సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్ రోయింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు సత్తా చాటింది. చెన్నైలో ఈనెల 4 నుంచి 10 వరకు జరిగిన ఈ టోర్నీలో 13 పాయింట్లతో ఓవరాల్ చాంపియన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. జాతీయ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర జట్టు ఓవరాల్ చాంపియన్‌గా నిలవడం ఇది నాలుగోసారి. ఈసారి పోటీల్లో మన రోయర్లు రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం ఏడు పతకాలను సాధించారు. వీటితో పాటు ఇందులో మెరుగ్గా రాణించిన ముగ్గురు రోయర్లు బి. హేమలత, డి. సాయిరాజు, టి. సునీల్ ఆసియా రోయింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారతజట్టుకు ఎంపికయ్యారు.
ఆదివారం జరిగిన సబ్ జూనియర్ (15 ఏళ్లు) బాలుర స్కల్ ఈవెంట్ ఫైనల్లో హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్‌కు చెందిన డి. భాను కుమార్... కాక్స్‌లెస్ ఫోర్ విభాగంలో టి. కార్తీక్, ఎ. రాకేశ్, ఎన్. హేమంత్, కె. సాయి గణేశ్ (హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్)లతో కూడిన తెలంగాణ బృందం పసిడి పతకాలను సాధించింది. సబ్ జూనియర్ బాలికల కాక్స్‌లెస్ ఫోర్ ఈవెంట్‌లో పి. పావని, కె. ఉదయభాను, కె. సింధు, ఉదయభాను (హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్) బృందం, కాక్స్‌లెస్ పెయిర్ ఈవెంట్‌లో ఎం. భవ్య– కె. భారతి (హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్) జంట, డబుల్ స్కల్ కేటగిరీలో కె. నందిని–అవంతిక (హెచ్‌పీఎస్) జోడీ, చాలెంజర్ మెన్ కాక్స్‌లెస్ పెయిర్ విభాగంలో జాన్సన్ వర్గీస్–సునీల్ ద్వయం తలా ఓ రజతాన్ని సాధించాయి. సబ్‌జూనియర్ బాలుర కాక్స్‌లెస్ పెయిర్ ఈవెం ట్‌లో బి. రాకేశ్– ఇ. రామకృష్ణ జంట కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో రాణించిన రోయర్లను కోచ్‌లు వి. వెంకటేశ్వర రావు, సతీశ్ జోషి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment