నాలుగేళ్లలో నాలుగు రెట్లు
భారత్లో ఆన్లైన్ రిటైల్ మార్కెట్ జోరు
ఆర్ఎన్సీఓఎస్ నివేదిక వెల్లడి
గౌహతి: భారత ఆన్లైన్ రిటైల్ మార్కెట్ జోరుగా దూసుకుపోతోంది. నాలుగేళ్లలో ఈ మార్కెట్ నాలుగు రెట్ల వృద్ధిని సాధిస్తుందని రీసెర్చ్, కన్సల్టెన్సీ సంస్థ ఆర్ఎన్సీఓఎస్ అంచనా వేస్తోంది. ఈ సంస్థ రూపొందించిన నివేదిక ప్రకారం...,
భారత ఆన్లైన్ రిటైల్ మార్కెట్ 2014-18 కాలానికి 40-45 శాతం చక్రగతిన వృద్ధి సాధిస్తుంది. ప్రస్తుతం 350 కోట్ల డాలర్లు (రూ.21,000 కోట్లు)గా ఉన్న ఈ మార్కెట్ 2018 నాటికి 1,450 కోట్ల డాలర్ల(రూ.88,000 కోట్లకు మించి)కు చేరుతుంది.
డిజిటల్ విప్లవం కారణంగా భారత ఆన్లైన్ రిటైల్ మార్కెట్ అప్రతిహతంగా దూసుకుపోతోంది.
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో భారత్లోనే అన్లైన్ రిటైల్ మార్కెట్ వేగంగా వృద్ధి సాధిస్తోంది.
స్మార్ట్ఫోన్ల విక్రయాలు పెరగడం, మొబైల్ ఇంటర్నెట్ విస్తరణ, సమయం కలసి వస్తుండడం, ఆన్లైన్లో షాపింగ్ చేయడం సులభంగా, సౌకర్యకరంగా ఉండడం, ఆన్లైన్లో భారీగా డిస్కౌంట్లు లభిస్తుండడం, స్మార్ట్ఫోన్ల ద్వారా ఆన్లైన్ షాపింగ్ సులభంగా చేసుకునే వీలుండడం, మహిళలు మరింతగా టెక్నాలజీని వినియోగిస్తుండడం, బ్రాండెడ్ ఉత్పత్తుల పట్ల మక్కువ పెరగడం, వంటి కారణాల ఈ మార్కెట్ వృద్ధికి ఇతోధికంగా దోహదపడుతున్నాయి.
ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ పరికరాలు అధికంగా అమ్ముడవుతున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో దుస్తులు, పుస్తకాలు ఉన్నాయి. భవిష్యత్తులో దుస్తులు, సంబంధిత యాక్సెసరీలు అగ్రస్థానంలోకి వస్తాయి. ఇళ్ల అలంకరణ, ఫర్నీషింగ్స్ ఉత్పత్తుల విక్రయాలు కూడా బాగా పెరుగుతాయి.
చెల్లింపు విధానాలు, వస్తువులను రిటర్న్ చేసే విధానాలు సౌకర్యకరంగా ఉండడం వంటి అంశాల కారణంగా ఈ మార్కెట్ వృద్ధి మరింతగా పెరుగుతుంది.
గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యాలు ఇంకా అందుబాటులోకి రాకపోవడం, ఆన్లైన్లో చెల్లింపు విధానాలపై కొంతమంది వినియోగదారులకు సందేహాలు తొలగకపోవడం వంటి సమస్యలున్నాయి.