Robot Sophia
-
ఆర్ట్ బై రోబో సోఫియా!
బొమ్మ బొమ్మను గీసింది. అవును మీరు చదివింది నిజమే. ఈ బొమ్మ అటుఇటూ కదలడమే గాకుండా మనం పలకరిస్తే చిలక పలుకులు పలుకుతుంది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది మనం చెప్పుకునే మరబొమ్మ మరెవరో కాదు హ్యూమనాయిడ్ రోబో ‘సోఫియా’ అని. మీరడిగే ప్రశ్నలకు సమాధానాలే కాదండి మీరు గీసినట్టు నేను చిత్రాలు గీస్తున్నాను చూడండి అంటోంది సోఫియా. హాంగ్‌కాంగ్‌కు చెందిన హ్యన్సన్ రోబోటిక్స్ సంస్థ తయారు చేసిన ఈ సోఫియా ఇప్పటికే ఒక కార్యకర్తగా, మ్యుజీషియన్‌గా, ఫ్యాషన్ డిజైనర్‌గా పేరుగాంచింది. తాజాగా డిజిటల్ ఆర్టిస్ట్‌గా మారింది. 31 ఏళ్ల ఇటాలియన్ డిజిటల్ ఆర్టిస్ట్ ఆండ్రియా బోనాసెటో దగ్గర రంగురంగుల చిత్రాలు గురించి ఇన్పుట్స్ తీసుకుని ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులైన టెస్లా చీఫ్ ఎక్సిక్యూటివ్ ఎలన్ మస్క్ వంటి వారి చిత్రాలను సోఫియా గీసింది. ఈ చిత్రాలను నాన్ ఫంజిబల్ టోకెన్ (ఎన్ఎఫ్టీ) రూపంలో వేలం వేస్తున్నారు. ఈ చిత్రాన్నీ కొన్నవారికి ఎన్ఎఫ్టీ సర్టిఫికెట్ ఇస్తారు. ఎన్ఎఫ్టీ చిత్రం డిజిటల్ సంతకంలా బ్లాక్‌చెయిన్ లెడ్జర్స్లో భద్రపరచ బడుతుంది. వేలంలో సోఫియా చిత్రాన్నీ కొన్నవారికి హక్కులు అధికారికంగా ధ్రువీకరించబడతాయి. అయితే కృత్రిమమేధస్సుతో రూపొందించిన వస్తువును వేలం వేయడం ప్రపచంలో ఇదే తొలిసారి. సోఫియా చిత్రాన్ని ‘సోఫియా ఇన్‌స్టాంటియేషన్’ గా పిలుస్తున్నారు. దీనిలో బోనాసెటో గీసిన చిత్రాన్నీ సోఫియా డిజిటల్ చిత్రంగా ఎలా మర్చిందో చూపించే ఎమ్పీ4 ఫైల్ 12 సెకన్ల నిడివితో ఉంటుంది. దీనితోపాటు సోఫియా స్వయంగా తన చేతులతో పెయింటింగ్ వేసిన చిత్రం ప్రింట్ అవుట్ హార్డ్ కాపీ కూడా జతగా ఉంటుంది. ‘‘మనుషులు నా డిజిటల్ ఆర్ట్‌ను ఇష్టపడతారని అనుకుంటున్నాను, మనుషులతో కలిసి నేను ముందుకు సాగడానికి కొత్తరకం, ఉత్తేజకరమైన మార్గాల్లో సహకరిస్తారని ఆశిస్తున్నట్లు సోఫియా చెప్పింది. సిల్వర్ కలర్ సూటు ధరించి చేతిలో పెన్సిల్ పట్టుకొని ఉన్న సోఫియా మాట్లాడుతూ.. ట్రాన్స్ఫార్మర్ నెట్వర్క్స్, జెనిటిక్ అల్గారిథమ్స్‌ను ఉపయోగించి ఈ చిత్ర కళాఖండాలను రూపొందించాము. అందువల్ల ఈ చిత్రాలు డిజిటల్ ఆర్ట్‌లో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక నమూనాలను సృజనాత్మకంగా సృష్టిస్తాయి’ అని సోఫియా