టీడీపీ నేతల వ్యాఖ్యలు అర్థరహితం
శ్రీకాకుళం అర్బన్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌లదే నియంతృత్వ ధోరణి అని, వాళ్లకే మతిస్థిమితం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రొక్కం సూర్యప్రకాశరావు ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, తదితరులు వైఎస్జగన్మోహనరెడ్డిని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని, వాటిని పార్టీ ఖండిస్తోందన్నారు. కోట్లాది రూపాయల అవినీతి సొమ్ముతో ఆకర్ష్ పేరుతో సంతలో పశువులను కొన్నట్టు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ప్రజాస్వామ్యానికి విరుద్దంగా కొనుగోలు చేసి, తమ పార్టీ బలోపేతం అవుతుందని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
నీతిమంతులమంటూ గొప్పలుచెప్పుకునే టీడీపీ నాయకులు ఇటీవల కేంద్రమంత్రి సుజనాచౌదరికి చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్‌లో జరిగిన కుంభకోణంపై మాట్లాడరెందుకని ప్రశ్నించారు. మారిషస్ కమర్షియల్ బ్యాంకు నుంచి రూ.100 కోట్లకు పైగా రుణం తీసుకొని ఎగవేసిన కేసులో 5 సెక్షన్ల మీద కేసు పెట్టాలని కోర్టు మొట్టికాయలు పెట్టి సుజనాచౌదరికి క్రిమినల్ కోర్టు సమన్లు జారీ చేసిందని గుర్తు చేశారు.
నీచరాజకీయాలతో ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతూ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా పాలన సాగుతోందని విమర్శించారు. ఎవరైనా ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి చేరేముందు వారితో రాజీనామాలు చేయించిన తర్వాతనే చేర్చుకోవాలి తప్ప బాబులా దొడ్డిదారిన ఆహ్వానించేలా ఉండడం సరికాదన్నారు. బాబుకు ధైర్యం ఉంటే టీడీపీలో చేరిన వారితో రాజీనామా చేయించి ప్రజలముందుకు వస్తే వారు ఏవిధంగా తీర్పు ఇస్తారో తెలుస్తుందన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు కోరాడ రమేష్, గుడ్ల దామోదరరావు తదితరులు పాల్గొన్నారు.