స్వరణ్‌కు స్వర్ణం
న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్‌షిప్ నుంచి రిక్తహస్తాలతో తిరిగి వచ్చిన భారత రోయర్లు ఆసియా చాంపియన్‌షిప్‌లో మాత్రం అదరగొట్టారు. ఒక స్వర్ణ పతకంతోపాటు రెండు రజతాలు, రెండు కాంస్య పతకాలు సాధించారు. చైనాలోని లువాన్ నగరంలో ఆదివారం ఈ పోటీలు ముగిశాయి. చివరి రోజు పురుషుల సింగిల్ స్కల్స్ ఈవెంట్‌లో ‘ఒలింపియన్’ స్వరణ్ సింగ్ విర్క్ పసిడి పతకాన్ని గెల్చుకున్నాడు. పంజాబ్‌కు చెందిన స్వరణ్ సింగ్ 7 నిమిషాల 31.88 సెకన్లలో లక్ష్యానికి చేరుకొని విజేతగా నిలిచాడు.
పురుషుల కాక్స్‌డ్ ఎయిట్స్ ఈవెంట్‌లో... కాక్స్‌లెస్ ఫోర్ ఈవెంట్‌లో భారత జట్లకు రజత పతకాలు లభించాయి. లైట్ వెయిట్ పురుషుల డబుల్ స్కల్ ఈవెంట్‌లో... మహిళల లైట్ వెయిట్ క్వాడ్రాపుల్ స్కల్స్ ఈవెంట్‌లో భారత జోడిలకు కాంస్య పతకాలు వచ్చాయి. ఈ పోటీల్లో పాల్గొన్న 22 మంది సభ్యులుగల భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ‘ద్రోణాచార్య’ అవార్డు గ్రహీత ఇస్మాయిల్ బేగ్‌తోపాటు ఆర్‌పీ షిల్కె, అమిత్ సింగ్, బాబూ జాన్ కోచ్‌లుగా వ్యవహరించారు.