పిలుపునిచ్చిన వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం
పట్నంబజారు(గుంటూరు) : ఆచార్య నాగార్జున యూనివర్సీటీలో విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసు విచారణ విద్యార్థుల సమక్షంలోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం గుంటూరు నగరంలో కళాశాలల బంద్‌కు పిలుపునిస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య తెలిపారు. అరండల్‌పేటలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రిషితేశ్వరి వ్యవహారంలో విచారణ జరుగుతున్న తీరు లోపభూయిష్టంగా ఉందని ఆరోపించారు. విద్యార్థులు లేకుండా విచారణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. కేసును పక్కదారి పట్టించేందుకు మొదటగా వేసిన నిజనిర్ధారణ కమిటీ నివేదికను తొక్కిపెట్టారని విమర్శించారు. విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ రబ్బానీ మాట్లాడుతూ తక్షణమే సెలవులు రద్దు చేసి, విద్యార్థుల సమక్షంలో బహిరంగ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్ బాబూరావు పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడంతో పాటు, బాధ్యులైన వారిని కళాశాల నుంచి తొలగించాలన్నారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నేతలు విఠల్, వినోద్, నాగూర్, కళ్యాణ్, గంటి, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
నేడు గుంటూరులో కళాశాలల బంద్
Published Fri, Jul 31 2015 1:27 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement