మేడం..
సమస్యలు పరిష్కరిస్తారని కోటి ఆశలతో మీ ప్రజలు...
నేడు నూతన కలెక్టర్ బాధ్యతల స్వీకరణ
యోగితా రాణాకు సమస్యల స్వాగతం
నిషేధిత మత్తు పదార్థాలతో కల్తీ కల్లు విక్రయాలు
‘ఇసుక మాఫియా’కు టీఎస్ఎండీసీ ముసుగు
నిజామాబాద్, ఆర్మూరులో అక్రమ నిర్మాణాలు
మైనార్టీ నేత నేతృత్వంలో గుట్కా వ్యాపారం
కరువు ఛాయలు.. దయనీయ స్థితిలో రైతన్నలు
విజృంభిస్తున్న డెంగీ మహమ్మారి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా కలెక్టర్‌గా డాక్టర్ యోగితా రాణా శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏడాది పాటు జిల్లాలో పనిచేసిన రోనాల్డ్‌రోస్ డైనమిక్ కలెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆయన మెదక్ జిల్లా కలెక్టర్‌గా ఈ నెల 6న బదిలీ అయ్యా రు. ఆయన స్థానంలోఐఏఎస్ అధికారిణి యోగితా రాణాను ప్రభుత్వం అదే రోజున నియమించింది. జమ్ముకాశ్మీరుకు చెందిన ఆమె 2003లో ఐఏఎస్‌కు ఎంపికైంది. ఖమ్మం జిల్లా భద్రాచలం సబ్‌కలెక్టర్‌గా మొదటి పోస్టింగ్ కాగా, 2008లో రంపచోడవరం ఐటీడీఏ పీఓగా నియమితులయ్యారు.
ఆ తర్వాత హైదరాబాద్ కలెక్టర్‌గా ఉన్న సమయంలో జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. ముక్కుసూటిగా వ్యవహరించే అధికారిగా పేరున్న డాక్టర్ యోగిత రాణా శుక్రవారం జిల్లా కలెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. కలెక్టర్ రోనాల్డ్‌రోస్ అభివృద్ది, సంక్షేమ పథకాలు అమలుతో పాటు అక్రమ నిర్మాణాలు, ఇసుక మాఫియా, కల్తీకల్లు నియంత్రణలపై దృష్టిసారించారు. ఇదే క్రమంలో ఆయన ఏడాది బదిలీ కాగా... కొత్తగా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్న యోగితారాణా సంక్షేమ పథకాల అమలుతో పాటు అక్రమదందాలపై కొరడాఝుళిపిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు.
సమస్యలు ఇవే...ఇసుక మాఫియా..కొత్తగా టీఎస్ఎండీసీ ముసుగు
జిల్లాలో ఇసుక అక్రమ దందా యధేచ్చగా కొనసాగుతోంది. నదులు, వాటి పరివాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలను నిలిపివేయాలన్న హైకోర్టు ఉత్తర్వులకు ఇసుక ‘మాఫియా’ మంగళం పాడేసింది. మూడు నెలల పాటు పట్టాభూముల్లో ఇసుక మేటల తొలగింపు పేరిట అనుమతి పొంది ఏకంగా మంజీర నుంచి వందలాది లారీల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తూ రూ. కోట్లు గడించింది. ఈ అక్రమదందా వెనుక అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు ఉండగా.. వివాదాల నేపథ్యంలో గత కలెక్టర్ రోనాల్డ్‌రోస్ పట్టాభూముల్లో ఇసుక తవ్వకాలను నిలిపివేశారు.
కొత్తగా కొందరు అధికార పార్టీ నేతలు, ఇసుక మాఫియా కలిసి ఇసుకదందాకు రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ (టీఎస్ఎండీసీ) ముసుగేసుకున్నారు. బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో టీఎస్ఎండీసీ ద్వారా ఇసుక తీసేందుకు 10 క్వారీలను (పట్టాభూములు)ను రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఇందులో ఐదు క్వారీలను పట్టాభూముల ఆధారంగా అనుమతించినా.. మంజీర నుంచే ఇసుక తీస్తున్నారు. టీఎస్ఎండీసీ అధికారులు సాక్షిగా కోటగిరి మండలం కారేగావ్, పోతంగల్, భిచ్కుంధ మండలం పుల్కల్లతో పాటు మరో రెండు చోట్ల ఏకంగా మంజీర నది నుంచే యంత్రాల ద్వారా ఇసుకను తోడేస్తున్నారు.
