విద్యావంతుడి విషాదాంతం
- బైకును డీసీఎం వ్యాన్
- ఢీకొనడంతో ప్రమాదం
పరిగి: డీసీఎం వ్యాన్ బైక్ను ఢీకొన్న ప్రమాదంలో ఓ విద్యావంతుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన పరిగి మండల పరిధిలోని సయ్యద్మల్కాపూర్ సమీపంలో పరిగి-షాద్నగర్ రోడ్డులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ శంషొద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కాళ్లాపూర్ గ్రామానికి చెందిన కోస్గి సత్యనారాయణ(26) పీజీ పూర్తి చేశాడు.
ప్రస్తుతం గ్రూప్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నాడు. అతడు ఆదివారం పనినిమిత్తం పరిగికి బైక్పై వచ్చాడు. రాత్రి 10 గంటల సమయంలో స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. ఈక్రమంలో సయ్యద్మల్కాపూర్ సమీపంలో ఎదురుగా వస్తున్న డీసీఎం వ్యాన్ అతడి బైక్ను ఢీకొంది. ప్రమాదంలో సత్యనారాయణ తీవ్రంగా గాయపడ్డాడు.
వాహనదారులు గమనించి అతడిని పరిగి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే సత్యనారాయణ మృతిచెందినట్లు నిర్ధారించారు. సోమవారం పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. సత్యనారాయణ మృతితో అతడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతుడి తండ్రి సూర్యప్రకాష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ షేక్శంషొద్దీన్ తెలిపారు.