మేలు చేసిన ‘రోను’
తగ్గిన వేసవి తాపం
ఖరీఫ్‌కు చిగురిస్తున్న ఆశలు
నదుల్లో చేరిన వర్షపునీరు
భూగర్భ జలాల పెరుగుదలకు దోహదం
విశాఖపట్నం: రోను తుఫాన్ విశాఖకు మేలు చేసింది. రెండు నెలలుగా నిప్పుల సెగలతో, చుక్క నీటి కోసం అల్లాడిపోతున్న జనానికి ఊరటనిచ్చింది. వేసవి తాపాన్ని ఒక్కసారిగా తగ్గించింది. వాతావరణాన్ని అనూహ్యంగా చల్లబరిచింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా బలపడినప్పట్నుంచి పరిస్థితిలో మార్పు వచ్చింది. వాయుగుండం బలపడ్డాక బుధ, గురువారాల్లో విశాఖలోను, జిల్లాలోను కుంభవృష్టి కురిసింది. ఏజెన్సీ లోనూ చెప్పుకోదగిన స్థాయిలో వర్షం పడింది. అనూహ్యంగా ఏర్పడిన తుఫాన్‌తో కురిసిన వానలకు రైతన్నల మోముల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. నిన్నటిదాకా బీళ్లు వారిన భూముల్లో ఇప్పుడు నీళ్లు చేరడంతో సంబరపడుతున్నారు. ఇన్నాళ్లూ పాతాళంలోకి పోయిన భూగర్భ జలాలు ఈ వానలకు ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాయి. దీంతో చెరువులు, బోర్లు, బావుల్లోనూ జలాలు ఊరుతున్నాయి. ఫలితంగా ఒకింత మంచినీటి ఎద్దడి తీరనుంది. జలాశయాల్లో నీటి నిల్వలు నిలదొక్కుకుంటున్నాయి. చావుబతుకుల్లో ఉన్న చెరకు, కూరగాయలతో పాటు ఇతర మెట్టుపంటలకు వర్షాలు ప్రాణం పోశాయి. మరోవైపు అన్నదాతలు వేసవి దుక్కులతో ఖరీఫ్‌కు సన్నద్ధమవుతున్నారు.
ఆ తర్వాత మొక్కజొన్న, వేరుశనగ, సజ్జలు (గంటెలు) చోళ్లు (రాగులు), సామలు వంటి పంటలకు, కొన్నిచోట్ల కందులు, మినుములు, పెసలు వంటి అపరాల సాగుకు సన్నాహాలు చేస్తున్నారు. అన్నిటి కీ మించి రోనో తుఫాన్ పెనుగాలులు, ఈదురుగాలులకు ఆస్కారం లేకుండా భారీ వర్షానికే పరిమితమవడం అన్ని వర్గాల వారికి ఊరటనిచ్చింది. గతంలో వాయుగుండం ఏర్పడగానే వాటికంటే ముందే పెనుగాలులు హోరెత్తేవి. ఈసారి మాత్రం తుఫాన్‌గా మారినా గాలుల్లేకుండానే వర్షం కురిపించి ఒడిశా వైపు వెళ్లిపోయింది. దీంతో ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా అన్ని వర్గాలకూ ఊరటనిచ్చింది. అంతేకాదు.. తీవ్ర ఎండలు రెండు నెలల పాటు కొనసాగాయి. ఎండల ధాటికి భూమి బాగా ఆరిపోయి ఉంది. ఈ నేపథ్యంలో రోను తుఫాన్ వర్షానికి కురిసిన భారీ వర్షం ఎక్కడికక్కడే ఇంకిపోయింది. ఇదే వర్షం వానాకాలంలో కురిసినట్టయితే లోతట్టు ప్రాంతాలు మునిగిపోయేవి. ఇలా అన్ని విధాలా రోను తుఫాన్ విశాఖకు మేలు చేసింది.