2,94,781 మంది ఓటర్లు
తిరుపతి ఉపఎన్నికలో
ఓటు వినియోగానికి అవకాశం
తుది జాబితా విడుదల చేసిన ఆర్వో
తిరుపతి తుడా: తిరుపతి ఓటర్ల తుది జాబితా ను ఆర్వో వీ.వీరబ్రహ్మయ్య మంగళవారం ఆర్డీవో కార్యాలయంలో విడుదల చేశారు. 2015 జనవరి 27 నాటికి 2,94,781 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారని ఆయన చెప్పారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తుది జాబితాను విడుదల చేసినట్టు ఆయన చెప్పారు. పురుషులు-1,50,043, మహిళలు-1,44,699, ఇతరులు- 39 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఈ నెల 13న జరగనున్న తిరుపతి ఉపఎన్నికలో వీరంతా ఓటుహక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లను అధికారులు క్షణ్ణంగా పరిశీలించిన తర్వాత జాబితాను విడుదల చేసినట్టు చెప్పారు.
ఏర్పాట్లకు ఆదేశం
పోలింగ్ దగ్గరకు సమీపిస్తుండటంతో ఆర్వో ఏర్పాట్లపై దృష్టి సారించారు. తిరుపతి అసెంబ్లీలో 256 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో అవసరమయ్యే ఏర్పాట్లును త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పోలింగ్ స్టేషన్లో తాగునీరు, లైటింగ్, బారికేడ్లు స్టేషన్ నంబర్లు కనిపించేలా అతికించడం వంటి వాటిపై దృష్టి సారించాలని పీవో, ఏపీవోలకు ఆదేశాలు జారీ చేశారు.