ట్రేడింగ్ పేరుతో రూ.27 కోట్ల టోకరా
ఇన్వెస్టర్ల సొమ్ము సొంతానికి వాడుకున్న వైనం
మొత్తం 12 మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తింపు
ఒకరిని అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: షేర్ మార్కెట్ పేరిట భారీగా వసూళ్లు చేసి... పలువురిని మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు ఆకుల శ్రీధర్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్వీఎస్సీ వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పెద్ద మొత్తంలో దండుకున్న ఈ వ్యవహారంలో మొత్తం 12 మందికి ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని డీసీపీ అవినాష్ మహంతి గురువారం తెలిపారు. వీరు రూ.27 కోట్ల మేర మోసాలకు పాల్పడ్డారన్నారు. నిందితుల్లో అత్యధికులు బంధువులే ఉన్నారన్నారు.
ఫ్రాంచైజీలు... పెట్టుబడులు...
సికింద్రాబాద్ ఈస్ట్‌మారేడ్‌పల్లికి చెందిన ఆకుల శ్రీధర్ తన భార్య చందనతో కలసి నాగోల్‌లో ఎస్వీఎస్సీ సంస్థను ఏర్పాటు చేశారు. దీనికి డైరెక్టర్లుగా ఉన్న వీరిద్దరికీ షేర్ మార్కెట్‌తో పాటు ట్రేడింగ్‌పైనా అవగాహన ఉంది. గతంలో మాస్టర్ ట్రస్ట్ సంస్థ నుంచి ఫ్రాంచైజీ తీసుకుని పలువురి నుంచి పెట్టుబడులు సేకరించారు. కొన్నాళ్లకు దీన్ని మూసేసిన భార్యా భర్తలు... ఫ్రాంచైజీని తమ బంధువైన జె.శ్రీనివాస్ పేరు మీదకు మార్చారు. తమ బంధువైన కోమటిరెడ్డి భిక్షంరెడ్డి పేరుతో 2014లో పీర్లెస్ సెక్యూరిటీస్ లిమిటెడ్ ఫ్రాంచైజీ తీసుకున్నారు. దీనికోసం 80 మంది నుంచి రూ.3.5 కోట్ల పెట్టుబడి రాబట్టారు. ఎస్వీఎస్సీ ద్వారా పీర్లెస్ సెక్యూరిటీస్‌లో ట్రేడింగ్ మొదలెట్టిన శ్రీధర్, చందన... 2015లో 20 మంది నుంచి రూ.కోటి పెట్టుబడి పెట్టించారు. ఆపై కె.సవితారెడ్డి పేరుతో ఎంకే గ్లోబల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ నుంచి ఫ్రాంచైజీ తీసుకున్న భార్యాభర్తలు.. 15 మంది నుంచి రూ.70 లక్షల మేర పెట్టుబడులు సేకరించారు. ప్రతి ఒక్కరికీ భారీ లాభాలు పంచుతామంటూ 318 మందితో పెట్టుబడులు పెట్టించారు. దీని ద్వారా నిందితులు ప్రతి నెలా దాదాపు రూ.5 లక్షల మేర కంపెనీల నుంచి బ్రోకరేజ్ తీసుకున్నారు.
అవగాహన లేనివారితో డీమ్యాట్ ఖాతాలు...
స్టాక్ మార్కెట్‌పై సరైన అవగాహన లేని వారి పేరుతోనూ లాభాల ఆశ చూపిన వీరు డీమ్యాట్ ఖాతాలు తెరిపించారు. వారి మాటలు నమ్మిన మూసాపేట వాసి కె.చంద్రకళ తన బంధువులు, స్నేహితులు, పరిచయస్తులతో కలిసి రూ.9 కోట్ల పెట్టుబడి పెట్టారు. కొన్ని రోజులకు నిందితులు తమ షేర్లకు సంబంధించిన మొత్తాన్ని స్రవంతి, మహ్మద్ ఫసియుద్దీన్లకు చెందిన ఖాతాలకు మళ్లించి రూ.68 లక్షలు డ్రా చేసుకున్నారని వీరికి తెలిసింది. చివరకు మలక్‌పేట ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎస్వీఎస్సీ సంస్థను మూసేసిన నిందితులు పరారయ్యారు. దీంతో చంద్రకళ ఫిర్యాదు చేయడంతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.
మిగిలినవారి కోసం గాలింపు...
ఏసీపీ జి.జోగయ్య నేతృత్వం లో ఎస్సై ఎన్.సురేశ్‌కుమార్ ఈ కేసు దర్యాప్తు చేశారు. శ్రీధర్, చందనతో పాటు ఆమె తల్లిదండ్రులు కె.భిక్షంరెడ్డి, కె.సవితారెడ్డి, సోదరుడు చాణక్యరెడ్డి, అతడి భార్య స్రవంతి, బంధువులు సుభాషి ణి, ఎన్.పాపిరెడ్డి, ఎన్.మహేశ్‌రెడ్డి, ఏజెంట్లు డాక్టర్ ఇంతియాజ్‌అలీ, మహ్మద్ ఫసియుద్దీన్, వై.ప్రతాప్ రెడ్డిలను నిందితులుగా తేల్చారు. శ్రీధర్ అరెస్టు తర్వాత మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.