rowing championship
-
రోయింగ్‌లో భారత్‌కు స్వర్ణం
-
సునీల్‌కు రజతం
సాక్షి, హైదరాబాద్: ఆసియా జూనియర్ రోయింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రోయర్లు టి. సునీల్, డి.సాయిరాజు మెరుగైన ప్రతిభతో ఆకట్టుకున్నారు. దక్షిణ కొరియాలోని చంగ్ జు నగరంలో జరిగిన ఈ టోర్నీలో రజత, కాంస్య పతకాలను సాధించారు. జూనియర్ కాక్స్‌లెస్ ఫోర్ విభాగంలో టి. సునీల్ రన్నరప్‌గా నిలవగా, పెయిర్ విభాగంలో డి. సాయిరాజు మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని దక్కించుకున్నాడు. తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌కు చెందిన బి. హేమలత.. జూనియర్ డబుల్ స్కల్ విభాగంలో బరిలోకి దిగి ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో భారత్ ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్యం సాధించింది. -
ఓవరాల్ చాంప్ తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్ రోయింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు సత్తా చాటింది. చెన్నైలో ఈనెల 4 నుంచి 10 వరకు జరిగిన ఈ టోర్నీలో 13 పాయింట్లతో ఓవరాల్ చాంపియన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. జాతీయ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర జట్టు ఓవరాల్ చాంపియన్‌గా నిలవడం ఇది నాలుగోసారి. ఈసారి పోటీల్లో మన రోయర్లు రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం ఏడు పతకాలను సాధించారు. వీటితో పాటు ఇందులో మెరుగ్గా రాణించిన ముగ్గురు రోయర్లు బి. హేమలత, డి. సాయిరాజు, టి. సునీల్ ఆసియా రోయింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారతజట్టుకు ఎంపికయ్యారు. ఆదివారం జరిగిన సబ్ జూనియర్ (15 ఏళ్లు) బాలుర స్కల్ ఈవెంట్ ఫైనల్లో హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్‌కు చెందిన డి. భాను కుమార్... కాక్స్‌లెస్ ఫోర్ విభాగంలో టి. కార్తీక్, ఎ. రాకేశ్, ఎన్. హేమంత్, కె. సాయి గణేశ్ (హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్)లతో కూడిన తెలంగాణ బృందం పసిడి పతకాలను సాధించింది. సబ్ జూనియర్ బాలికల కాక్స్‌లెస్ ఫోర్ ఈవెంట్లో పి. పావని, కె. ఉదయభాను, కె. సింధు, ఉదయభాను (హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్) బృందం, కాక్స్‌లెస్ పెయిర్ ఈవెంట్లో ఎం. భవ్య– కె. భారతి (హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్) జంట, డబుల్ స్కల్ కేటగిరీలో కె. నందిని–అవంతిక (హెచ్‌పీఎస్) జోడీ, చాలెంజర్ మెన్ కాక్స్‌లెస్ పెయిర్ విభాగంలో జాన్సన్ వర్గీస్–సునీల్ ద్వయం తలా ఓ రజతాన్ని సాధించాయి. సబ్‌జూనియర్ బాలుర కాక్స్‌లెస్ పెయిర్ ఈవెం ట్లో బి. రాకేశ్– ఇ. రామకృష్ణ జంట కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో రాణించిన రోయర్లను కోచ్‌లు వి. వెంకటేశ్వర రావు, సతీశ్ జోషి అభినందించారు. -
మహేశ్వర్ రెడ్డికి స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: జాతీయ రోయింగ్ సీనియర్ చాంపియన్‌షిప్ పోటీల్లో రాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్ మహేశ్వర్ రెడ్డి బంగారు పతకం సాధించాడు. భోపాల్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో బుధవారం జరిగిన 2 వేల మీటర్ల రేసులో మహేశ్వర్ రెడ్డి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మహేశ్వర్ పసిడి పతకం నెగ్గినందుకు డీజీపీ అనురాగ్ శర్మ హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్ లో మరిన్ని పతకాలు సాధించి రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచాలని ఆయన ఆకాక్షించారు. పోలీస్ స్పోర్ట్స్ ఐజీ వీవీ శ్రీనివాస్‌రావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేశారు. 7వ బెటాలియన్‌కు చెందిన మహేశ్వర్ రెడ్డి గతేడాది నిర్వహించిన రోయింగ్ సీనియర్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించినట్టు ఐజీ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. -
స్వరణ్‌కు స్వర్ణం
న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్‌షిప్ నుంచి రిక్తహస్తాలతో తిరిగి వచ్చిన భారత రోయర్లు ఆసియా చాంపియన్‌షిప్‌లో మాత్రం అదరగొట్టారు. ఒక స్వర్ణ పతకంతోపాటు రెండు రజతాలు, రెండు కాంస్య పతకాలు సాధించారు. చైనాలోని లువాన్ నగరంలో ఆదివారం ఈ పోటీలు ముగిశాయి. చివరి రోజు పురుషుల సింగిల్ స్కల్స్ ఈవెంట్లో ‘ఒలింపియన్’ స్వరణ్ సింగ్ విర్క్ పసిడి పతకాన్ని గెల్చుకున్నాడు. పంజాబ్‌కు చెందిన స్వరణ్ సింగ్ 7 నిమిషాల 31.88 సెకన్లలో లక్ష్యానికి చేరుకొని విజేతగా నిలిచాడు. పురుషుల కాక్స్డ్ ఎయిట్స్ ఈవెంట్లో... కాక్స్‌లెస్ ఫోర్ ఈవెంట్లో భారత జట్లకు రజత పతకాలు లభించాయి. లైట్ వెయిట్ పురుషుల డబుల్ స్కల్ ఈవెంట్లో... మహిళల లైట్ వెయిట్ క్వాడ్రాపుల్ స్కల్స్ ఈవెంట్లో భారత జోడిలకు కాంస్య పతకాలు వచ్చాయి. ఈ పోటీల్లో పాల్గొన్న 22 మంది సభ్యులుగల భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ‘ద్రోణాచార్య’ అవార్డు గ్రహీత ఇస్మాయిల్ బేగ్‌తోపాటు ఆర్పీ షిల్కె, అమిత్ సింగ్, బాబూ జాన్ కోచ్‌లుగా వ్యవహరించారు.