ని‘వేదన’ | Risitesvari Suicide Case | Sakshi
Sakshi News home page

ని‘వేదన’

Published Fri, Jul 31 2015 1:31 AM | Last Updated on Sun, Sep 3 2017 6:27 AM

Risitesvari Suicide Case

రిషితేశ్వరి ఘటనపై రెండోరోజూ కొనసాగిన విచారణ
 విద్యార్థులు, సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ
 మృతురాలి తల్లిదండ్రుల వాదనలు విన్న కమిటీ
 నేటితో ముగియనున్న కమిటీ పర్యటన
 
 ఏఎన్‌యూ : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో ప్రభుత్వం నియమించిన నలుగురు సభ్యుల కమిటీ గురువారం వర్సిటీలో సమగ్రంగా విచారణ జరిపింది. రెండోరోజైన గురువారం విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, మృతురాలి తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించారు. తొలిరోజే ఘటనకు సంబంధించిన కీలకాధారాలు సేకరించిన కమిటీ రెండోరోజు మరింత లోతుగా అభిప్రాయాలు, ఆధారాలు సేకరించే దిశగా దర్యాప్తు జరిపింది. కమిటీని ఉదయం పీడీఎస్‌యూ, ఎంఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు కలిసి తమ వాదనలు వినిపించారు.
 
  ఐద్వా నాయకురాలు డి.రమాదేవి కమిటీని కలిసి విద్యార్థిని మృతికి కారణమైన వారిపై కఠిన  చర్యలు తీసుకోవాలని కమిటీకి స్పష్టం చేశారు. అనంతరం వైఎస్సార్ సీపీ, పీడీఎస్‌వో, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, టీఎన్‌ఎస్‌ఎఫ్ తదితర విద్యార్థి సంఘాల నాయకులు కమిటీని కలిశారు. ఆర్కిటెక్చర్ విద్యార్థులు కొందరు తల్లిదండ్రుల సహా కమిటీని కలిసి తమ వాదనలు వినిపించారు. అశ్లీల ప్రతిఘటన  సంఘం కన్వీనర్ ఈదర గోపీచంద్ కమిటీ రిషితేశ్వరి తండ్రితో కలిసి ర్యాగింగ్ నిరోధానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కమిటీ విచారణ ముగిసే సమయంలో రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్ కమిటీ సభ్యులను కలిశారు. రాత్రి 7:30 గంటల సమయంలో కమిటీ విచారణ ముగించే సమయానికి ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి.బాబురావు కూడా వసతి గృహానికి వచ్చారు.
 
 తల్లిదండ్రులతో కమిటీ సుధీర్ఘంగా సమావేశం
 రిషితేశ్వరి తల్లిదండ్రులు ఎం.మురళీకృష్ణ, దుర్గాబాయిలతో విచారణ కమిటీ సుదీర్ఘంగా సమావేశమైంది. కమిటీని కలిసి బయటకు వచ్చిన అనంతరం నార్త్ డీఎస్పీ రామకృష్ణ, ఏఎస్పీ భాస్కరరావులు విడివిడిగా మూడు గంటలపాటు మృతురాలి తల్లిదండ్రులను విచారించారు.   
 
 రికార్డులు సేకరించిన కమిటీ..
 మరోవైపు కేసుకు సంబంధించిన రికార్డులు, పత్రాలను కమిటీ సభ్యులు సేకరిస్తున్నారు. యూనివర్సిటీ, పోలీసు, రెవెన్యూ అధికారులు కమిటీ కోరిన రికార్డులను విచారణ గదిలో అందజేస్తున్నారు.
 
 నేటితో ముగియనున్న కమిటీ పర్యటన..
 ముందుగా నిర్ణయించిన ప్రకారం కమిటీ పర్యటన శుక్రవారంతో ముగియనుంది. మూడోరోజు యూనివర్సిటీ ఉన్నతాధికారులు, అవసరమైన ప్రభుత్వ శాఖల అధికారులతో ఓ విడత సమావేశమై నివేదికను రూపొందించనుంది.  
 
 భద్రతా ఏర్పాట్లు.. కమిటీ విచారణ సందర్భంగా  ఉదయం నుంచే యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఐడీ కార్డులు పరిశీలించి సిబ్బంది, విద్యార్థులను లోపలికి పంపారు. కమిటీని కలిసేందుకు వచ్చిన వారిని విడివిడిగా లోపలికి అనుమతించారు.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement