మేడారం జాతరకు రూ.100 కోట్లు ఉత్తదే
సాక్షిప్రతినిధి, వరంగల్: మేడారం జాతర ఏర్పాట్లకు నిధుల కేటాయింపుపై మంత్రులు, ఎంపీలు చెబుతున్న మాటలకు.. వాస్తవ పరిస్థితికి పొంతన కుదరడం లేదు. జిల్లాలో ఎక్కడ.. ఏ పని జరిగినా.. అది మేడారం జాతర కోసమే అన్నట్లుగా చెబుతున్నారు. సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్ల పరిశీలన కోసం కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్, రాష్ట్ర మంత్రులు రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఎంపీలు సిరిసిల్ల రాజయ్య, గుండు సుధారాణి రెండు రోజుల క్రితం మేడారం వెళ్లారు
. ఎప్పుడూ లేని విధంగా జాతర ఏర్పాట్ల కోసం ఈ ఏడాది రూ.100 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు ఘనంగా ప్రకటించారు. రెండేళ్ల క్రితం జరిగిన జాతర కంటే వచ్చే జాతరకు అదనంగా 30 లక్షల మంది వస్తారని ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని, దీని కోసం నిధులు ఇస్తున్నామని అన్నారు.
రూ.100 కోట్ల కేటాయింపుపై మంత్రుల ప్రకటనలు నిజమేనా అని ఆరా తీస్తే.. అసలు విషయాలు బయటపడ్డాయి. దెబ్బతిన్న రోడ్లను వెంటవెంటనే మరమ్మతు చేయాల్సి ఉండగా వాటిని ఇన్నాళ్లు పెండింగ్‌లో పెట్టి ఇప్పుడు చేపట్టారు. ఇలా రూ.18.57 కోట్లతో జిల్లా వ్యాప్తంగా జాతరతో సంబంధం లేకుండా చేస్తున్న పనులను.. మన మంత్రులు మేడారం కోటాలోనే వేసి మాట్లాడుతున్నారు. ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు జరిగే జాతరకు వచ్చే కోటి మందికిపైగా భక్తుల అవసరాలకు కోసం 20 ప్రభుత్వ శాఖలు తరఫున రూ.114 కోట్లతో జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
రాష్ట్ర ప్రభుత్వం రూ.87.94 కోట్లను విడుదల చేసింది. ఇప్పటికి విడుదలైన నిధులను చూసినా.. రూ.100 కోట్లు దాటలేదు. విడుదలైన నిధుల్లో అత్యధికంగా రూ.59.30 కోట్లు రోడ్లు భవనాల శాఖవే ఉన్నారుు. అరుుతే రోడ్లు భవనాల శాఖ వారు రూ.18.57 కోట్లతో జాతర మార్గాలకు ఎలాంటి సంబంధం లేని రోడ్లను మరమ్మతు చేస్తున్నారు. ఎక్కడెక్కడో చేస్తున్న పనులను కూడా జాతర పనుల్లోనే కలిపేశారు. రూ.100 కోట్లు తెచ్చామని చెప్పుకునేందుకు ఇలా సంబంధంలేని పనులను మేడారం పనుల్లో కలపడం విమర్శలకు తావిస్తోంది.