ఓరుగల్లులో విరసం రాష్ర్ట మహాసభలు
గొంతెత్తిన కవులు, రచయితలు
ఆకట్టుకున్న కాగడాల ప్రదర్శన
గ్రీన్‌హంట్ పేరుతో సాగుతున్న దురాగతాన్ని కళ్లకు కట్టించిన ‘బాసగూడ’
వరంగల్ డిక్లరేషనే ఉద్యమానికి పునాది అని ప్రకటించిన వక్తలు
విప్లవ రచయితల సంఘం (విరసం) 24వ రాష్ర్ట మహాసభలు ఓరుగల్లులో శనివారం ప్రారంభమయ్యాయి. హన్మకొండ అంబేద్కర్ భవన్లో మొదటి రోజు జరిగిన సభ ‘కాళోజీ’ ధిక్కార స్వరాన్ని వినిపించింది. ఆంక్షలు లేని తెలంగాణ రాష్ట్రాన్నే విరసం కోరుకుంటోందని గొంతెత్తింది. విరసం లేకుండా తెలంగాణ ఉద్యమం లేదని.. వరంగల్ డిక్లరేషన్‌తోనే తెలంగాణ పోరు ప్రారంభమైందని గుర్తు చేసింది. మానసికంగా ప్రజలను విడదీసి ఉమ్మడిగా దోచుకునే ప్రయత్నాలను అడ్డుకుంటామని ప్రతినబూనింది. భౌగోళికంగా విడిపోయిన ప్రజలను మానసికంగా ఏకం చేసి సామ్రాజ్యవాద, హిందూత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తామని విప్లవ శంఖం పూరించింది.
సుబేదారి, న్యూస్‌లైన్ : ఈ దేశంలో ఖాళీ చేతులను, ఖాళీ డొక్కలను కలిగి ఉన్న పేదలకు ప్రత్యామ్నాయం మార్క్సిస్ట్ రాజకీయాలేనని, జనతన సర్కార్‌తోనే ప్రజారాజ్యం సాధ్యమవుతుం దని విప్లవ రచయితల సంఘం రాష్ట్ర కార్యవర్గసభ్యుడు జి.కల్యాణ్‌రావు అన్నారు. శనివారం రాత్రి హన్మకొండ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియం ప్రాంగణంలో(ఆకుల భూమయ్య వేదిక) జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ఇస్తే మావోయిస్టులు పెరుగుతారని అన్నారని, ఇలా తెలంగాణతో పాటు మరిన్ని రాష్ట్రాలు రాయలసీమ, కోస్తాంధ్ర ఇవ్వాలని, అప్పుడు కొత్త రాష్ట్రాలతో మావోయిస్టుల సంఖ్య పెరిగితే ప్రజలకు రక్షణ పెరుగుతుందని అన్నారు.
ఈ దేశంలో రెండే రెండు రాజకీయాలు ఉన్నాయని, ఒకటి కాంగ్రెస్ పార్టీ అలయెన్స్‌తో నడిచే రాజకీయాలు, మరొకటి ఎన్డీఏ అలయెన్స్‌తో నడిచే బీజేపీ రా జకీయాలని అన్నారు. అవినీతికి వ్యతిరేక నినాదంతో ముందుకువచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ.. అవినీతిలో మునిగిన కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఈ శతాబ్దంలో పెద్దజోక్ అని అన్నారు. కాంగ్రెస్ రాహుల్‌గాంధీని, బీజేపీ మోడీని, మీడియా, కార్పొరేట్ సంస్థలేమో ఆమ్ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రివాల్‌ను ప్రధాన మంత్రి అభ్యర్థులుగా ప్రచారం చేస్తున్నాయన్నారు.
ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కొన్ని రాష్ట్రాల్లోనే ఉన్నాయని, మావోయిస్టు పార్టీ మాత్రం 17 రాష్ట్రాల్లో తన ఉనికిని కలిగి ఉందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్పూర్తితో కోస్తాంధ్రలో సముద్రపు ఒడ్డున ఉన్న పాలకూరపాడ్లో తుపాకీ గలాట ఉద్యమం జరిగిందన్నారు. తెలంగాణ ప్రాంతం ఇప్పటికీ ప్రపంచానికి సందేశం ఇస్తున్న ప్రాంతమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రజారాజ్యం ఏర్పడుతుందా అని ఆయన ప్రశ్నించారు.
ఉద్యమం ఆగిపోలేదు : వరవరరావు
వరంగల్‌లో బీజప్రాయంగా ప్రారంభమైన ప్రజా ఉద్యమం ఆ గిపోలేదని, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పాకుతూ మరింతగా విస్తరించిందని విరసం సభ్యుడు వరవరరావు అన్నారు. ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డిని చూస్తే ఒక లెనిన్‌ను చూసినట్లు అనిపించేదని, ఆయన వేసిన ప్రణాళిక ఫలించి ఇవాళ జనతన సర్కార్ ఏర్పడిందన్నారు. తెలంగాణలో వెయ్యి సంవత్సరాల క్రితమే ప్రత్యామ్నాయాలు కనిపిస్తాయని, కాకతీయులను ఎదురించి సమ్మక్క, సారలమ్మలు ధిక్కార ప్రత్యామ్నాయాన్ని చూపించారని, అదే విధంగా పాలకుర్తి సోమనాథుడు చాపపుట్టి భోజనాలు ప్రారంభించాడని, కుల రహిత సమాజాన్ని చూపించాడని, కాళోజీ కూడా అదేవిధంగా జీవితమంతా ప్రజాస్వామిక విలువలకు ఒక ప్రత్యామ్నాయంగా నిలిచాడని వరవరరావు అన్నారు.
