ఎల్లలు దాటిన స్నేహ బంధం!
స్నేహ బంధమూ.. ఎంత మధురమూ... కరిగిపోదు చెరిగి పోదు జీవితాంతమూ అన్నాడో సినీ కవి. నిజంగా ఆ ఇద్దరు స్నేహితుల బంధమూ అలాగే కొనసాగుతోంది. కుటుంబ సభ్యులు, బంధువుల బంధాలు తెలియని అనాధలే అయినా.. శరణాలయంలో కలసి మెలసి పెరిగిన వారి స్నేహ బంధం మాత్రం విడిపోలేదు. చిన్నతనంలో ఆఫ్రికాలోని అనాధ శరణాలయంలో ఒకరికి ఒకరై బతికిన జీవితాలు... అమెరికా కు దత్తతకు వెళ్ళినా అనుకోకుండా ఒకే చోటుకి చేరుకున్నాయి.
చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి ఆఫ్రికాలోని మొజాంబిక్ అనాథాశ్రమంలో పెరిగిన ఆ ఇద్దరు అబ్బాయిలు ఊహ తెలిసినప్పటి నుంచీ మంచి స్నేహితులు. అయితే ప్రస్తుతం 18 ఏళ్ళ వయసున్న కెల్విన్ లెవిస్, అఫోన్సో స్టేటర్ లను ఎనిమిదేళ్ల క్రితం అరిజోనా గిల్బర్ట్ నుంచి వచ్చిన రెండు కుటుంబాలు ఒకరికి తెలియకుండా ఒకరు దత్తతకు స్వీకరించారు. ఇరు కుటుంబాలు ఒకే ప్రాంతంలో కేవలం రెండు మైళ్ళ దూరంలో ఉండటంతో తిరిగి కెల్విన్, అఫోన్సో లు ఒకే కళాశాలలో చేరడంతో అసలు విషయం తెలిసింది.
ఇరు కుటుంబాలు ఒకరికొకరు తెలియదు. దత్తత సమయంలోనూ కలవలేదు. అయితేనేం ఒకే ప్రాంతంలో దత్తతకు రావడంతో ఆశ్చర్యంగా ఇద్దరు స్నేహితులు తిరిగి కలుసుకున్నారు. చూసేందుకు భిన్నంగా కనిపించినా తమ స్నేహ బంధం ఎంతో ధృఢమైనదని, అందుకే తిరిగి తాము కలవగలిగామని చెప్తున్నారు.
ఎక్కడో విడిపోయిన తాము తిరిగి ఒకేచోట కలిసి పెరిగే అవకాశం రావడం ఎంతో ఆనందాన్నిచ్చిందని ఆ స్నేహితులిద్దరూ చెప్తున్నారు. ఇద్దరూ గిల్బర్ట్ హైస్కూల్లోని సాకర్ టీం లో చేరారు. బ్రిగమ్ యంగ్ యూనివర్శిటీలో సీటు సంపాదించి... రూమ్మేట్స్ గా ఉండే యోచనలో ఉన్నారు. భవిష్యత్తులో వైద్యుడుగా స్థిరపడి మొజాంబిక్ లో సేవలు అందించాలనుకుంటున్నానని కెల్విన్ చెప్తుంటే... వివిధ దేశాల మధ్య దత్తత స్వీకరణ అభివృద్ధి చేసేందుకు కావలసిన అంతర్జాతీయ అధ్యయనాల్లో డిగ్రీ చదవాలనుకుంటున్నానని అఫోన్సో చెప్తున్నాడు. మేమిద్దరం స్నేహితులేకాదు సోదరులకంటే ఎక్కువ బంధం కలగి ఉన్నామని, భవిష్యత్తులో మా పిల్లలను సైతం మంచి స్నేహితులుగా ఉండేట్టు చూస్తామని ఆ అపూర్వ స్నేహితులు... కాదు సహోదరులు చెప్తున్నారు.