roommates
-
రూమ్మేటే దొంగ.. !
సాక్షి, అల్లిపురం(విశాఖ దక్షిణ): వారిద్దరూ రూమ్మేట్లు. అందులో ఒకరు రెండో వ్యక్తి ఖాతా నుంచి దాదాపు రూ.80 వేలను మొబిక్విక్ అనే యాప్ ద్వారా దొంగిలించాడు. ఫోన్‌కు వచ్చే ఓటీపీలను ఎప్పటికప్పుడు డిలీట్ చేసేసేవాడు. ఈ క్రమంలో వచ్చిన ఓ మెసేజ్‌ను గుర్తించిన బాధితుడు బ్యాంక్ అధికారులను సంప్రదించాడు. ఖాతా నుంచి రూ.80 వేలు విత్‌డ్రా అయినట్టు చెప్పడంతో లబోదిబోమన్నాడు. సమాచారం అందుకున్న సైబర్ క్రైం పోలీసులు.. ఆ యువకుడిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సైబర్ క్రైం సీఐ వి.గోపీనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో ఇసుకతోట రామ మందిరం వీధికి చెందిన చందక భాస్కరరావుకు తన ఎస్బీఐ ఖాతాకు జత చేసిన మొబైల్ నంబర్‌కు ‘మీ ఏటీఎం కార్డు పీవోఎస్/ఈ కామర్స్ లావాదేవీలకు వాడుతున్నారు. దయచేసి వెంటనే మీ కార్డును బ్లాక్ చేయండి’ అని మెసేజ్ వచ్చింది. అనుమానం వచ్చిన ఆయన బ్యాంకు అధికారులను కలిశారు. దీంతో బ్యాంకు సిబ్బంది ఈ ఖాతా నుంచి జూలై 7 నుంచి 11వ తేదీ వరకు రూ.80 వేలు విత్ డ్రా అయ్యాయని ఆయనకు తెలిపారు. దీంతో బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు ఇసుకతోట ప్రాంతానికి చెందిన బొద్దు స్వాతి కిరణ్ అలియాస్ సాయిగా గుర్తించారు. భాస్కరరావు, సాయిలు రూమ్మేట్లు. నిందితుడు సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఓసారి బాధితుడి వద్ద నుంచి ఫోన్ కావాలని తీసుకున్నాడు. ఫోన్ మాట్లాడిన తర్వాత.. మొబిక్విక్ యాప్‌లో తను నంబర్‌ను యాడ్ చేసుకున్నాడు. తరచూ ఫోన్ తీసుకుని డబ్బులను యాప్ ద్వారా తన ఖాతాకు పంపించుకునేవాడు. వచ్చిన ఓటీపీని ఎప్పటికప్పుడు డిలీట్ చేసేవాడు. ఈ క్రమంలో వచ్చిన ఓ మేసేజ్‌తో బాధితుడు బ్యాంక్ అధికారులను ఆశ్రయించడం, తర్వాత సైబర్ క్రైం పోలీసుల రంగప్రవేశంతో అసలు విషయం బయటపడింది. ఈ మేరకు నిందితుడిని సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతని ఖాతాను ఫ్రీజ్ చేసి, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
మద్యం మత్తులో టీనేజర్ నగ్న ఫొటోలు.. ఘోరం!
ముంబై: నగరంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో నిద్రలోకి జారుకున్న టీనేజర్‌ను అతని రూమ్మేట్స్ నగ్నంగా ఫొటోలు తీసి.. డబ్బులు ఇవ్వాలని, లేకపోతే నగ్న ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారు. దీంతో పాల్ఘర్ వాంగావ్‌లో తాము ఉంటున్న అద్దె గదిలోనే ఉరేసుకొని టీనేజర్ ప్రాణాలు విడిచాడు. పోలీసుల విచారణలో నిందితుడి ఫోన్లో మృతుడి నగ్న ఫొటోలు దొరికాయి. ఈ ఘటనలో మృతుడు, నిందితుడు బోయిసార్‌లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. ఇద్దరూ ఒకే గదిలో అద్దెకు ఉంటున్నారు. కొన్నివారాల కిందట తమ గదిలో టీనేజర్, నిందితుడు, మరో వ్యక్తి మద్యం సేవించారు. ఈ క్రమంలో టీనేజర్ నిద్రలోకి జారుకోగా.. అతని దుస్తులు విప్పి.. నిందితుడు నగ్నంగా ఫొటోలను తీశాడు. తెల్లారి లేచిన తర్వాత ఆ ఫొటోలు చూపించి బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. మొదట జోక్ చేస్తున్నాడని టీనేజర్ భావించాడు. కానీ, సహోద్యోగి కూడా అయిన రూమ్మేట్ మాత్రం డబ్బులు ఇవ్వాల్సిందేనని, లేకపోతే ఫొటోలు సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులకు దిగాడు. ఆఖరికీ పనిచేస్తున్న కంపెనీలోనూ ఇదే తరహాలో బ్లాక్మెయిల్ చేయడంతో గత సోమవారం సహోద్యోగి ఉద్యోగానికి వెళ్లిన తర్వాత అద్దె గదిలో ఒంటరిగా ఉన్న బాధితుడు ఉరేసుకున్నాడు. నిందితుడి నుంచి ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫొటోలు డిలీట్ చేయాల్సిందిగా టీనేజర్ ప్రాధేయపడుతూ చేసిన మెసేజ్‌లను నిందితుడి ఫోన్లో పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
ఎల్లలు దాటిన స్నేహ బంధం!
