బావికి రూ.5వేలు
బావులు తవ్వాలన్నా, బోరు బావులు ఏర్పాటు చేసుకోవాలన్నా, ఇక ప్రభుత్వ అనుమతి తప్పని సరి. దరఖాస్తుతో పాటుగా రూ.5 వేలు ఫీజు చెల్లించే విధంగా కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చారు. గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని చట్టాల్లో ఇందుకు సంబంధించి చేసిన సవరణలకు రాష్ర్ట గవర్నర్ కొణిజేటి రోశయ్య గురువారం ఆమోద ముద్ర వేశారు.
సాక్షి, చెన్నై : ఇటీవల కాలంగా పాత బావుల పునరుద్ధరణ, కొత్తగా బోరు బావుల ఏర్పాటు ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. నీళ్లు పడని పక్షంలో వాటిని అలాగే వదిలి పెట్టడం వలన చిన్నారులు విగత జీవులుగా మారుతున్నారు. ఈ ఘటనల్ని పరిగణనలోకి తీసుకున్న రాష్ర్ట ప్రభుత్వం గ్రామీణ చట్టంలో స్వల్ప సవరణలకు నిర్ణయించింది. బావులు తవ్వాలన్నా, పునరుద్ధరించాలన్నా, మరమ్మతులు చేపట్టాలనా, బోరు బావులు ఏర్పాటు చేసుకోవాలన్నా ముందుగా అనుమతిని తప్పనిసరి చేశారు. ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు దరఖాస్తుతో పాటుగా రూ.5వేలు చెల్లించాలంటూ అనేక నిబంధనల్ని విధించారు. ఈ దరఖాస్తును పరిశీలించినానంతరం, గ్రామ కార్యదర్శి జిల్లా అధికారులకు సమాచారం ఇస్తారు. ఈ ప్రక్రియ ముగియడానికి నెలన్నర రోజులు కాల పరిమితిగా నిర్ణయించారు.
అన్ని రకాల అనుమతులు వచ్చాకే బావుల్ని తవ్వుకోవడం లేదా, మరమ్మతులు చేసుకోవాల్సి ఉంటుంది. బోరు బావులు ఏర్పాటు చేసుకునే వాళ్లు, తాజా చట్టం సవరణ మేరకు అనుమతిని పొందక తప్పదు. మరమ్మతులు చేపట్టే క్రమంలో, తవ్వకాలు జరిపే సమయాల్లో తీసుకున్న భద్రతా చర్యలు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లాల్సి ఉంటుంది. అధికారులు సంతృప్తి వ్యక్తం చేసినానంతరం పనులు మొదలెట్టాలి. ఒక వేళ అధికారులకు అక్కడి ఏర్పాట్లు, అక్కడి పరిస్థితులు అసంతృప్తి కలిగించిన పక్షంలో దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయి. అలాగే, నీళ్లు పడని పక్షంలో ఆ బావులు, బోరు బావులను మూసి వేయడం, ఇనుప పైప్‌లను అమర్చడం, వాటి చుట్టూ అతి పెద్ద ఇనుప రేకుల ద్వారా మూతలు వేయించడం వంటి భద్రతా చర్యలు తీసుకునే విధంగా ఆ చట్టంలో నిబంధనల్ని విధించడం విశేషం.