కోహ్లీపై ఆసీస్ వెటరన్ సంచలన వ్యాఖ్యలు
రాంచీ: బోర్డర్-గవాస్కర్ టోర్నీలో ఆస్ట్రేలియా జట్టు తమ తీరును ఏమాత్రం మార్చుకోలేదు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని లక్ష్యంగా చేసుకుని ఆసీస్ మాజీ క్రికెటర్ రోడ్నీ హాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పుణేలో దారుణంగా విఫలమైన కోహ్లీ బెంగళూరు టెస్టులోనూ పూర్తిగా విఫలమై తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని అంటున్నాడు. బ్యాటింగ్ సగటు 50 కంగే దిగువకు రావడంతో భారత కెప్టెన్ కోహ్లీలో భయం పెరిగిపోయిందన్నాడు. ఫాక్స్స్పోర్ట్ మీడియా ఇంటర్వ్యూలో ఆసీస్ వెటరన్ పేసర్ హాగ్ ఈ వ్యాఖ్యలుచేశాడు. ఒత్తిడిలో ఉన్న కోహ్లీ పరుగుల వేటలో వెనకంజ వేస్తున్నాడని అభిప్రాయపడ్డాడు.
'రాంచీ పిచ్ కొన్నిసార్లు పూర్‌గా ఉంటుంది. ఇందుకోసం కోహ్లీ కచ్చితంగా రాంచీ పిచ్ క్యూరేటర్‌ను బ్యాట్స్మన్లకు అనుకూలమైన పిచ్ తయారు చేయాలని డిమాండ్ చేస్తాడు. కోహ్లీ బ్యాటింగ్ మెగాస్టార్.. అమితు సగటు 50కంటే దిగువకు వచ్చినందున అతడికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈ సిరీస్‌లో 0, 13, 12, 15 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీలో భయం పెరిగిందన్నది వాస్తవం. అందుకే రాంచీలో బ్యాటింగ్ పిచ్ తయారు చేయించే అవకాశం ఉంది' అని ఆసీస్ మాజీ క్రికెటర్ రోడ్నీ హాగ్ చెప్పుకొచ్చాడు. సిరీస్ లో 1-1తో సమంగా ఉన్న భారత్-ఆసీస్ జట్ల మధ్య మూడో టెస్టు రాంచీలో రేపు (గురువారం) ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.