భారీగా పతనమైన టెలికాం షేర్లు
ముంబై : టెలికాం స్కాం ఎఫెక్ట్ తో మొబైల్ ఆపరేటర్ల షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. టెలికాం శాఖ త్వరలో ఆరుగురు టెలికాం ఆపరేటర్లకు రూ.12,500 కోట్ల డిమాండ్ నోటీస్ జారీచేయనుందని నేపథ్యంలో నాలుగు మేజర్ టెలికాం షేర్లు శుక్రవారం ట్రేడింగ్ లో భారీగా పతనమయ్యాయి. ఐడియా సెల్యులార్ 2.86 శాతం నష్టంతో రూ.101.90 వద్ద, భారతీ ఎయిర్ టెల్ షేర్లు 2.3శాతం నష్టంతో రూ.355 వద్ద, రిలయన్స్ కమ్యూనికేషన్ షేర్లు 3.15 శాతం నష్టంతో రూ.50.80 వద్ద, టాటా టెలి సర్వీసు షేర్లు 3.75 శాతం నష్టంతో రూ.6.93 వద్ద ముగిశాయి. ఈ షేర్ల పతనంతో సెన్సెక్స్ 0.3శాతం కిందకు నమోదైంది.
కేంద్రంలో రూ.45వేల కోట్లకు పైగా టెలికాం కుంభకోణం చోటు చేసుకుందని.. కాగ్ బయటపెట్టిన ఈ కుంభకోణంతో ప్రమేయమున్న ఆరు ప్రముఖ టెలికాం సంస్థలను కాపాడేందుకు మోదీ ప్రభుత్వం తెరవెనుక చర్యలు చేపడుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ‘‘తాజా భారీ టెలికాం కుంభకోణం విలువ రూ. 45,000 కోట్లకు పై మాటే. దానిని మోదీ సర్కారు చాప కింద దాచేస్తోంది’’ అని పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా గురువారం విలేకరుల సమావేశంలో ఆరోపించారు.
భారతి ఎయిర్టెల్, వోడాఫోన్, రిలయన్స్, ఐడియా, టాటా, ఎయిర్‌సెల్ టెలికాం సంస్థలు ఈ స్కాంకు పాల్పడినట్టు ఆరోపణలు గుప్పించారు. దానివల్ల.. ప్రభుత్వానికి రావాల్సిన రూ.12,488.93 కోట్ల మొత్తం రాలేదని కాగ్ పేర్కొనట్టు తెలిపారు. దీనికి జరిమానాలు, ఇతర చార్జీలు అదనం. ఆయా టెలికాం సంస్థల వ్యాపారం, వినియోగదారుల పరిధి, ఆదాయం గణనీయంగా పెరిగినా కూడా - కాగ్ లెక్కించిన ప్రాతిపదికనే ఆయా సంస్థల నిర్వాకం వల్ల 2010-11 నుంచి 2015-16 వరకూ ప్రభుత్వ ఖజానాకు వాటిల్లిన నష్టాన్ని లెక్కిస్తే.. ఆ మొత్తం రూ. 45,000 కోట్లకు పైగా ఉంటుందని ఆరోపించారు.
మరోవైపు 2006-2010 మధ్య దాదాపు రూ.46,000 కోట్ల మేర తక్కువ ఆదాయం చూపించాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) పేర్కొన్న ఆరు కంపెనీలకు ఈ మేరకు నోటీసులు జరీ చేయనున్నట్లు టెలికం మంత్రిత్వశాఖలో ఒక అధికారి తెలిపారు.