పేటీఎమ్‌లో ఆర్ క్యాప్ 1% వాటా విక్రయం
డీల్ విలువ రూ.225 కోట్లు
భారీగా లాభాలు
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎమ్‌లో 1% వాటాను రిలయన్స్ క్యాపిటల్(ఆర్ క్యాప్) విక్రయించింది. ఈ వాటాను చైనాకు చెందిన ఆలీబాబా గ్రూప్‌కు రూ.275 కోట్లకు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ విక్రయించిందని సమాచారం. ఈ వాటా విక్రయంతో రిలయన్స్ క్యాపిటల్‌కు భారీగా లాభాలు వచ్చాయి. ఈ 1% వాటాను గతంలో రిలయన్స్ క్యాపిటల్ రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుదు ఈ వాటాను రూ.275 కోట్లకు విక్రయించింది.
లాభాలు అప్పడే అయిపోలేదు. గతంలో పేటీఎమ్‌లో ఈ 1% వాటాను కొనుగోలు చేసినందుకు పేటీఎమ్ ఈ కామర్స్ వెంచర్లో కొంత వాటా రిలయన్స్ క్యాపిటల్‌కు ఉచితంగా లభించింది. ఈ ఉచిత వాటాను కొనసాగించాలని రిలయన్స్ క్యాపిటల్ భావిస్తోంది. ఇటీవల పెట్టుబడులు సమీకరణ పరంగా చూస్తే పేటీఎమ్ ఈ కామర్స్ సంస్థ విలువ వంద కోట్ల డాలర్లుగా ఉంటుందని అంచనా. కాగా తాజా 1 శాతం వాటా విక్రయం పరంగా చూస్తే పేటీఎమ్ విలువ 500 కోట్ల డాలర్లుగా ఉంటుందని నిపుణులు లెక్కలేస్తున్నారు.
భారత్‌లో అమెజాన్‌తో పోటీ పడేందుకు గాను ఆలీబాబా సంస్థ పేటీఎమ్‌లో వాటాను పెంచుకుంటోందని విశ్లేషకులంటున్నారు. అయితే ఈ విక్రయ వార్తలపై ఇరు కంపెనీల ప్రతినిధులు వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. కాగా గత ఏడాది డిసెంబర్లో పేటీఎమ్ వ్యవస్థాపకులు, సీఈఓ కూడా అయిన విజయ్ శేఖర్ శర్మ పేటీఎమ్ మాతృకంపెనీ వన్97 కమ్యూనికేషన్స్‌లో 1% వాటాను రూ.325కు విక్రయించారు.