ఈ తతంగం వెనుక కూడా అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత హస్తం ఉందన్న ప్రచారం ఉంది. కారేగావ్లోనైతే రెండు మండలాలు, 43 గ్రామాలకు నీటిసరఫరా చేసే పథకం వద్దే ఈ తవ్వకాలు జరుపుతున్నారు. ఇక్కడ ఒక్క ఫీటు వరకు మాత్రమే తవ్వకాలు చేయాలని నీటిపారుదలశాఖ నిర్ణయించగా... కలెక్టర్ 2.1 ఫీట్లకు అనుమతించారు. అయితే టీఎస్ఎండీసీ మాత్రం యంత్రాల ద్వారా 20 ఫీట్లు తోడేసింది. టీఎస్ఎండీసీ ముసుగులో సాగుతున్న ఇసుక మాఫియాపై గురి పెట్టాల్సిన అవసరం ఉంది.
ప్రాణాంతకంగా కల్తీకల్లు విక్రయాలు...
‘ధనదాహం ఒళ్లు విరిచి అక్రమ వ్యాపారం ‘కట్ట’లు తెంచుకుంటుంది’ అన్నట్లుగా జిల్లాలో కల్తీకల్లు సామాన్యుల పాలిట శాపంగా మారింది. కొందరు ఎక్సైజ్ అధికారుల అండదండలతో కల్తీ కల్లు వ్యాపారం ‘మూడు పువ్వులు ఆరుకాయలు’గా సాగుతోంది. జిల్లాలోని నిజామాబాద్, కామారెడ్డి యూనిట్ల పరిధిలో 283 కల్లు గీత సహకార సంఘాలు, 602 మంది గీతా కార్మికులకు లెసైన్సులు ఉన్నాయి. డైజోఫాం, క్లోరల్ హైడ్రేడ్, క్లోరోఫాంలు (మత్తుకోసం), శక్రీన్ (రుచి కోసం), తెల్లపౌడర్ (చిక్కదనం కోసం), కుంకుడు కాయల రసం (నురుగు కోసం)లతో కల్తీ కల్లు తయారీ, విక్రయాలు యధేచ్చగా సాగుతున్నాయి.
కల్తీకల్లు తాగినవారు మరణించినా, అస్వస్థతకు గురైనా నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపించి చేతులు దులుపుకోవడం ‘ఎక్సైజ్’కు పరిపాటిగా మారింది. నిజామాబాద్ నగరంలో రెండు డిపోలు ఉండగా... బోర్గాం సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా మూడో డిపో కొనసాగుతున్నా అబ్కారిశాఖకు పట్టడం లేదు. గీత వృత్తితో సంబంధం లేని కొందరు నేతలు పార్టీలకతీతంగా ఏకమై ఈ డిపోలను నడుపుతూ రూ.కోట్లు గడిస్తున్నారు. ఈ కల్లు తాగిన వారు ఎముకల గూడులా తయారవుతున్నా.. నిరుపేద కుటుంబాల్లో మృత్యుఘంటికలు మోగుతున్నా ఎవరికీ పట్టడం లేదు.
రెండు కీలక పదవుల్లో కొనసాగుతున్న జిల్లాస్థాయి అధికారి వారంలో మూడు, నాలు రోజులు మాత్రమే జిల్లా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. మంత్రులు, జిల్లా కలెక్టర్లు నిర్వహించే ఉన్నతస్థాయి సమావేశాలకు సైతం గైర్హాజర్ అవుతున్నారు. హరితహారంపై సమీక్ష జరిపిన మంత్రి జోగు రామన్న సదరు అధికారి గైర్హాజర్‌పై ఆరా తీసి ఆగ్రహం వ్యక్తం చేసినా మార్పులేదు. కల్తీకల్లును పూర్తిగా నియంత్రించిన అప్పటి కలెక్టర్ క్రిస్టియానాను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు.
అక్రమ నిర్మాణాలు..
నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు ఆర్మూరు, బోధన్ మునిసిపాలిటీల్లో అక్రమ కట్టడాలు పెరిగిపోయాయి. రెండు నెలల క్రితం ఒక్క నిజామాబాద్ డీఎల్పీవో పరిధిలోని గంగాస్థాన్ పేజ్-2, గూపన్పల్లి, మానిఖ్బండార్ పరిధిలో 12 అపార్టుమెంట్లు అక్రమంగా నిర్మించినట్లు తేల్చిన అధికారులు ఏడింటిలో ఇప్పటికే నివాసం ఉంటున్న 313 మందికి నోటీసులు జారీ చేశారు. నిజామాబాద్ నగరంలో నిబంధనలను విస్మరించి అపార్టుమెంట్లు, భవనాలు నిర్మించిన పలువురికి నోటీసులు ఇచ్చారు. మూడు నెలల క్రితం భవన నిర్మాణాల్లో నిబంధనల ఉల్లంఘన పేరిట 105 మందికి నోటీసులు ఇచ్చారు.
