ఉక్రెయిన్ చిన్నారుల కోసం ప్రముఖ టెన్నిస్ స్టార్ భారీ విరాళం
Russia Ukraine War: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో అక్కడి బాధిత చిన్నారుల సహాయార్ధం ప్రముఖ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ భారీ విరాళం ప్రకటించాడు. ఉక్రెయినియన్ చిన్నారుల విద్యా వసతుల కల్పన కోసం ఏకంగా 5 లక్షల స్విస్ డాలర్ల ఆర్ధిక సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. రష్యా భీకర దాడుల కారణంగా ఉక్రెయిన్లోని అతి పురాతన, చారిత్రక భవనాలతో పాటు పాఠశాలలు కూడా పెద్ద సంఖ్యలో ధ్వంసమయ్యాయి.
🕊💙💛 pic.twitter.com/HEwb5NGREu
— Roger Federer (@rogerfederer) March 18, 2022
దీంతో ఉక్రెయిన్లోని చాలా మంది చిన్నారులు చదువుకోవడానికి సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది చిన్నారులు తమ తల్లిదండ్రులతో కలిసి విదేశాలకు తరలి వెళ్లగా, ఇంకా వేల సంఖ్యలో ప్రజలు ఎటూ వెళ్లలేక నిరాశ్రయులై బిక్కుబిక్కుమంటు బ్రతుకీడుస్తున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్లో నెలకొని ఉన్న ఈ భయానక పరిస్థితులను చూసి స్విస్ వెటరన్ టెన్నిస్ స్టార్ చలించిపోయాడు. తనవంతు సాయంగా ఐదు లక్షల స్విస్ డాలర్ల విరాళాన్ని ప్రకటించాడు.
‘ఉక్రెయిన్లో పరిస్థితులకు సంబంధించిన ఫోటోలను చూసి భయాందోళనలకు గురయ్యానని, యుద్ధం కారణంగా ఎంతో మంది అమాయక ప్రజలు సర్వం కోల్పోయారని, ఉక్రెయిన్లో శాంతి కోసం యావత్ మానవ జాతిఏకతాటిపై నిలబడాలని ట్విటర్ వేదికగా భావోద్వేగంతో పిలుపునిచ్చాడు. కాగా, రష్యా భీకర దాడుల కారణంగా ఉక్రెయిన్లో స్కూళ్లన్నీ ధ్వంసం కావడంతో దాదాపు 6 మిలియన్ల మంది చిన్నారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇదిలా ఉంటే, కెరీర్ చరమాంకంలో ఉన్న ఫెదరర్ ఇప్పటివరకు 20 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు సాధించి, స్పెయిన్ బుల్ రఫెల్ నదాల్ (21) తర్వాతి స్థానంలో నిలిచాడు.
చదవండి: దిగ్గజాలు ఒకేచోట కలిసి ఆడితే.. ఆ మజా వేరు