మావోయిస్టులు ప్రజలతో మమేకమై జనతన సర్కారును స్థాపించి ఒక ప్రజా ప్రభుత్వ ప్రత్యామ్నాయాన్ని చూపించారని, చంద్రబాబు వంటి సామ్రాజ్యవాద తొత్తు ప్రపంచ బ్యాంకు నమూనా ప్రత్యామ్నాయాన్ని చూపెట్టారని అన్నారు. దండకారణ్యంలో జనతన సర్కారు ఆధ్వర్యంలో అక్కడ భూమి లేని పేదలు లేరని, అందరికీ భూమి ఉందని, లైంగిక దాడులు లేవని, దోపిడీ లేదని, ఉత్పత్తి రెండున్నర రెట్లు పెరిగిందని చెప్పారు.
పోరాడేవారు లొంగిపోరని, ఉసెండి లొంగిపోవడం అనేది జరగలేదని, ప్రసాద్ మాత్రమే లొంగిపోయాడని, ఉసెండి ఎప్పుడు కూడా పోరాట నమునాగా నిలుస్తాడని ఆయన అన్నారు. కొమురం భీం విగ్రహాలను స్థాపించడం కంటే కొమురంభీం ఆశయాలైన జల్ జంగల్ జమీన్ మనదేనన్న నినాదాన్ని స్వీకరించడమే సరైందన్నారు. వరంగల్‌లో మళ్లీ పాతరోజులు గుర్తుకొస్తున్నాయని, ఒక్కొక్కరు ఉద్యమంలో ఎదిగిన తీరు తెలిపారు. గంగారామ్, ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డి, శ్యాం తదితర అమరవీరులను గుర్తుకుచేసుకున్నారు. తెలంగాణలో ఎందరో తల్లులు కడుపుకోతకు గురయ్యారని అన్నారు.
అనంతరం విరసం రాష్ట్ర కార్యదర్శి పి.వరలక్ష్మి మాట్లాడుతూ షరతులు లేని తెలంగాణ ప్రకటించాలని, గ్రీన్‌హంట్ ఆపరేషన్‌ను నిలిపివేయాలని, ఆకుల భూమయ్య మరణంపై హైకోర్టు సిట్టింగ్‌జడ్జితో విచారణ జరిపించాలని, హిందూ పాసిజానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని, తిరుపతిలో ఇస్లామిక్ పాఠశాల నిర్మాణాన్ని హిందూ శక్తులు అడ్డుకోవద్దని , నల్లగొండలో క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని ఎత్తివేయాలని విరసం సమావేశంలో తీర్మానించినట్లు చెప్పారు. విరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎన్.రుక్మిణి మాట్లాడుతూ తాను గుంటూరు జిల్లాకు చెందినప్పటికీ తెలంగాణ ఉద్యమాన్ని బలపరుస్తున్నానని చెప్పారు. ఈ బహిరంగ సభకు కాళోజీ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు వీఆర్ విద్యార్థి అధ్యక్షత వహించారు.
ఉద్యమం ఆగిపోలేదు..
వరంగల్‌లో బీజప్రాయంగా ప్రారంభమైన ప్రజా ఉద్యమం ఆగిపోలేదు. కాకతీయులను ఎదిరించిన సమ్మక్క, సారలమ్మ, కుల రహిత సమాజం చూపించిన పాలకుర్తి సోమనాథుడు, తన జీవితమంతా ప్రజాస్వామిక విలువలకు కాళోజీ దిక్సూచిగా నిలిచి ప్రత్యామ్నాయం చూపించారు. మావోయిస్టులు ప్రజలతో మమేకమై జనతన సర్కారును స్థాపించి ప్రజా ప్రభుత్వ ప్రత్యామ్నాయం చూపించారు.
- వరవరరావు
సందేశం ఇస్తున్న ‘తెలంగాణ’
తెలంగాణ ఇస్తే మావోయిస్టులు పెరుగుతారని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అంటున్నాడు. కొత్తగా ఏర్పడే రాష్ట్రాల్లో మావోయిస్టుల సంఖ్య పెరిగితే ప్రజలకే రక్షణ ఉంటుంది. జనతన సర్కార్‌తోనే ప్రజారాజ్యం సాధ్యం. తెలంగాణ ఇప్పటికీ ప్రపంచానికి సందేశం ఇస్తున్న ప్రాంతం. నూతన ప్రాపంచిక దృక్పథాన్ని అందించిన నేల.
- కల్యాణ్‌రావు