ఆర్మూరు పట్టణంలో యధేచ్చగా సాగుతున్న అక్రమ నిర్మాణాలపై అక్కడి అధికారులు నిమ్మకున్నారు. భవనాలు నిర్మాణమై గృహ ప్రవేశాలైన 19ని గుర్తించారు. ఆ అక్రమ నిర్మాణాలను ఆర్మూరు మున్సిపల్ అధికారులు తొలగించే అవకాశం ఉన్నా... వారికి సహకరించే ధోరణితోఅధికారులే కోర్టుకు వెళ్లమంటూ సలహా ఇచ్చారు. దీంతో అక్రమ నిర్మాణాలు ఇంకా పెరుగుతున్నాయి. ఆర్మూరులోనే బక్రాన్ బీడీ ఫ్యాక్టరీ యజమానులు బ్యాంకులో తనఖా పెట్టిన స్థలాన్ని పదేళ్ల క్రితం బహిరంగ వేలంలో సిండికేట్‌గా మారిన కొందరు ఆ భూమిని దక్కించుకున్నారు.
ఆ తర్వాత టౌన్ ప్లానింగ్ లేవుట్ నిబంధనలకు విరుద్దంగా చిన్న చిన్న రోడ్లతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్లాన్ వేసి పేపర్‌పైనే అమ్మకాలు చేశారు. అనుమతులు లేకుండా మొత్తం 306 షాపుల నిర్మాణానికి శ్రీకారం చుట్టినా మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదు. ఓ మాజీ కౌన్సిలర్ కీలకంగా నడిచిన ఈ భాగోతం పత్రికలకెక్కడంతో నిర్మాణం ఆగిపోయింది. అయితే మళ్లీ నిర్మాణ పనులు కొనసాగించేందుకు మునిసిపల్ అధికారులు, పాలకవర్గంతో చర్చిస్తున్నట్లు సమాచారం.
గుట్టుగా గుట్కా వ్యాపారం..
గుట్టుగా గుట్కా దందా ప్రజలను పీల్చి పిప్పి చేస్తోంది. ప్రధానంగా యువతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బోధన్, జుక్కల్, మ ద్నూరు, బిచ్కుంద ప్రాంతాల్లో ఈ వ్యాపారం జోరుగా కొనసాగుతుంది. జిల్లా కేంద్రం నుండే అక్కడికి సరఫరా చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో కూడా ఈ విక్రయాలు ఎక్కువగా ఉండడంతో ప్రధానంగా రోజుకు లక్షలాది రూపాయల విక్రయాలు జరుగుతుంటాయి. జిల్లాలోని బడా వ్యాపారులు కర్ణాటకలోని బీదర్ నుండి గుట్కాను జిల్లాకు తీసుకువస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ బడా నేత సైతం గుట్కాను బీదర్ నుంచి తెప్పించుకుంటున్నారు. వారంలో నాలుగుసార్లు రూ.20 లక్షల చొప్పున సరుకును తెప్పించుకుంటున్నారు.
ఈ సరుకును నిజామాబాద్, ఆర్మూర్, బాల్కొండ , కామారెడ్డి , బోధన్ ప్రాంతాల్లోని వివిధ మండలాలకు సరఫరా చేస్తున్నారు. బిచ్కుంద మండల కేంద్రంలో రహస్య గోదాంను ఏర్పాటు చేసి గుట్కాను అక్రమ విక్రయాలు చేపడుతున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ మైనార్టీ నేత, ఆయన సోదరుడు ఈ దందా వెనుక ఉండటం వల్లే జిల్లాలో గుట్కా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
రెండు రోజులకు ఒక్కసారి రూ. 8 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను బీదర్ నుండి తీసుకవస్తున్నారు. వర్ని, బాన్సువాడ, నారాయణఖేడ్, జోగిపేట ప్రాంతాలకు తరలిస్తున్నారు. మద్నూరు కేంద్రంగా కూడా గుట్కా అక్రమ రవాణా జోరుగా కొనసాగుతుంది. నాందేడ్ నుండి దెగ్లూర్ మీదుగా ఈ రవాణా కొనసాగుతుంది. రోజుకు రూ.10 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు డీసీఎం వ్యాన్ ద్వారా దెగ్లూర్ మీదుగా జిల్లాకు తీసుకవస్తున్నారు.
కరువు ఛాయలు..