స్నేహ బంధమూ.. ఎంత మధురమూ... కరిగిపోదు చెరిగి పోదు జీవితాంతమూ అన్నాడో సినీ కవి. నిజంగా ఆ ఇద్దరు స్నేహితుల బంధమూ అలాగే కొనసాగుతోంది. కుటుంబ సభ్యులు, బంధువుల బంధాలు తెలియని అనాధలే అయినా.. శరణాలయంలో కలసి మెలసి పెరిగిన వారి స్నేహ బంధం మాత్రం విడిపోలేదు. చిన్నతనంలో ఆఫ్రికాలోని అనాధ శరణాలయంలో ఒకరికి ఒకరై బతికిన జీవితాలు... అమెరికా కు దత్తతకు వెళ్ళినా అనుకోకుండా ఒకే చోటుకి చేరుకున్నాయి. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి ఆఫ్రికాలోని మొజాంబిక్ అనాథాశ్రమంలో పెరిగిన ఆ ఇద్దరు అబ్బాయిలు ఊహ తెలిసినప్పటి నుంచీ మంచి స్నేహితులు. అయితే ప్రస్తుతం 18 ఏళ్ళ వయసున్న కెల్విన్ లెవిస్, అఫోన్సో స్టేటర్ లను ఎనిమిదేళ్ల క్రితం అరిజోనా గిల్బర్ట్ నుంచి వచ్చిన రెండు కుటుంబాలు ఒకరికి తెలియకుండా ఒకరు దత్తతకు స్వీకరించారు. ఇరు కుటుంబాలు ఒకే ప్రాంతంలో కేవలం రెండు మైళ్ళ దూరంలో ఉండటంతో తిరిగి కెల్విన్, అఫోన్సో లు ఒకే కళాశాలలో చేరడంతో అసలు విషయం తెలిసింది. ఇరు కుటుంబాలు ఒకరికొకరు తెలియదు. దత్తత సమయంలోనూ కలవలేదు. అయితేనేం ఒకే ప్రాంతంలో దత్తతకు రావడంతో ఆశ్చర్యంగా ఇద్దరు స్నేహితులు తిరిగి కలుసుకున్నారు. చూసేందుకు భిన్నంగా కనిపించినా తమ స్నేహ బంధం ఎంతో ధృఢమైనదని, అందుకే తిరిగి తాము కలవగలిగామని చెప్తున్నారు. ఎక్కడో విడిపోయిన తాము తిరిగి ఒకేచోట కలిసి పెరిగే అవకాశం రావడం ఎంతో ఆనందాన్నిచ్చిందని ఆ స్నేహితులిద్దరూ చెప్తున్నారు. ఇద్దరూ గిల్బర్ట్ హైస్కూల్లోని సాకర్ టీం లో చేరారు. బ్రిగమ్ యంగ్ యూనివర్శిటీలో సీటు సంపాదించి... రూమ్మేట్స్ గా ఉండే యోచనలో ఉన్నారు. భవిష్యత్తులో వైద్యుడుగా స్థిరపడి మొజాంబిక్ లో సేవలు అందించాలనుకుంటున్నానని కెల్విన్ చెప్తుంటే... వివిధ దేశాల మధ్య దత్తత స్వీకరణ అభివృద్ధి చేసేందుకు కావలసిన అంతర్జాతీయ అధ్యయనాల్లో డిగ్రీ చదవాలనుకుంటున్నానని అఫోన్సో చెప్తున్నాడు. మేమిద్దరం స్నేహితులేకాదు సోదరులకంటే ఎక్కువ బంధం కలగి ఉన్నామని, భవిష్యత్తులో మా పిల్లలను సైతం మంచి స్నేహితులుగా ఉండేట్టు చూస్తామని ఆ అపూర్వ స్నేహితులు... కాదు సహోదరులు చెప్తున్నారు.