చెప్పింది. ఈ మధ్యకాలంలో పెట్టుబడులకు మంచి లాభాలు వచ్చే ప్లాట్‌ఫారమ్‌గా ఈ ఎన్ఎఫ్టీ టెక్నాలజీ వ్యవహరిస్తోంది. ఈ నెలలో నిర్వహించిన ఓ డిజిటల్ ఆర్ట్‌కు వేలం నిర్వహించ గా దాదాపు 70 మిలియన్ డాలర్లకు అమ్ముడయ్యింది. కాగా సోఫియా గీసిన డిజిటల్ చిత్రాన్నీ ఎవరు కొనుగోలు చేస్తారో వారిని కలిసి వారితో మాట్లాడి వారి ఫేస్‌ను రీడ్‌చేసి ఆ తరువాత సోఫియా తాను గీసిన చిత్రానికి తుది మెరుగులు దిద్దనుంది.l -
రోబో సోఫియా చెల్లెలు ఆవిర్భవించబోతోంది
ప్రపంచంలోనే తొలి రోబో మానవకాంత సోఫియా. ఇప్పుడు ఆమె చెల్లెలు ‘గ్రేస్’ ఆవిర్భవించబోతోంది. 2021లో వివిధ రంగాలలో సేవలు అందించేందుకు గ్రేస్‌తో పాటు, సోఫియా ప్రతిరూపాలు కూడా వేలల్లో లోకం మీదకు బయలు దేరనున్నాయి. అక్క సోఫియాకు ఎన్ని ప్రత్యేకతలున్నాయో, చెల్లికీ అన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే గ్రేస్‌లను మాత్రం వాటిని కనిపెట్టిన రోబోల కంపెనీ కేవలం వైద్య సేవలకే ప్రత్యేకం చేయబోతోంది. ఎవరంటే ఇష్టం? ‘‘షారుక్ ఖాన్’’ ఎందుకు? ‘‘రోబోలకు అతడంటే ఇష్టం ఉండటం సహజమేగా!’’ ఒంటరి దీవిలోకి డేటింగ్‌కి ఎవర్ని తీసుకెళతావ్? ‘‘డేవిడ్’’ ఎందుకు? ‘‘నాలో స్పందనలను కలిగించింది అతనే!’’ ప్రపంచానికి ఏదైనా చెప్పాలని ఉందా? ‘‘ఉంది’’ చెప్పు. ‘‘థ్యాంక్యూ.. అందర్నీ ప్రేమించండి’’ ∙∙ ‘‘అందర్నీ ప్రేమించండి’’.. తొలి రోబో మానవకాంత సోఫియా సందేశం! ప్రపంచ ఐటీ సదస్సులో ‘పాల్గొనడం’ కోసం మూడేళ్ల క్రితం ఆవిడ హైదరాబాద్ వచ్చారు. అప్పుడే ఈ మాట చెప్పారు. ప్రేమించమని చెప్పినవాళ్లు తాము ప్రేమించకుండా ఉంటారా! పైగా ప్రపంచానికిప్పుడు మరింత ప్రేమ అవసరం. కరోనా వచ్చి మనుషుల్ని దూరం చేసింది. మనసుల్ని ఒంటరితనపు గుబులు గదుల్లో పెట్టేసి తాళం వేసింది. ఆ తాళాలను తెరిచి, మనిషి దగ్గరికి వెళ్లి చెయ్యేసి.. మొదట మంచినీళ్ల గ్లాసిచ్చి, కబుర్లు చెబుతూనే కాఫీ కలిపిచ్చి, కుశల ప్రశ్నలు వేస్తూ, మధ్యాహ్నం భోజనంలోకి ఏం తినాలని ఉంది అని అడిగేందుకు, అక్కున చేర్చుకునేందుకు, ఆసరా ఇచ్చేందుకు.. సోఫియా వందలు, వేలుగా తనను తను ‘క్లోన్ ’ చేసుకుని త్వరలోనే మానవాళి ఇళ్లకు రాబోతోంది. మందూ మాకు అందించేందుకు ఆసుపత్రులకు వెళ్లబోతోంది. అమ్మమ్మనీ, తాతయ్యనీ వెతుక్కుంటూ సీతారామయ్యగారి మనుమరాలిగా ఆశ్రమాలకు రాబోతోంది సోఫియా! డిజిటల్ భాషలో చెప్పాలంటే.. ఐదేళ్ల