స్టూడియోలో చోరీ.. రూ.2.50 లక్షల నగదు అపహరణ
చాగల్లు : చాగల్లులోని ఒక ఫొటో స్డూడియోలో రూ.2.50 లక్షల నగదు అపహరణకు గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక బస్టాండ్ పక్కన గల ఎస్సీ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్‌లోని 3వ నంబర్ షాపులో ఇదే గ్రామానికి చెందిన అయినాల వెంకట వీరబాబు అనే వ్యక్తి ఫొటో స్టూడియో నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి 9 గంటలకు స్డూడియోను మూసివేసి ఇంటికి వెళ్లాడు. వివాహ షూటింగ్ నిమిత్తం కెమెరాలు తెచ్చుకునేందుకు బుధవారం ఉదయం 5.40 గంటల సమయంలో వీరబాబు స్టూడియోకు వెళ్లాడు.
షట్టర్ తెరిచి చూడగా బీరువా తలుపులు తీసి, షాపు సీలిం గ్‌కు రంధ్రం పడి ఉంది. ఫర్నిచర్ చిందరవందరగా పడి ఉంది. డ్రాయర్ సొరుగులో దాచుకున్న రూ.2.50 లక్షల సొమ్ము చోరీకి గురైనట్టు గుర్తిం చిన వీరబాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దొంగలు స్టూడియో వెనుక వైపు కిటికీలోంచి స్టూడియోలోకి ప్రవేశించినట్టు భావిస్తున్నారు. ఏలూరు నుంచి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలను రప్పించి ఆధారాలు సేకరించారు. ఘటనా స్థలాన్ని నిడదవోలు సీఐ ఎం.బాలకృష్ణ పరిశీలించారు. ట్రైనీ ఎస్సై సీహెచ్.సతీష్‌కుమార్ కేసు నమోదు చేశారు.