The roundtable meeting
-
ఆరోగ్యమిత్రలకు మద్దతుగా ఉద్యమం
ఈ నెల 28 నుంచి విజయవాడ లెనిన్ సెంటర్లో రిలేదీక్షలు విజయవాడలోని రౌండ్‌టేబుల్ సమావేశం నిర్ణయం విజయవాడ బ్యూరో : ఉద్యోగం కోసం రాష్ట్ర వ్యాపితంగా ఆరోగ్యమిత్రలు చేపట్టిన ఆందోళనకు రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేష్ అధ్యక్షతన మంగళవారం జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పలువురు మాట్లాడుతూ ఎనిమిదేళ్లుగా సేవలందిస్తున్న వైద్యమిత్రుల తొలగింపు దారుణమని, వారికి మద్దతుగా ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యమిత్రలకు మద్దతుగా జిల్లాల్లో రిలేనిరాహారదీక్షలు చేపట్టాలని, జనవరి 28 నుంచి విజయవాడ లెనిన్ సెంటర్లో రిలే దీక్షలు చేపట్టాలని తీర్మానించారు. అదే విధంగా ఈనెల 25న విజయవాడలో ఆరోగ్యమిత్రలను అక్రమ అరెస్టులు చేసి అర్థరాత్రి వరకు జైలులో ఉంచడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది. నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని సమావేశం డిమాండ్ చేసింది. వైద్యమిత్ర కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్(ఏఐటీయూసీ) ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఎమ్మెల్సీ పిజే చంద్రశేఖర్‌రావు, సీపీఎం రాష్ట్ర నాయకులు మిరియం వెంకటేశ్వర్లు, విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాది విష్ణు, యువజన యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్, బీజేపీ నాయకులు కేఎస్ అరుగమ్, ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఆర్.రవీంద్రనాథ్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.ధనలక్ష్మి, ఆరోగ్యమిత్ర యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మనోహర్‌మాణిక్యం పాల్గొని మాట్లాడారు. ఆరోగ్యమిత్రలపై సీఎం హామీ ఇచ్చారు.. సీపీఐ ఎమ్మెల్సీ విద్యార్హతల పేరుతో ఆరోగ్యమిత్రలను తొలగించేందుకు ఇచ్చిన జీవో నెంబర్ 28ను పునఃసమీక్షించాలని తాను విజ్ఞప్తి చేయడంతో సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారని సీపీఐ ఎమ్మెల్సీ, ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడు పీజే చంద్రశేఖరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గణతంత్ర వేడుకల్లో సీఎంను కలిసి ఆరోగ్యమిత్రల విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిపారు. గత ఎనిమిదేళ్లుగా ఆరోగ్యమిత్రలు ఆసుపత్రుల్లో రోగులకు సహాయకారిగా ఉంటున్నారని, ఇప్పుడు బీఎస్సీ, నర్సింగ్ ఉద్యోగ అర్హతగా నిర్ణయించడం సరైందికాదని తాను సీఎంకు వివరించానన్నారు. దీనిపై సరైన సమాచారం తీసుకుని ఆరోగ్యమిత్రలకు న్యాయం చేయాలని కోరడంతో తప్పనిసరిగా పరిశీలిస్తానని సీఎం హామీ ఇచ్చారని ఎమ్మెల్సీ చంద్రశేఖరరావు తెలిపారు. -
భూ సమీకరణపై అఖిలపక్షంతో చర్చించాలి
వాస్తు కోసమో, మూఢ నమ్మకాల కోసమో రాజధాని నిర్మాణం సరికాదు హేతుబద్ధత లేకుండా వ్యవహరిస్తే సింగూర్ తరహా ఉద్యమాలు ‘ఏపీ రాజధాని-భూ సమీకరణ’పై జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ భేటీలో డిమాండ్ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సంబంధించి భూ సమీకరణపై అఖిలపక్షంతో చర్చించకుండా, రైతుల్లో అపోహలు తొలగించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్లడం సరికాదని పలు రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్యనేతలు అన్నారు. రాష్ట్ర పరిస్థితులు, వనరులు, బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని వాస్తవ దృక్పథంతో ముందుకెళ్లాలన్నారు. వాస్తు కోసమో, మూఢ నమ్మకాల కోసమో రాజధానిని నిర్మిస్తామనడం క్షంతవ్యం కాదన్నారు. బ్లూ ప్రింట్ సమర్పించి కేంద్ర సాయాన్ని కోరకుండా ప్రభుత్వ పెద్దలు సింగపూర్, జపాన్ పర్యటనలు చేపట్టటాన్ని వక్తలు తప్పుపట్టారు. హేతుబద్ధత లేకుండా అశాస్త్రీయమైన విధానంలో భూ సమీకరణ చేపడితే సింగూర్ భూముల తరహా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.ఆంధ్రప్రదేశ్ ‘రాజధాని- భూ సమీకరణ’పై జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి దీనికి అధ్యక్షత వహించగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. రైతులకనుకూలంగానే సుప్రీం తీర్పులు... ఏపీ రాజధాని ఎలా ఉండాలనే అంశంపై శివరామకృష్ణన్ కమిటీని నియమించినప్పుడు కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని జస్టిస్ లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. నదీ జలాల చెంత నిర్మాణాలు జరపరాదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం మొండిగా నదీ ముఖ రాజధాని అనటం సరికాదన్నారు. కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే కుట్ర రాజధానికి భూ సమీకరణపై రైతుల్లో పలు అభిప్రాయాలున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి అన్నారు. పారిశ్రామికవేత్తలను పెట్టుబడుల కోసం ఆహ్వానించేందుకే జపాన్, సింగపూర్ పర్యటనలని సీఎం చంద్రబాబు చెబుతున్నా.. ల్యాండ్‌పూలింగ్‌లో రైతుల నుంచి సేకరించిన భూముల్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేడానికేన్న అనుమానం వ్యక్తం చేశారు. సొంత ఇంటి నిర్మాణం కాదు: వాసిరెడ్డి భూ సమీకరణ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం రైతులకు శుష్క వాగ్దానాలు చేస్తోందని వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ దుయ్యబట్టారు. రాజధాని నిర్మాణం అంటే సొంత ఇంటి నిర్మాణం కాదన్నారు. వేల ఎకరాలు ఎక్కడా తీసుకోలేదు: కాంగ్రెస్ 28 రాష్ట్రాల్లో ఏ రాజధాని నిర్మాణానికి ఇన్ని వేల ఎకరాలు సేకరించలేదని, అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ విస్తీర్ణమే 25.9 చదరపు కిలోమీటర్లని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్.తులసిరెడ్డి పేర్కొన్నారు. ఇవ్వకుంటే ‘గ్రీన్‌బెల్ట్’ కిందకే! సమీకరణకు అంగీకరించని రైతులను బలవం తం చేయరని, ఆ భూముల్ని గ్రీన్‌బెల్ట్ పరిధిలో తెచ్చే యోచన చేస్తున్నట్లు రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి విజయకుమార్ చెప్పారు. భూ సమీకరణపై రైతుల అభిప్రాయం తెలుసుకునేందుకు వెళ్ళిన పది వామపక్ష పార్టీలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడం హేయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు. ఏపీ కాంగ్రెస్ దళిత విభాగం అధ్యక్షులు కొరివి వినయ్‌కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు రాజధర్మం పాటించకుండా సామాజిక ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. భూ సమీకరణలో వ్యాపార నీతిని ప్రదర్శిస్తే తీవ్ర ప్రతిఘటన ఎదురు కాకతప్పదని రాజకీయ సామాజిక విశ్లేషకులు టి.లక్ష్మీనారాయణ హెచ్చరించారు.