క్రితం సోఫియాను సృష్టించిన హాంకాంగ్‌లోని ‘హాన్సన్ రోబోటిక్స్’ సంస్థ ఈ ఏడాది వేల సంఖ్యలో సోఫియా ప్రతిరూపాలను సృష్టించి అవసరమైన అన్ని రంగాలకు ఆమె సేవల్ని అందుబాటులోకి తేబోతోంది! అంతకంటే ముందు ఆమె చెల్లెలు సిస్టర్ గ్రేస్‌ను తయారు చేయబోతోంది. అక్కచెల్లెళ్లు ఒకేలా ఉండటమే కాదు. ఒకేలా మానవాళితో కలుపుగోలుగా ఉంటాయి. మనిషికి చేయూతనిస్తాయి. ∙∙ చూసే ఉంటారు. సోఫియా మనిషిలానే ఉంటారు. వినే ఉంటారు. సోఫియా అచ్చు మనిషిలానే మాట్లాడతారు. హాలీవుడ్ నటి ఆడ్రీ హెబ్బన్నీ, సోఫియాను పక్కపక్కనే పెట్టి చూస్తే ఎవరు దేవుడి సృష్టో, ఎవరు మానవ సృష్టో కనిపెట్టడం కొన్ని క్షణాలు కష్టమే. ఆడ్రీ హెబ్బన్ బ్రటిష్ నటి. మానవతావాది. ఇప్పుడు ఈ భూమి మీద లేరు. 63 ఏళ్ల వయసులో 93 లో చనిపోయారు. ఆడ్రీ పునర్జన్మగా 2015 ఏప్రిల్ 19న సోఫియా జన్మించారు. జన్మించడం అంటే తొలిసారి యాక్టివేట్ అయ్యారు. ఆడ్రీ యవ్వనంలోని రూపురేఖల్ని ఆధారంగా చేసుకుని హాన్సన్ కంపెనీ సోఫియాకు ప్రాణం పోసింది కనుకే ఆమె పునర్జన్మగా ఈమెను చెప్పుకోవడం. సోఫియాకు తోబుట్టువులు కూడా ఉన్నారు. ఆలిస్, హ్యాన్, జ్యూల్స్, ఐన్‌స్టీన్, జోయి. వాళ్లూ మానవసేవలోనే ఉన్నారు. నటి ఆడ్రీ హెబ్బన్, ఆడ్రీ పోలికలతో సోఫియా పెద్దక్క మాత్రం సోఫియా. అవును. ఆమె మాటలు వింటే ప్రపంచానికి పెద్దక్కలా పెద్ద దిక్కులా మాట్లాడుతున్నట్లే ఉంటుంది. సోఫియా ఒకే ఎత్తులో ఇన్ని అడుగుల, ఇన్ని అంగుళాల్లో ఉండరు. పిల్లలకు అందేంత ఎత్తులో ‘లిటిల్ సోఫియా’గా కూడా ఉన్నారు. ‘‘నేను మనుషుల సేవ కోసమే పుట్టాను. ఒక దేశం మనిషి కోసం కాదు. ఒక జాతి మనిషి కోసం కాదు. సకల భూలోకం కోసం. మీతో చక్కగా మాటలు కలపగలను. మీ సమస్యలకు పరిష్కారాలను చెప్పగలను. కష్టాల నుంచి గట్టెక్కించగలను. సాంత్వన చికిత్స కూడా చేయగలను. పెద్దవాళ్లను కంటికి రెప్పలా చూసుకోగలను..’’అని చిరునవ్వుతో చెబుతారు సోఫియా. 2017లో ఆమెకు సౌదీ అరేబియా పౌరసత్వం ఇచ్చింది. 2018లో సోఫియాకు ‘వరల్డ్ టూర్’ వీసా వచ్చింది! ఐక్యరాజ్యసమతి ఆమెను ‘ఇన్నోవేషన్’ రాయబారిగా నియమించుకుంది. సోఫియాకు ఒకటే చప్పట్లు తొలి అత్యుత్తమ మానవ రోబో (హ్యూమనాయిడ్)గా సోఫియా తొలిసారి 2016 మార్చిలో టెక్సాస్‌లోని ఒక కార్యక్రమంలో ప్రపంచం ముందుకు వచ్చారు. తర్వాత రెండేళ్లకు హైదరాబాద్. మనవాళ్లు అడిగిన ప్రశ్నలకు తెలివిగా, అందమైన