వేషం వేసి..మోసం చేసి..
విజయనగరం క్రైం: బుధవారం సాయంత్రం 4 గంటల సమయం.. విజయనగరంలోని గాజులరేగ ప్రాంతంలో ఉన్న ఆంధ్రా యూనివర్సిటీ స్టడీ సెంటర్ సమీప సీతం ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర్లోని తోట..ముగ్గురువ్యక్తులు అక్కడికి వెళ్లారు. ఇంతలో పోలీసుల వేషంలో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడికి వచ్చి ఇద్దరిపైదాడిచేసి రూ.20లక్షలతో ఉండాయించారు. వారివెనుకనే మరో వ్యక్తి పరారయ్యాడు. ఇదేదో సినిమా స్టోరీని తలపించే సంఘటనలా ఉంది కదా! కానీ ఇది సీతం ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన యదార్థ సంఘటన. పోలీసులు, బాధితులు తెలిపిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని లకడీకాపూల్కు చెందిన కొలిశెట్టిసుబ్బారావు మెడికల్ బిజినెస్ చేస్తుంటాడు. సుబ్బారావుకు విజయవాడకుచెందిన శివఅనే స్నేహితుడు ఉన్నాడు.
శివకు హైదరాబాద్‌కు చెందిన జగదీష్ స్నేహితుడు. సుబ్బారావుకు జగదీష్‌ను శివ పరిచయం చేశాడు. జగదీష్ తక్కువరేటుకు బంగారాన్ని అందిస్తాడని రూ.20లక్షలు తేవాలని సుబ్బారావుకు శివ ఆశపెట్టాడు. జగదీష్ కూడా అలాగే నమ్మబలికాడు. విజయనగరంలోని ఆంధ్రాయూనివర్సిటీ స్టడీ సెంటర్ ప్రాంతంలో తక్కువ రేటుకు బంగారాన్ని అందిస్తానని జగదీష్ చెప్పడంతో గత రెండు రోజులుగా సుబ్బారావు,శివలు విజయనగరంలో తిరుగుతున్నారు. జగదీష్ ఫోన్‌చేసి ఫలానా స్థలానికి రావాలని సూచించేవాడు. ఆ మేరకు సుబ్బారావు,శివ ఆర్టీసీ కాంప్లెక్స్‌లో తిరిగారు. ఈ క్రమంలో బుధవారం మళ్లీ సుబ్బారావు, శివ విశాఖపట్నంలో కారు బుక్‌చేసుకుని విజయనగరం వచ్చారు. జగదీష్ కూడా వారిని కలవడంతో ముగ్గురూ కలిసి ఆటోలో ఆంధ్రా యూనివర్సిటీ స్టడీ సెంటర్ ప్రాంతంలో దిగారు.
సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో సుబ్బారావు, శివ, జగదీష్ ముగ్గురు కలిసి స్టడీసెంటర్ సమీప సీతం ఇంజనీరింగ్ కళాశాల దగ్గర గల తోటలోకివెళ్లారు. తక్కువ రేటుకు బంగారం విషయంగురించి ముగ్గురూ మాట్లాడుకుంటున్న సమయంలో జగదీష్ కొంచెం పక్కకువెళ్లి ఫోన్లో కొంతమందికి సమాచారం అందించాడు. అంతే హఠాత్తుగా తోటలోకి పోలీసుల వేషంలో నలుగురువ్యక్తులు ఆటోలో వచ్చి ఎప్పటినుంచిదొంగ వ్యాపారం చేస్తున్నారని చెప్పి సుబ్బారావు, శివలపై దాడిచేశారు. సుబ్బారావువద్దనున్న రూ.20లక్షల నగదును లాక్కుని పరారయ్యారు.వారి వెనుకనే జగదీష్ కూడా పరిగెత్తుకుంటూ పరారయ్యాడు. కొద్దినిమిషాల్లో తేరుకున్న సుబ్బారావు, శివలు టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే విజయనగరం డీఎస్పీ ఎస్.శ్రీనివాస్, టూటౌన్ ఇన్చార్జ్ సీఐ కె.రామారావు బాధితులతో కలిసి సంఘటన స్ధలానికి చేరుకున్నారు. బాధితులను డీఎస్పీ పూర్తిస్థాయిలో విచారణ చేశారు. బాధితులతో కలిసి ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతంలో పరిశీలించారు. మధ్యవర్తిగా వ్యవహరించిన శివనుఅదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. బాధితుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ కె.రామారావు తెలిపారు.
అప్రమత్తమైన పోలీసులు
భారీస్థాయిలో నగదు అపహరించినట్లు సమాచారం రాగానే డీఎస్పీ ఎస్.శ్రీనివాస్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. వాహనాలు తనిఖీ చేసి అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ విచారణ చేయాలని ఆదేశాలు జారీచేశారు.