ఖరీఫ్ కలిసి రాక రైతులు దయనీయ స్థితిలో ఉన్నారు. రెండు రోజులుగా వర్షాలు పడుతున్నా.. పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుంచి నీరు రావడం లేదు. గత రెండేళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది ఇన్‌ప్లో తగ్గింది. దీంతో గతేడాది ఇదే సమయానికి 20.79 టీఎంసీల నీరుంటే ప్రస్తుతం 6 టీఎంసీలు మాత్రమే ఉంది. నిజాంసాగర్ పరిస్థితి దారుణంగా మారింది. గతేడాది 3.80 టీఎంసీలే ఉంటే ప్రస్తుతం అది 0.4 టీఎంసీలకు పడిపోయింది.
పోచారం ప్రాజెక్టులో ప్రస్తుతం 120 ఎమ్‌సీఎఫ్‌టీల (నాలుగు ఫీట్లు) మాత్రమే నీళ్లు ఉన్నాయి. రామడుగు ప్రాజెక్టులో నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరింది. సింగూరులో సైతం నీటిమట్టం తగ్గిపోయి ప్రస్తుతం 3.90 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇదే విధంగా ఈ పాటికి జిల్లాలో నిండుగా కళకళ్లాడాల్సిన జలశాయాలు డెడ్ స్టోరేజికి చేరుకున్నాయి. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో భూగర్భ జలాలు 15.58 మీటర్లు పడిపోయి ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదిలా వుండగా వర్షాభావ పరిస్థితులు నేపథ్యంలో ఖరీఫ్ సాగు సైతం బాగా తగ్గింది. ఈ ఖరీఫ్‌లో 4,18,100 హెక్టార్ల వివిధ పంటలు సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు.
అత్యధికంగా 1.50 లక్షల హెక్టార్లలో వరి, 1.50 లక్షల హెక్టార్లలో సోయా సాగు చేస్తారని పేర్కొన్నారు. మిగత విస్తీర్ణంలో మొక్కజొన్న, జోన్న, వేరుశనగ, పసుపు, చెరకు తదితర పంటలు వేస్తారని అంచనా. అయితే 1.50లక్షల హెక్టార్లలో వరి సాగు చేయాల్సి ఉండగా నేటి వరకు కేవలం 28వేల హెక్టార్టలో మాత్రమే సాగు చేశారు. ఇప్పటి వరకు 10వేల హెక్టార్లలో వేసిన వరి వర్షాబావ పరిస్థితుల వల్ల దెబ్బతినే పరిస్థితిలో ఉంది.1.50 లక్షల హెక్టార్లలో సోయా సాగుకు గాను 1లక్షా 27వేల హెక్టార్లలో సాగు చేశారు. అయితే వర్షాభావ పరిస్థితుల వల్ల ఇప్పటికే 70వేల హెక్టార్లలో సోయా పంట ఎండిపోయింది. మిగతా పంటల విస్తీరణం కూడ పడిపోయింది. రుణమాఫీ, ఖరీఫ్ రుణాల్లో పురోగతి లేదు.
విజృంభిస్తున్న డెంగీ....
గతేడాది బోధన్‌లో గీత(40), బీర్కూరు మండలం అన్నారం గ్రామానికి చెందిన శ్రీజ(4), మాచారెడ్డి మండలం లచ్చపేటలో శీరీష (6)లను డెంగీ వ్యాధి కాటేసింది. ఈసారి ఇదే సీజన్లో జడలు విప్పిన డెంగీ ఇందూరు ప్రజలను అతలాకుతలం చేస్తోంది. ఈ వ్యాధి ఇప్పుడు జిల్లా అంతటా వ్యాపిం చింది. 25 రోజుల వ్యవధిలోనే జిల్లాలో డెంగీ ప్రభావం తీవ్రరూపం దాల్చింది. జిల్లాలో ఈ ఏడాది ఆగస్టు నుంచి ఈ నెల 6 వరకు 65 కేసులు అధికారికంగా నమోదయ్యాయి.
ప్రైవేట్ ఆస్పత్రులు, ఇతర చోట్లలో బాధితులను తీసుకుంటే 200కు పైగా కేసులు ఉన్నట్లు చెబుతున్నారు. వైద్య సదుపాయాలకు దూరం గా ఉన్న పల్లెలు, తండాలలో సైతం కేసులు నమోదవుతున్నాయని వైద్యశాఖే చెబుతోంది. గత ఏడాది జనవరి నుండి డిసెంబర్ వరకు కేవలం 51 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ వ్యాధి ప్రభావం ఎక్కువైంది. రోజురోజుకూ విస్తరిస్తున్న డెంగీపై అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.