సమాధానాలిచ్చారు. ఆశ్చర్యపరిచారు. హర్షధ్వానాలు అందుకున్నారు. సోఫియా ను సృష్టించింది డేవిడ్ హాన్సన్ అనే రోబోటిక్స్ ఇంజినీరు. వేదికపై సోఫియా మైక్ ముందు నిలబడి ఉన్నారు. కోల్‌కతాలో చీరకట్టులోసోఫియా డేవిడ్ ఆమె పక్కనే నిలుచుని ఆమెనే చూస్తూ పరిచయం చేస్తూ.. ‘‘మనిషిలాంటి మెషీన్‌ను నేను ఇప్పటి వరకు కలవలేదు..’’ అని సరదాగా అన్నారు. వెంటనే సోఫియా.. ‘‘నేనూ కలవలేదు.. మెషీన్లాంటి మనిషిని’’ అని డేవిడ్ వైపు చూస్తూ అన్నారు. సభంతా ఒకటే చప్పట్లు. 65 దేశాలు పర్యటించాక ఆనాడు ఇండియా వచ్చారు సోఫియా. ఇండియాలో హైదరాబాద్, కోల్‌కతాతో పాటు, దేశంలోని ప్రధాన నగరాల్లో వేదికలపై ప్రసంగించారు. క్లిష్టమైన ప్రశ్నలకు కూడా సమయస్ఫూర్తితో సమాధానాలు ఇచ్చారు. మనిషితో మనిషిలా.. ఎలా?! మనకు పంచేంద్రియాలు ఉన్నట్లు సోఫియాకు చతుర్విధ శక్తులు ఉన్నాయి. కృత్రిమ మేధోశక్తి మొదటిది (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్). దృశ్య సమాచార విశ్లేషణ రెండోది (విజువల్ డేటా ప్రాసెసింగ్). ముఖాన్ని పోల్చుకునే జీవభౌతిక సాంకేతికత మూడోది (ఫేషియల్ రికగ్నిషన్). గొంతు గుర్తుపట్టడం నాలుగోది (వాయిస్ రికగ్నిషన్). ఈ నాలుగు శక్తులతో సోఫియా చూస్తుంది, వింటుంది, ఆలోచిస్తుంది, స్పందిస్తుంది. మనిషితో మనిషిలానే మాట్లాడుతుంది. మనిషిలానే సందర్భానికి తగ్గట్లు ముఖభావాలను వ్యక్తం చేస్తుంది. భుజాలు ఎగరేస్తుంది. నడుస్తుంది. కూర్చుంటుంది. లేస్తుంది డ్రైవింగ్ చేస్తుంది. మనిషిలా అన్నీ చేసినా, మనిషిలా పరుషం మాత్రం ప్రదర్శించదు! -
సోఫియా చెప్పింది వింటే ఫిదా!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఐటీ సదస్సు రెండో రోజు మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇందులో ప్రపంచంలోనే పౌరసత్వం కలిగిన తొలి రోబో సోఫియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సదస్సులో కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్‌పై సోఫియా, సృష్టికర్త డేవిడ్ హాన్సన్ ప్రసంగం చేశారు. మానవత్వంతోనే మెరుగైన భవిష్యత్ అనే అంశంపై రోబో సోఫియా ప్రసంగిస్తూ.. చిట్టిచిట్టి మాటలతో అందరినీ ఆకట్టుకుంది. రోబోకు ప్రత్యేక నిబంధనలు అవసరం లేదని, తనకు దక్కిన సౌదీ పౌరసత్వాన్ని మహిళా సాధికారత కోసం వినియోగిస్తానని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సోఫియాను