రూ.100 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి
ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ
న్యూశాయంపేట : జర్నలిస్టుల సంక్షేమ నిధికి రూ.100 కోట్లు కేటాయించడంతో పాటు ప్రతీ జర్నలిస్టుకు రూ.10వేల పింఛన్ అందే వరకు పోరాడుతామని రాష్ట్ర ప్రెస్ అకాడమి చైర్మెన్ అల్లం నారాయణ తెలిపారు. చైర్మన్‌గా రెండోసారి నియమితులైన సందర్భంగా హన్మకొండలోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం టీయూడబ్ల్యూజే(హెచ్–143) ఆధ్వర్యంలో ఆయన అభినందన సభ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం ఇంకా కుదట పడలేదని, అధికారుల లేమితోనే జర్నలిస్టుల అక్రిడిటేషన్లు, ఆరోగ్యకార్డులు ఆలస్యమవుతున్నాయని తెలిపారు.
అయితే, త్వరలో అందరికీ అందుతాయని ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. తమ పోరాటాల ఫలితంగానే అక్రిడిటేషన్ల కోసం ప్రభుత్వం జీవో జారీ చేసిందని, డెస్క్ జర్నలిస్టులకు కూడా ఇచ్చేలా జీవో జారీ అయిందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ. 20 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధిని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిందని, ఇది తమ సంఘ పోరాట ఫలితమేనని చెప్పారు. ఈ నిధి రూ.100 కోట్లు కేటాయించే వరకు పోరాడుతామని, తన హయాంలో ప్రతిక్షణం జర్నలిస్టుల సంక్షేమానికే వెచ్చిస్తానన్నారు. జర్నలిస్టులకు ఆరోగ్యకార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మంజూరుకు కృషి చేస్తాన ని హామీ ఇచ్చారు. తెలంగాణ సిలబస్ ప్రవేశపెట్టి అకాడమి ద్వారా జర్నలిస్టులకు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు వివిధ సంఘాల బాధ్యులు నారాయణను ఘనంగా సన్మానించారు. అంతకు ముందు ప్రెస్‌క్లబ్ ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు క్రాంతి, పి.రవి, లెనిన్, కొండల్రావు, పి.శివకుమార్, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి, జిల్లా అద్యక్షుడు జి.వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
సాక్షి విలేకరికి పరామర్శ
హన్మకొండ చౌరస్తా : ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి హన్మకొండలోని మ్యాక్స్‌కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్టేషన్ ఘన్పూర్ సాక్షి రిపోర్టర్ వనం వేణుగోపాల్‌ను ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పరామర్శించారు. వేణుగోపాల్ ఆరోగ్య పరిస్థితులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఉన్న కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడుతూ.. అధైర్యపడద్దని వేణుగోపాల్ ఆరోగ్యం కుదుటపడే వరకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. ఆయన వెంట జర్నలిస్టు యూనియన్ నాయకులు కొండల్రావు, వెంకట్ తదితరులు ఉన్నారు.