రోను పోయి.. రోహిణి వచ్చింది..
మళ్లీ మండిపోతున్న సూర్యుడు
కొత్తగూడెంలో 51.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు
మరో మూడు రోజులు వడగాడ్పులు..
హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి
కొత్తగూడెం: నిన్న మొన్నటి వరకు వణికించిన ‘రోను’ తుఫాన్ పోయి.. మండే ఎండలతో ‘రోహిణి’ కార్తె వచ్చింది. ఈ మార్పుతో రాష్ట్రంలో సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఆదివారం అత్యధికంగా 52 డిగ్రీలు నమోదు కాగా, సోమవారం 51.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు ప్రతాపం చూపిస్తుండటంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. చిన్నచిన్న వ్యాపారస్తులు షాపులను మూసివేసి ఇళ్లలోనే ఉండిపోవాల్సి వస్తోంది. మధ్యాహ్నం 51.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో పట్టణం మొత్తం వెలవెలబోయింది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోగా, షాపులన్నీ మూతపడ్డాయి. పట్టణంలో రెండు రోజులుగా అనధికారిక కర్ఫ్యూ కొనసాగుతోంది. రోడ్ల వెంట వ్యాపారాలు చేసుకునేవారు ఎండదెబ్బకు కుదేలవుతున్నారు.
చలి వేంద్రాలు అంతంత మాత్రమే సేవలందిస్తుండటంతో దాహార్తి తీర్చుకునేందుకు పాదచారులు, ప్రయాణికులు లీటరు నీటిని రూ.8 వరకు కొనుగోలు చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారు గొడుగులు, ముఖానికి రుమాళ్లు, టోపీలు ధరించి వస్తున్నారు. సింగరేణి ఓపెన్‌కాస్టు గనుల వద్ద మరో రెండు డిగ్రీల అధిక ఉష్ణోగ్రత ఉండటంతో కార్మికులు విధులు నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు మరో మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం రామగుండంలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, భద్రాచలం, ఖమ్మం, హన్మకొండల్లో 44 డిగ్రీల చొప్పున రికార్డయ్యాయి. ఇక రాజధాని హైదరాబాద్‌లో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
నమోదైన ఉష్ణోగ్రతలు
ప్రాంతం ఉష్ణోగ్రత
కొత్తగూడెం 51.5
రామగుండం 45.0
భద్రాచలం 44.4
ఖమ్మం 44.2
హన్మకొండ 44.1
ఆదిలాబాద్ 43.3
నల్లగొండ 42.8
నిజామాబాద్ 42.1
మెదక్ 41.4
హైదరాబాద్ 40.5
మహబూబ్‌నగర్ 38.6