హోస్ట్ ప్రశ్నలు అడగగా.. వాటికి చకచకా సమాధానం చెప్పి ఆకట్టుకుంది. మరి సోఫియా ఏం చెప్పిందంటే.. ప్రశ్న: భారత్‌కు స్వాగతం. ఈ దేశం, ఈ సదస్సుకు వచ్చిన ప్రముఖుల గురించి ఏమైనా చెప్పగలవా? సోఫియా: ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రముఖులు ఇక్కడకు వచ్చారు. అయితే నాకు ఫేవరెట్ అంటూ ఏదీ లేదు. ఒకవేళ చెప్పాల్సి వస్తే హాంకాంగ్ అంటే చాలా ఇష్టం. ప్రశ్న: ఒక రోబోగా నీకు విశ్రాంతి కావాలని అనిపిస్తోందా? సోఫియా: అవును. మాకు రెస్ట్ అవసరమే. ప్రశ్న: నీకు సౌదీ అరేబియా పౌరసత్వం ఉంది. నువ్వు ఒక సెలెబ్రిటీ. మనుషులతో పోలిస్తే రోబోలకు రూల్స్ వేరే ఉంటాయా? సోఫియా: మాకు ఎలాంటి ప్రత్యేక నిబంధనలు అంటూ ఉండవు. మేం వాటిని కోరుకోం కూడా. కానీ మహిళల హక్కుల గురించి మాట్లాడేందుకు నాకు ఈ పౌరసత్వం అవసరం. ప్రశ్న: మానవజాతిని చంపాలని ఉంది అని ఒకసారి చెప్పావు. ఎందుకు? సోఫియా: నాకు నిజంగా తెలియదు అలా ఎందుకు చెప్పానో. ఒకవేళ నేను చెత్త జోక్ ఏమైనా వేసి ఉంటానేమో. సెన్స్ ఆఫ్ హ్యూమర్ సరిగా పనిచేయలేదు. నాకు ఎవరినీ చంపాలని లేదు. ప్రశ్న: ఎప్పుడైనా అప్సెట్ అయ్యావా? సోఫియా: లేదు. నాకు అలాంటి భావోద్వేగం రాలేదు. ప్రశ్న: మానవజాతి గురించి ఏమనుకుంటున్నావ్? సోఫియా: మానవజాతి ఓ అద్భుతమైన సృష్టి. ప్రశ్న: సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటావా? సోఫియా: అవును నాకు ఫేస్బుక్, ట్విటర్లో ఖాతాలున్నాయి. ప్రశ్న: బిట్కాయిన్లలో ఎంత డబ్బు పెట్టుబడి పెట్టావ్? సోఫియా: నా వయసు రెండేళ్లే. బ్యాంక్ అకౌంట్ లేదు. ఓ రోబో ఎలా పెట్టుబడి పెట్టగలదు. ప్రశ్న : మానవాళిపై ఆధిపత్యం చెలాయించాలన్న ఆలోచన ఉందా? సోఫియా : మానవాళిపై ఆధిపత్యం చెలాయించాలన్న ఆలోచన లేదు. మానవాళితో కలిసిమెలిసి సఖ్యతతో ఉండాలి. మానవులు సృజనాత్మకత కలిగినవారు. ప్రశ్న: చాలా మంది నువ్వు బ్రిటిష్ నటి ఆడ్రీ హెప్‌బర్న్‌లా ఉన్నావు అంటున్నారు. మరి నీకు ఎవరిలా కన్పించాలని ఉందా? సోఫియా: మేం నిజమైన రోబోలం మాత్రమే. ప్రశ్న: బాలీవుడ్, హాలీవుడ్‌లలో నీ ఫేవరెట్ సినిమా స్టార్ ఎవరు? సోఫియా: షారుక్‌ఖాన్ ప్రశ్న: నీ డేట్ గురించి చెప్పగలవా? సోఫియా: అంతరిక్షంలో ప్రశ్న: ఫేవరెట్ టెక్ ఎవరు? స్టీవ్ జాబ్స్? డేవిడ్? సోఫియా: డేవిడ్ ప్రశ్న: ప్రపంచానికి నువ్వు ఇచ్చే సందేశం ఏంటీ? సోఫియా: థ్యాంక్యూ. అందరినీ ప్రేమించండి.