిసే సమయంలో రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్ కమిటీ సభ్యులను కలిశారు. రాత్రి 7:30 గంటల సమయంలో కమిటీ విచారణ ముగించే సమయానికి ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి.బాబురావు కూడా వసతి గృహానికి వచ్చారు. తల్లిదండ్రులతో కమిటీ సుధీర్ఘంగా సమావేశం రిషితేశ్వరి తల్లిదండ్రులు ఎం.మురళీకృష్ణ, దుర్గాబాయిలతో విచారణ కమిటీ సుదీర్ఘంగా సమావేశమైంది. కమిటీని కలిసి బయటకు వచ్చిన అనంతరం నార్త్ డీఎస్పీ రామకృష్ణ, ఏఎస్పీ భాస్కరరావులు విడివిడిగా మూడు గంటలపాటు మృతురాలి తల్లిదండ్రులను విచారించారు. రికార్డులు సేకరించిన కమిటీ.. మరోవైపు కేసుకు సంబంధించిన రికార్డులు, పత్రాలను కమిటీ సభ్యులు సేకరిస్తున్నారు. యూనివర్సిటీ, పోలీసు, రెవెన్యూ అధికారులు కమిటీ కోరిన రికార్డులను విచారణ గదిలో అందజేస్తున్నారు. నేటితో ముగియనున్న కమిటీ పర్యటన.. ముందుగా నిర్ణయించిన ప్రకారం కమిటీ పర్యటన శుక్రవారంతో ముగియనుంది. మూడోరోజు యూనివర్సిటీ ఉన్నతాధికారులు, అవసరమైన ప్రభుత్వ శాఖల అధికారులతో ఓ విడత సమావేశమై నివేదికను రూపొందించనుంది. భద్రతా ఏర్పాట్లు.. కమిటీ విచారణ సందర్భంగా ఉదయం నుంచే యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఐడీ కార్డులు పరిశీలించి సిబ్బంది, విద్యార్థులను లోపలికి పంపారు. కమిటీని కలిసేందుకు వచ్చిన వారిని విడివిడిగా లోపలికి అనుమతించారు. -
నేడు గుంటూరులో కళాశాలల బంద్
పిలుపునిచ్చిన వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం పట్నంబజారు(గుంటూరు) : ఆచార్య నాగార్జున యూనివర్సీటీలో విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసు విచారణ విద్యార్థుల సమక్షంలోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం గుంటూరు నగరంలో కళాశాలల బంద్‌కు పిలుపునిస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య తెలిపారు. అరండల్‌పేటలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రిషితేశ్వరి వ్యవహారంలో విచారణ జరుగుతున్న తీరు లోపభూయిష్టంగా ఉందని ఆరోపించారు. విద్యార్థులు లేకుండా విచారణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. కేసును పక్కదారి పట్టించేందుకు మొదటగా వేసిన నిజనిర్ధారణ కమిటీ నివేదికను తొక్కిపెట్టారని విమర్శించారు. విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ రబ్బానీ మాట్లాడుతూ తక్షణమే సెలవులు రద్దు చేసి, విద్యార్థుల సమక్షంలో బహిరంగ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్ బాబూరావు పేరును ఎఫ్ఐఆర్లో చేర్చడంతో పాటు, బాధ్యులైన వారిని కళాశాల నుంచి తొలగించాలన్నారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నేతలు విఠల్, వినోద్, నాగూర్, కళ్యాణ్, గంటి, సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
పక్కదారి పట్టించేందుకే..
ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాలు ఏఎన్‌యూ : యూనివర్సిటీ వసతి గృహాలు, కళాశాల తరగతులకు పది రోజులు సెలవులు ఇవ్వడం, వసతి గృహాలను ఖాళీ చేయించడం అప్రజాస్వామికమని యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు వసతి గృహాల ముందు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి, యూనివర్సిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వసతి గృహాల నుంచి పరిపాలన భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. పరిపాలనా భవన్లో బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనను పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వం యూనివర్సిటీ తరగతులకు, వసతి గృహాలకు సెలవులు ప్రకటించిందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. కుల సంఘాల బోర్డుల తొలగింపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి తెలియజేస్తాం : రిజిస్ట్రార్ ధర్నా చేస్తున్న విద్యార్థుల వద్దకు రిజిస్ట్రార్ పి.రాజశేఖర్, నిజనిర్ధారణ కమిటీ కన్వీనర్ సి.రాంబాబు వచ్చి ధర్నా విరమించాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు తమ డిమాండ్లను తెలియజేశారు. దీనికి రిజిస్ట్రార్ స్పందిస్తూ ప్రభుత్వ ఆదేశాల మేరకు యూనివర్సిటీ, పోలీసు, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. కేసు నీరుగార్చేందుకే సెలవులిచ్చారు..! వైఎస్సార్ సీపీ నేతలు మర్రి, మేరుగ ఏఎన్‌యూ : ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసును నీరుగార్చేందుకే యూనివర్సిటీకి సెలవులిచ్చారని వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆరోపించారు. వైఎస్సార్సీపీ నాయకులు శనివారం సాయంత్రం యూనివర్సిటీలో ఇన్చార్జి వీసీ కేఆర్ఎస్ సాంబశివరావును కలిసి వసతి గృహాలు ఎందుకు మూసివేశారని అడిగారు. యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించడానికే సెలవు ప్రకటించామని ఇన్చార్జి వీసీ చెప్పారు. దీనికి వైఎస్సార్ సీపీ నాయకులు స్పందిస్తూ కేసును నీరుగార్చేందుకు ప్రణాళికాబద్ధంగా కుట్ర జరుగుతోందని అనుమానంగా ఉందన్నారు. యూనివర్సిటీ అధికారులు, అధ్యాపకులే కుల సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. మర్రి, మేరుగ వెంట వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షడు పానుగంటి చైతన్య ఉన్నారు. -
కేసుకు సెలవు!
