రేకుల పైకప్పు గదిలో... నిద్రించిన ప్రధాని మోదీ
డెహ్రాడూన్: సముద్ర మట్టానికి 11,300 అడుగుల ఎత్తున రేకుల పైకప్పుతో నిర్మించిన తాత్కాలిక గదిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాత్రి పూట నిద్రించారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) కార్మికుల కోసం వండిన కిచిడీని ఆరగించారు. శనివారం ఉత్తరాఖండ్ పర్యటనలో ఈ విశేషాలు చోటుచేసుకున్నాయి. మనా పట్టణ సమీపంలో బీఆర్ఓ డిటాచ్మెంట్ సెంటర్‌ను మోదీ సందర్శించిన సంగతి తెలిసిందే.
ఓ కార్మికుడు సిద్ధం చేసిన కిచిడీ, మాండ్వీ కీ రోటీ, స్థానిక పచ్చడి, జాగోర్ కీ ఖీర్‌ను ఆహారంగా తీసుకున్నారని అధికారులు చెప్పారు. అంతేకాకుండా రేకుల పైకప్పుతో అప్పటికప్పుడు నిర్మించిన తాత్కాలిక నిర్మాణంలో సేదతీరారని వెల్లడించారు. ఈ గదిలో చిన్నపాటి ఎలక్ట్రిక్ హీటర్ మాత్రం ఉంది. రోడ్ల నిర్మాణంలో పాలుపంచుకుంటున్న కూలీలతో మోదీ సంభాషించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ బీఆర్ఓ సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారని ప్రశంసించారు. శ్రమయేవ సర్వం సాధ్యం (శ్రమతో ఏదైనా సాధ్యమే) అని విజిటర్స్ బుక్‌లో రాశారు.