రూ.570 కోట్లపై సీబీఐ విచారణ
చెన్నై : తిరుపూరులో రూ.570 కోట్లు పట్టుబడిన వ్యవహారంలో కోయంబత్తూరు స్టేట్‌బ్యాంకు అధికారులను సీబీఐ విచారించింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు తిరుపూర్ సమీపంలో చెంగపల్లిలో మూడు కంటైనర్ లారీలు సరైన ఆధారాలు లేకుండా పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నగదు కోయంబత్తూరు స్టేట్‌బ్యాంక్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణం శ్రీపురం ఎస్బీఐకు తీసుకెళుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ నగదును ఆదాయపన్ను శాఖ ఆదేశాల మేరకు కోయంబత్తూరు స్టేట్‌బ్యాంకులో భద్రపరిచారు. అయితే నగదు విషయం తమకు తెలియదని రిజర్వుబ్యాంకు వెల్లడించింది. దీనికి సంబంధించి డీఎంకే దాఖలు చేసిన పిటిషన్ విచారించిన మద్రాసు హైకోర్టు రూ.570 కోట్ల పట్టుబడిన వ్యవహారం పై సీబీఐ విచారణ జరపాలని ఆదేశించింది.
దీంతో ప్రాథమిక విచారణ జరిపిన సీబీఐ అధికారులు నగదుతో పట్టుబడిన లారీల రిజిస్ట్రేషన్ నంబర్లు నకిలీవని న్యాయస్థానంలో సమర్పించిన నివేదికలో తెలియచేశారు. శుక్రవారం తిరుపూర్ కలెక్టర్ జయంతిని కలిసి నగదు స్వాధీనానికి సంబంధించిన ఆధారాలను పొందిన సీబీఐ అధికారులు కోయంబత్తూరు స్టేట్‌బ్యాంకు ప్రధాన కార్యాలయంలో విచారణ జరిపారు.
వారు ఇచ్చిన సమాధానాలు వీడియోలో నమోదు చేశారు. రిజర్వు బ్యాంక్ తరఫున పంపిన రూ.570 కోట్లకు సరైన ఆధారాలు ఎందుకు పంపలేదు. వాటిని దాచాల్సిన అవసరం ఏమిటి? నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్లతో లారీలతో ఎందుకు నగదు పంపాల్సి వచ్చింది, భద్రత లేకుండా అంత మొత్తాన్ని ఎందుకు పంపారు? వంటి ప్రశ్నలను సీబీఐ అధికారులు అడిగారు.