♦ పక్కదారి పట్టించేందుకు వ్యూహం ♦ మరిన్ని అకృత్యాలు వెలుగులోకి వస్తాయనే భయం ♦ మిగిలిన విద్యార్థులు, ప్రిన్సిపల్‌ను కాపాడే యత్నం సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి పది రోజులు సెలవు ప్రకటించడం పట్ల వివిధ వర్గాల్లో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రిషితేశ్వరి మృతి కేసులో మిగిలిన దోషులు, ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్ బాబూరావును కాపాడేందుకు రిజిస్ట్రార్ వ్యూహాత్మకంగా సెలవులు ప్రకటించారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. రిషితేశ్వరి ర్యాగింగ్‌లో పదిమందికిపైగానే విద్యార్థులు ఉన్నారని, ఇప్పటికి ముగ్గురు అరెస్టు కాగా, మిగిలిన వారిని ఈ కేసు నుంచి రక్షించేందుకు సెలవులు ప్రకటించారనే వాదనలు కూడా విన్పిస్తున్నాయి. యూనివర్సిటీ పాలనా వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి జోక్యం చేసుకునే అధికారం లేకపోయినప్పటికీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సూచనల మేరకు వైస్ ఛాన్సలర్ నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇదంతా కేసును నీరుగార్చేందుకేనని ప్రజా సంఘాలు చెబుతున్నాయి. గతంలో ఇంత కంటే పెద్ద సంఘటనలు జరిగినప్పటికీ యూనివర్సిటీకీ సెలవులు ప్రకటించలేదు. రిషితేశ్వరి మృతి కేసులోని దోషులను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఓ వైపున పోలీస్ దర్యాప్తు, మరోవైపు విశ్వవిద్యాలయం నియమించిన కమిటీ, ఇంకోవైపు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు కృషి చేస్తున్నాయి. లైంగిక వేధింపులు బహిర్గతం అయ్యేవి.. విద్యార్థి సంఘాలన్నీ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఉద్యమాన్ని ఉదృ్ధతం చేస్తూ వాస్తవాలు వెలుగులోకి వచ్చే వాతావరణాన్ని తీసుకువచ్చాయి. ఈ క్రమంలోనే ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్ బాబూరావు చేష్టలు, వ్యవహారశైలి బహిర్గతం అయ్యాయి. ప్రిన్సిపల్ వ్యవహారాన్ని విద్యార్థులు వెలుగులోకి తీసుకువచ్చారు. ఆ ప్రిన్సిపల్‌తోపాటు మరికొందరు ప్రొఫెసర్ల అకృత్యాలు, లైంగిక వేధింపుల వివరాలు విద్యార్థుల వద్ద ఉన్నట్టు నిఘా సంస్థలు ప్రభుత్వానికి సమాచారం అందించాయి. గతంలో సైన్స్ కళాశాలలోని ఒక విభాగంలో పరిశోధనా పర్యవేక్షకుడు తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ మహిళా పరిశోధకురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. పొరుగు సేవల ఉద్యోగిని సంబంధిత విభాగ అధికారి తనను లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేసింది. ఇవన్నీ కొంతకాలానికి సద్దుమణిగిపోయాయి. విచారణ నిర్విరామంగా కొనసాగితే వీటిని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు బహిర్గతం చేసే అవకాశాలు ఉండటంతో ఆకస్మికంగా సెలవులు ప్రకటించారనే అభిప్రాయం బలంగా విన్పిస్తోంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.. నెల రోజుల క్రితం తరగతులు ప్రారంభమైనప్పటికీ, జూనియర్లకు సక్రమంగా క్లాసులు జరగడం లేదు. సీనియర్లకు గెస్ట్ ఫ్యాకల్టీ వివాదం నేపథ్యంలో పూర్తి స్థాయిలో తరగతులు జరగడం లేదు. వీరికి రెగ్యులర్, ఒప్పంద అసిస్టెంట్ ప్రొఫెసర్లు క్లాస్‌లు తీసుకుంటున్నారు. మొత్తం మీద ఈ నెల రోజుల్లో పూర్తిస్థాయిలో తరగతులు జరగలేదు. ఈ నేపథ్యంలోనే పది రోజులు సెలవులు ప్రకటించారు. అక్టోబరులో మరో పది రోజులు దసరా సెలవులు ఉన్నాయి. దీంతో విద్యాసంవత్సరం సక్రమంగా జరుగతుందా? సిలబస్ సకాలంలో పూర్తవుతుందాఅనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలు కూడా శనివారం సాయంత్రం వైస్ఛాన్సలర్తోపాటు పలువురు ఉన్నతాధికారులను కలిసి ప్రకటించిన సెలవులను రద్దు చేయాలని, యూనివర్సిటీలో విద్యార్థినిలకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ ఘటనలో బాధ్యులైన వారందరిపైనా చర్యలు తీసుకోవాలని పార్టీ జిల్లా అధ్యక్షులు మర్రి రాజశేఖర్, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు.