Risitheswari
-
ఆగస్టు 13 నుంచి రిషితేశ్వరి కేసు విచారణ ప్రారంభం
దోషులకు శిక్ష పడినప్పుడే ఆమె ఆత్మకు శాంతి సీనియర్ న్యాయవాది వైకే గుంటూరు (లక్ష్మీపురం) : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ మహమ్మారికి బలైన ఆర్కిటెక్చర్ విద్యార్థిని ఎం. రిషితేశ్వరి కేసులో దోషులకు శిక్ష పడినప్పుడు ఆమె ఆత్మకు శాంతి చేకూరుతుందని సీనియర్ న్యాయవాది వై. కోటేశ్వరరావు (వైకే) ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సహ విద్యార్థుల అమానుష చర్యల కారణంగా బలవన్మరణానికి పాల్పడి గురువారానికి ఏడాది పూర్తవుతున్న దృష్ట్యా ఆర్కిటెక్చర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ బాబూరావుతో సహా మరో ముగ్గురు విద్యార్థులు నిందితులుగా ఉన్న ఆ కేసు విచారణ ప్రక్రియ గుంటూరు 4వ అదనపు అసిస్టెంట్ సెషన్స్ మహిళా న్యాయమూర్తి కమలాదేవి కోర్టులో ఆగస్టు 13 నుంచి ప్రారంభం కానున్నదని వెల్లడించారు. ఈ మేరకు నలుగురు నిందితులు కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి సమన్లు జారీ చేశారని వివరించారు. యావజ్జీవ కారాగార శిక్ష పడే ర్యాగింగ్ నిరోధక చట్టం ఐపీసీలోని 306 తదితర సెక్షన్ల కింద కేసు విచారణ జరగనున్నదని తెలిపారు. కేసు విచారణ అసిస్టెంట్ సెషన్సు జడ్జి కాకుండా, సెషన్స్ జడ్జితో చేపట్టాలని కోరుతూ ఫిర్యాదిదారు రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ తరఫున కోర్టులో పిటిషన్ వేసే అంశం పరిశీలనలో ఉందని తెలిపారు. మృతురాలి తండ్రి మురళీకృష్ణ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్, ఆర్కిటెక్చర్ కళాశాల నూతన ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డిని కలిసి గురువారం రిషితేశ్వరి సంస్మరణను విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ వ్యతిరేక దినంగా నిర్వహించాలని కోరారని తెలిపారు. అందుకు వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. -
హనీషా పాత్రపై ఆధారాలు పంపండి
రిషితేశ్వరి మృతికేసులో ఆదేశించిన జాతీయ మహిళా కమిషన్ గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో విద్యార్థిని హనీషా పాత్రపై ఆధారాలుంటే తమకు పంపాలని జాతీయ మహిళా కమిషన్ నాలుగు రోజుల కిందట పోలీసు ఉన్నతాధికారుల్ని ఆదేశించింది. దీంతో పోలీసు అధికారులు హనీషా పాత్రపై తమవద్ద ఉన్న ఆధారాలు పంపించారు. విద్యార్థిని భవిష్యత్తు దృష్ట్యా జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. దీంతో ఆమె పాత్రపై ఆధారాలు పంపాలని పోలీసుల్ని ఆదేశించింది. -
‘మీలో పశ్చాత్తాపం కనిపించడం లేదు’
మాజీ ప్రిన్సిపల్ బాబురావునుద్దేశించి జడ్జి లక్ష్మీనరసింహారెడ్డి రిషితేశ్వరి కేసు మూసివేసిన జిల్లా న్యాయసేవాధికార సంస్థ గుంటూరు లీగల్: ‘ఒక అమ్మాయికి అన్యాయం జరిగినా.. ఇప్పటికీ మీలో పశ్చాత్తాపం కనిపించడం లేదు...’ అంటూ రిషితేశ్వరి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్కిటెక్చర్ కళాశాల పూర్వ ప్రిన్సిపల్ బాబురావును ఉద్దేశించి న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జి. లక్ష్మీనరసింహారెడ్డి వ్యాఖ్యానించారు. ఆచార్య నాగార్జున యూనివర్సీటీ విద్యార్థిని రిషితేశ్వరి కేసులో ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్ బాబూరావు, వార్డెన్ స్వరూపారాణిలు శుక్రవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఎదుట హాజరయ్యారు. రిషితేశ్వరికేసులో ‘సాక్షి’ కథనాలను ఆధారంగా సుమోటోగా తీసుకుని వారిద్దరికీ ప్రిలిటికేషన్ కేసు కింద నోటీసులు పంపిన విషయం విదితమే. నోటీసులు అందుకున్న ఇద్దరూ ఈ నెల 1వ తేదీన సంస్థ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. మరింత సమగ్ర సమచారంతో రావాలని న్యాయమూర్తి వారిని ఆదేశిస్తూ విచారణను 7వ తేదీకి వాయిదా వేశారు. దీంతో తిరిగి ఇరువురూ హాజరుకాగా ఇప్పటికే ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, ప్రభుత్వం నియమించిన సుబ్రమణ్యం కమిటీ సైతం విచారణ జరుపుతున్న తరుణంలో ప్రిలిటికేషన్ కేసును కొనసాగించాల్సిన అవసరం లేదంటూ ఈ కేసును మూసివే స్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. అయితే మహిళా న్యాయవాదులు అధిక సంఖ్యలో హాజరై విద్యార్థిని మృతి పట్ల ప్రిన్సిపల్ బాబురావులో ఎటువంటి పశ్చాతాపం కనపడటం లేదని న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి ప్రిన్సిపల్ పదవిలో ఎవరూ ఉన్నా విద్యార్థిని మృతి పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చే స్తారని, కానీ మీలో అది కనపడటంలేని బాబురావుని ప్రశ్నించారు. సమాధానంగా బాబురావు మాట్లాడుతూ జరిగిన సంఘటనపై తాను తీవ్రంగా పశ్చాత్తాపం చెందుతున్నానని తెలిపారు. పక్కనే ఉన్న ప్రిన్సిపుల్ కుమారుడిని ‘ఏం చేస్తున్నావు?’ ప్రశ్నించగా తాను ‘ఇంటీరియర్ డెకరేషన్’ చేస్తున్నట్లు ఆ యువకుడు తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి లక్ష్మీనరసింహారెడ్డి ‘ముందు మీ తండ్రిని డెకరేట్ చేయాల్సిన అవసరం ఉంది...’ అని వ్యాఖ్యానించారు.