పక్కదారి పట్టించేందుకే..
ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాలు
ఏఎన్‌యూ : యూనివర్సిటీ వసతి గృహాలు, కళాశాల తరగతులకు పది రోజులు సెలవులు ఇవ్వడం, వసతి గృహాలను ఖాళీ చేయించడం అప్రజాస్వామికమని యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు వసతి గృహాల ముందు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి, యూనివర్సిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వసతి గృహాల నుంచి పరిపాలన భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. పరిపాలనా భవన్‌లో బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనను పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వం యూనివర్సిటీ తరగతులకు, వసతి గృహాలకు సెలవులు ప్రకటించిందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. కుల సంఘాల బోర్డుల తొలగింపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వానికి తెలియజేస్తాం : రిజిస్ట్రార్
ధర్నా చేస్తున్న విద్యార్థుల వద్దకు రిజిస్ట్రార్ పి.రాజశేఖర్, నిజనిర్ధారణ కమిటీ కన్వీనర్ సి.రాంబాబు వచ్చి ధర్నా విరమించాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు తమ డిమాండ్లను తెలియజేశారు. దీనికి రిజిస్ట్రార్ స్పందిస్తూ ప్రభుత్వ ఆదేశాల మేరకు యూనివర్సిటీ, పోలీసు, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు.
కేసు నీరుగార్చేందుకే సెలవులిచ్చారు..!
వైఎస్సార్ సీపీ నేతలు మర్రి, మేరుగ
ఏఎన్‌యూ : ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసును నీరుగార్చేందుకే యూనివర్సిటీకి సెలవులిచ్చారని వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు శనివారం సాయంత్రం యూనివర్సిటీలో ఇన్‌చార్జి వీసీ కేఆర్‌ఎస్ సాంబశివరావును కలిసి వసతి గృహాలు ఎందుకు మూసివేశారని అడిగారు. యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించడానికే సెలవు ప్రకటించామని ఇన్‌చార్జి వీసీ చెప్పారు. దీనికి వైఎస్సార్ సీపీ నాయకులు స్పందిస్తూ కేసును నీరుగార్చేందుకు ప్రణాళికాబద్ధంగా కుట్ర జరుగుతోందని అనుమానంగా ఉందన్నారు. యూనివర్సిటీ అధికారులు, అధ్యాపకులే కుల సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. మర్రి, మేరుగ వెంట వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షడు పానుగంటి చైతన్య ఉన్నారు.